ఎలక్ట్రానిక్ వస్తువులతో వచ్చే సిలికా జెల్‌ను పారేయకండి.. వాటితోనూ లాభాలు ఉంటాయి..!

www.mannamweb.com


కొత్త బ్యాగ్‌లు, షూస్‌, పర్సులు, దుస్తులు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను కొనుగోలు చేసినప్పుడు మనకు వాటిల్లో చిన్న చిన్న ప్యాకెట్లు కనిపిస్తుంటాయి తెలుసు కదా.

అవును.. అవే.. వాటిని సిలికా జెల్ అంటారు. ఆయా వస్తువులలో ఉండే తేమను తొలగించేందుకు వాటిని వాడుతారు. అయితే ఇప్పుడు మేం చెప్పబోయే విషయం తెలిస్తే సిలికా జెల్ ప్యాకెట్లను పడేయరు. వాటి వల్ల మనకు ఉపయోగాలు ఉంటాయి. అవేమిటంటే..

* సాధారణంగా వర్షాకాలం, చలికాలంలలో దుస్తులు ఎక్కువగా తేమగా ఉంటాయి. అలాగే దుస్తుల నుంచి కొన్ని సార్లు దుర్వాసన వస్తుంటుంది. ఈ సమస్యల నుంచి బయట పడాలంటే దుస్తులు ఉండే చోట సిలికా జెల్ ప్యాకెట్లను ఉంచాలి. దీంతో దుస్తులలో ఉండే తేమను ఆ జెల్ పీల్చుకుంటుంది. దుస్తులు పొడిగా మారుతాయి. దుర్వాసన రాకుండా ఉంటాయి.

* మహిళలు వాడే మేకప్ సామగ్రిని ఉంచే బ్యాగుల్లో జిడ్డు ఉంటుంది. తేమగా అనిపిస్తాయి. వస్తువులను ముట్టుకున్నా తేమగా ఉంటాయి. కనుక ఆ బ్యాగుల్లో సిలికా జెల్ ప్యాకెట్లను ఉంచితే ఆయా సమస్యల నుంచి బయట పడవచ్చు.

* పుస్తకాల్లో ఉండే కాగితాలు కొంత కాలానికి పసుపు రంగులోకి మారుతాయి. అలాగే పాస్‌పోర్ట్‌, సర్టిఫికెట్లు, ఇతర ముఖ్యమైన పత్రాలు కూడా కాలం గడిచేకొద్దీ రంగు మారుతుంటాయి. అలా కాకుండా ఉండాలంటే వాటిని భద్ర పరిచే చోట సిలికా జెల్ ప్యాకెట్లను ఉంచాలి. ఆయా పత్రాలు ఎప్పటికీ పాడు కాకుండా ఉంటాయి.

* జిమ్ వస్తువులను ఉంచే బ్యాగుల్లోనూ లేదా ఇతర బ్యాగులు, వస్తువులు తేమకు గురి కాకుండా ఉండాలంటే వాటిని ఉంచే చోట సిలికా జెల్ ఉంచితే చాలు. అవి తేమ అనిపించవు. పొడిగా ఉంటాయి.