17 నెలల బుడ్డది ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తుంది. తన అద్బుత మేధస్సుతో ప్రపంచ రికార్డు సైతం సాధించింది. పిట్ట కొంచెం కూత ఘనం అనే రేంజ్ లో అసాధారణ ప్రతిభ కనబరిచిన చిన్నారి ఆంధ్రప్రదేశ్ లోని ఒంగోలుకి చెందిన వారు కావడం గమనార్హం.
ఇప్పుడు ఈ వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే…
ఒంగోలు పట్టణంలో అంబటి సాయికుమార్, ప్రణతి నివసిస్తున్నారు. వారికి ఖస్వి అనే ఒక కుమార్తె ఉంది. 17 నెలల వయస్సు ఉన్న ఈ చిన్నారి.. వరల్డ్ రికార్డ్ సృష్టించింది. 24 వేర్వేరు కేటగిరీల్లో 650కి పైగా ఇంగ్లీష్ పదాలను స్పష్టంగా పలికి అందరికీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. బాలిక ప్రతిభకు “నోబెల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ” లో స్థానం దక్కింది. గతంలో ఈ రికార్డు 4 సంవత్సరాల 3 నెలల వయసున్న చిన్నారి పేరిట ఉంది. ఆ బుడ్డది 300 పదాలు పలకగా.. ఇప్పుడు ఖస్వి అంత కన్నా తక్కువ వయస్సులో 2 రెట్లు ఎక్కువ పదాలను పలికి ఘనత సాధించింది.
అంబటి ఖశ్వి ఫ్రూట్స్, వెజిటబుల్స్, కలర్స్, యానిమల్స్, బర్డ్స్, డైలీ యూజ్ ఐటెమ్స్, బాడీ పార్ట్స్, వాహనాలు, ఆల్ఫాబెట్లు, నంబర్లు, రైమ్స్ వంటి విభాగాల్లో పదాలను పలుకుతుందని తెలుస్తోంది. కాగా ఈ ఘనతను గుర్తిస్తూ ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ ఖశ్విని ప్రత్యేకంగా అభినందించారు. చిన్నారిలో ఉన్న మేధస్సు, ప్రతిభను ప్రశంసించారు. చిన్నారిని జిల్లాకు గర్వకారణంగా అభివర్ణించారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. చిన్న వయస్సులో ఇంతటి ప్రతిభను కనబరచడం అద్భుతం అని.. బాలికను ప్రోత్సహించిన వారి తల్లిదండ్రులను సైతం మెచ్చుకున్నారు. ఖశ్విని చూసి పలువురు ప్రముఖులు సైతం ప్రశంసలు కురిపిస్తూ ఆశీర్వదిస్తున్నారు.
































