ఏప్రిలియా నుంచి 175 సీసీ స్కూటర్‌.. ధర ఎంతంటే?

ఇటలీకి చెందిన స్కూటర్‌ కంపెనీ ఏప్రిలియా ప్రీమియం శ్రేణిలో ఎస్‌ఆర్‌ 175 పేరిట కొత్త స్కూటర్‌ను మార్కెట్‌లోకి విడుదల చేసింది. దీని ప్రారంభ ధర రూ.1.26 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించింది. గతంలో తీసుకొచ్చిన ఎస్ఆర్ 160 స్థానంలో 175 మోడల్‌ను విడుదల చేశారు. లుక్‌ పరంగా ఇది ఎస్ఆర్ 160 మోడల్‌ను పోలి ఉన్నప్పటికీ అధిక సామర్థ్యం కలిగిన ఇంజిన్‌ ఉండడంతో మెరుగైన పనితీరు కనబరుస్తుంది.


ఈ ప్రీమియం స్కూటర్‌లో 174.7 సీసీ సింగిల్‌ సిలిండర్‌ ఎయిర్‌-కూల్డ్‌ ఇంజిన్‌ను త్రీ వాల్వ్‌ సెటప్‌తో తీసుకొచ్చారు. ఇది 7200 ఆర్‌పీఎం వద్ద 12.92హెచ్‌పీ శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఎస్‌ఆర్‌ 160లో 11.27 హెచ్‌పీ మాత్రమే ఉండేది. పీక్‌ టార్క్‌ కూడా 13.44 ఎన్‌ఎం నుంచి 14.14 ఎన్‌ఎంకు పెరిగింది. కలర్‌ టీఎఫ్‌టీ డిస్‌ప్లే బ్లూటూత్‌ కనెక్టివిటీతో వస్తోంది. కాల్ నోటిఫికేషన్‌లు, అలర్ట్‌లు, మ్యూజిక్ కోసం స్మార్ట్‌ఫోన్‌ను దీనికి కనెక్ట్‌ చేయొచ్చు. ఫ్రేమ్‌, సస్పెన్షన్‌, బ్రేక్‌లు, టైర్లు వంటి భాగాలు ఎస్‌ఆర్160 మోడల్‌ మాదిరిగానే ఉంటాయి.

ఈ స్కూటర్‌ ముందు, వెనక 14 అంగుళాల టైర్లను అమర్చారు. వెడల్పు 120 సెక్షన్‌ ఉంటుంది. బ్రేకింగ్‌ సింగిల్ ఛానల్‌ ఏబీఎస్‌తో ఉన్న ఫ్రంట్‌ డిస్క్‌, వెనక డ్రమ్‌ బ్రేక్‌తో పనిచేస్తుంది. ఇది రెడ్‌-వైట్‌ లేదా పర్పుల్-రెడ్ కాంబినేషన్‌లో వస్తోంది. వినియోగదారులను ఆకర్షించేలా బ్రాండ్‌ మిడిల్‌ వెయిట్‌ స్పోర్ట్‌ బైక్‌ ఆర్‌ఎస్ 457ను పోలిన కొత్త పెయింట్‌ స్కీమ్‌తో దీన్ని తీర్చిదిద్దారు. స్పోర్టీ డిజైన్‌తో రావడం వల్ల హీరో జూమ్‌ 160, యమహా ఏరోక్స్ 155 వంటి వాహనాలకు గట్టి పోటీ ఇస్తుంది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.