కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుపై మంత్రివర్గ ఉపసంఘం, రెవెన్యూ శాఖలు స్పష్టత నిచ్చాయి. ప్రస్తుతం ప్రకాశం జిల్లాలో ఉన్న మార్కాపురం, చిత్తూరు జిల్లాలోని మదనపల్లెను కొత్త జిల్లాలుగా ఏర్పాటు చేయాలనే అభిప్రాయానికి వచ్చాయి. జిల్లాలు, డివిజన్ల పునర్వ్యవస్థీకరణపై బుధవారం రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ అధ్యక్షతన సచివాలయంలో మంత్రివర్గ ఉపసంఘం మరోసారి సమావేశమైంది. ఇప్పటిదాకా వచ్చిన ప్రతిపాదనలు, వాటిలోని సాధ్యాసాధ్యాలు, శాఖాపరమైన సూచనలపై రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, సీసీఎల్ఏ(ఇన్చార్జి) జి.సాయిప్రసాద్ ప్రజంటేషన్ ఇచ్చారు. దీని ప్రకారం… కొత్తగా రెండు జిల్లాలు, ఏడు రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనలను పరిశీలించారు. దీని ప్రకారం… పీలేరు, మదనపల్లె రెవెన్యూ డివిజన్లతో ‘మదనపల్లె జిల్లా’ను ఏర్పాటు చేసే అవకాశముంది. ఇందులో మదనపల్లె, తంబళ్లపల్లె, పుంగనూరు, పీలేరు నియోజకవర్గాలు ఉండే అవకాశముంది. మదనపల్లె రాష్ట్రంలోనే అతిపెద్ద డివిజన్. కొత్తగా పీలేరును కూడా డివిజన్గా చేయాలన్న ప్రతిపాదన రెవెన్యూశాఖ నుంచే వచ్చింది. పలమనేరు నియోజకవర్గంలోని ఆరు మండలాలు, చిత్తూరు డివిజన్లోని కొన్ని మండలాలతో కొత్తగా మదనపల్లె జిల్లా ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. ఇందులో సదుం, సోమల, చౌడేపల్లె, పుంగనూరు, రొంపిచర్ల, పులిచెర్ల మండలాలు ఉండనున్నాయి. మదనపల్లెలోని 11 మండలాలు ఎలాగూ ఉంటాయి. ఇక రాయచోటి డివిజన్లోని 4 మండలాలను (పీలేరు, గుర్రంకొండ, కలకడ, కంభంవారిపల్లె) కొత్త జిల్లాలో కలపాలని ప్రతిపాదించారు. మొత్తంగా ప్రతిపాదిత మదనపల్లె డివిజన్లో 28 మండలాలు ఉంటాయి.
‘మార్కాపురం జిల్లా’ ఇలా…
మార్కాపురం, కనిగిరి, గిద్దలూరు రెవెన్యూ డివిజన్లతో కొత్తగా ‘మార్కాపురం జిల్లా’ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. ఇందులో… గిద్దలూరు రెవెన్యూ డివిజన్ను కొత్తగా ఏర్పాటు చేస్తారు. మార్కాపురం జిల్లాలో 21 మండలాలు ఉండనున్నాయి. ఒకప్పుడు కందుకూరు డివిజన్ ప్రకాశం జిల్లాలో భాగంగా ఉండేది. జగన్ హయాంలో దీనిని నెల్లూరులో కలిపేశారు. ఇప్పుడు… మళ్లీ కందుకూరు డివిజన్లోని ఐదు మండలాలను (కందుకూరు, లింగసముద్రం, గుడ్లూరు, ఉలవపాడు, ఓలేటివారిపాలెం)లను ప్రకాశంలో కలపాలని ప్రతిపాదించారు.
కొత్తగా మరో 7 రెవెన్యూ డివిజన్లు
- ప్రస్తుతం రాష్ట్రంలో 77 రెవెన్యూ డివిజన్లున్నాయి. కొత్తగా మరో ఆరేడు డివిజన్లు ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనలు మంత్రివర్గ ఉపసంఘం ముందుకు వచ్చాయి. నక్కపల్లి (పాయకరావుపేట), అద్దంకి, మడకశిర, బనగానపల్లి, పీలేరు, అవనిగడ్డ, గిద్దలూరుతోపాటు మరికొన్ని కొత్త డివిజన్లు ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనలు వచ్చాయి.
- పారిశ్రామిక క్లస్టర్లో భాగమైన నక్కపల్లి మండలం ప్రస్తుతం నర్సీపట్నం డివిజన్లో ఉంది. అయితే… పాయకరావుపేట కేంద్రంగా నక్కపల్లి డివిజన్ను ఏర్పాటు చేస్తారా? లేక ఆ డివిజన్కే ‘పాయకరావుపేట’ పేరు పెడతారా? అనే అంశంపై త్వరలో స్పష్టత వస్తుంది. ఈ డివిజన్లో యలమంచిలి, నక్కపల్లి, పాయకరావుపేట, కోటవురట్ల, రాయవరం మండలాలు ఉండాలని ప్రతిపాదించారు.
- అద్దంకి ప్రస్తుతం బాపట్ల జిల్లాలో ఉంది. దానిని ఐదు మండలాలతో రెవెన్యూ డివిజన్గా మార్చి ప్రకాశం జిల్లాలో కలపాలని మంత్రి గొట్టిపాటి రవి కోరుతున్నారు. రెవెన్యూ శాఖ కూడా ఈ ప్రతిపాదన చేసింది.
- ఒంగోలు, కనిగిరి డివిజన్లలో ఉన్న మర్రిపూడి, పొన్నలూరు, కొండపి, జరుగుమిల్లి, సింగరాయకొండ, టంగుటూరు మండలాలను కందుకూరులో విలీనం చేయాలి.
- ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలో పుంగనూరును రెవెన్యూ డివిజన్ చేయాలన్న ప్రతిపాదన పరిశీలనకు వచ్చింది. అయితే, దానికన్నా పెద్దదయిన పీలేరునే రెవెన్యూ డివిజన్ చేయాలని రెవెన్యూ శాఖ తాజాగా ప్రతిపాదించినట్లు తెలిసింది.
- బనగానపల్లె నియోజకవర్గానికి ఆర్అండ్బీ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. బనగానపల్లెను రెవెన్యూ డివిజన్ చేయాలని ఆయన తొలి నుంచి కోరుతున్నారు.
- అవనిగడ్డను డివిజన్ చేయాలన్న ప్రతిపాదన కృష్ణా జిల్లా యంత్రాంగం నుంచి వచ్చింది. దీనిపై ఉపసంఘం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
- మరి కొన్ని కీలక ప్రతిపాదనలు
- శ్రీకాకుళం జిల్లా నందిగామ, టెక్కలి మధ్య దూరం 11.5 కిలోమీటర్లు. కానీ… నందిగాం మండలం 21 కిలోమీటర్ల దూరంలో ఉన్న పలాస డివిజన్లో ఉంది. అందువల్ల… నందిగాం మండలాన్ని టెక్కలిలో కలపాలి.
- అల్లూరి జిల్లాలోని రంపచోడవరం, చింతూరు డివిజన్లను తిరిగి తూర్పు గోదావరిలో కలపాలని ప్రతిపాదించారు. పెదబయలు మండలాన్ని విభజించి కొత్తగా గోమంగి మండలాన్ని ఏర్పాటు చేయాలని రెవెన్యూ శాఖ కోరింది.
- రంపచోడవరం నియోజకవర్గం, దాని పరిధిలోని రంప, చింతూరు డివిజన్లను తూర్పు గోదావరిలో కలపాలని ప్రతిపాదించారు. రంపచోడవరంలో 8 మండలాలు, చింతూరులో 4 మండలాలున్నాయి.
- కోనసీమలోని రాయవరం, కపిలేశ్వరపురం, మండపేట మండలాలను రాజమండ్రి డివిజన్లో కలపాలని ప్రతిపాదించారు. రామచంద్రాపురం నియోజకవర్గంలోని కాజులూరును కోనసీమలోని రామచంద్రాపురం డివిజన్లో కలపాలని ప్రతిపాదించారు.
- కాకినాడ డివిజన్లో ఉన్న సామర్లకోటను తిరిగి పెద్దాపురం డివిజన్లోకి తీసుకురావాలి.
- పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం డివిజన్లో ఉన్న గణపవరం మండలాన్ని తిరిగి ఏలూరు జిల్లాలోకి తీసుకురావాలి.
- ఏలూరు జిల్లాలోని నూజివీడు డివిజన్లో ఉన్న నూజివీడు, ఆగిరిపల్లి, ముసునూరు, చాట్రాయి మండలాలను ఎన్టీఆర్ జిల్లాలోకి తీసుకురావాలి. అంటే… ఈ డివిజన్ ఎన్టీఆర్ జిల్లాలో భాగమవుతుంది.
- ప్రస్తుతం నూజివీడు డివిజన్లో ఉన్న చింతలపూడి, లింగపాలెం మండలాలను జంగారెడ్డిగూడెం డివిజన్లో కలపాలి.
- ఏలూరు డివిజన్లో ఉన్న కైకలూరు నియోజకవర్గంలోని మండవల్లి, కైకలూరు, కలిదిండి, ముదినేపల్లి మండలాలను కృష్ణా జిల్లాలోకి తీసుకురావాలి.
- గన్నవరం నియోజకవర్గంలోని బాపులపాడు, గన్నవరం, ఉంగుటూరులను ఎన్టీఆర్ జిల్లాలో కలపాలి. పరిపాలనా సౌలభ్యం కోసం ఈ ప్రతిపాదన చేశారు.
- కొత్తగా గిద్దలూరు డివిజన్ను ప్రతిపాదించారు. ఇందులో గిద్దలూరుతోపాటు బేస్తవారిపేట, రాచర్ల, కొమరవోలు, కుంభం, అర్ధవీడు మండలాలున్నాయి.
- గూడూరు డివిజన్లోని ఐదు మండలాలు (గూడూరు, చిల్లకూరు, కోట, వాకాడు, చిత్తమూరు) తిరుపతి జిల్లాలో ఉన్నాయి. వాటిని తిరిగి నెల్లూరు జిల్లాలోకి తీసుకురావాలని ప్రతిపాదన.
- కందుకూరు డివిజన్లోని 2 మండలాలు, ఆత్మకూరు డివిజన్లోని మరో 2 మండలాలను కావలిలో కలపాలి. అవన్నీ ఉదయగిరి నియోజకవర్గం పరిధిలోనివే.
- బాపట్ల రెవెన్యూ డివిజన్లోని మూడు మండలాలను (పరుచూరు, మార్టూరు, యద్దనపూడి ) చీరాల డివిజన్లో కలపాలి. ఇవన్నీ పర్చూరు అసెంబ్లీ నియోజకవర్గంలోని మండలాలు.
- చిత్తూరు జిల్లా నగరి డివిజన్లోని మూడు మండలాలు(నింద్ర, విజయపురం, నగరి) తిరుపతి జిల్లాలో కలపాలి. మిగిలిన కార్వేటినగరం, పాలసముద్రం మండలాలను చిత్తూరు డివిజన్లో విలీనం చేయాలి.
- పలమనేరు డివిజన్లోని బంగారుపాలెం మండలాన్ని చిత్తూరు డివిజన్లో విలీనం చేయాలి.
- తిరుపతి డివిజన్లో ఉన్న వడమాలపేట, పుత్తూరులను నగరి డివిజన్లో కలపాలి.
- గూడూరు డివిజన్లోని వెంకటగిరి, బాలయ్యపల్లె, డక్కిలి మండలాలను శ్రీకాళహస్తిలో విలీనం చేయాలి.
- పెనుకొండ డివిజన్లో ఉన్న ఐదు మండలాలతో మడకశిర డివిజన్ ఏర్పాటు చేయాలి. ఇందులో మడకశిర, గుడిబండ, రొళ్ల, అమరాపురం, అగలి ఉన్నాయి.
- కర్నూలు జిల్లా పరిధిలోని ఆదోని మండలాన్ని విభజించి పెద్దహరివానం అనే కొత్త మండలం ఏర్పాటు చేయాలి.
మార్పులు పరిమితంగానే
చాలా పరిమితంగా జిల్లా, డివిజన్, మండలాల పునర్వ్యవస్థీకరణ చేపట్టాలని మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించింది. ఇప్పటికే ఏపీకి అఖిల భారత సర్వీసు అధికారుల కొరత తీవ్రంగా ఉందని, దీన్ని దృష్టిలో పెట్టుకొని నిర్ణయాలు తీసుకోవాలని భావిస్తోంది. కొత్తగా రెండు జిల్లాలకే పరిమితం కావాలని, డివిజన్ల విషయంలో ఆచితూచి నిర్ణయం తీసుకోవాలని మంత్రులు నిర్ణయించారు. జగన్ సర్కారు చేసిన తప్పిదాలకు పరిష్కారం చూపుతూనే, కొన్ని ప్రాంతాల ప్రజల చిరకాల డిమాండ్లను నెరవేర్చే దిశగా ప్రతిపాదనలు ఉండాలని మంత్రులు స్పష్టం చేసినట్లు తెలిసింది.
మరోసారి చర్చిస్తాం: మంత్రి అనగాని
ఉపసంఘం ముందుకు రెవెన్యూశాఖ తీసుకొచ్చిన అనేక ప్రతిపాదనలపై కీలక చర్చ జరిగింది. అయుతే, డివిజన్లపై మరింత స్పష్టత తీసుకురావాలని మంత్రులు సూచించారు. ఈ నేపథ్యంలో మరోసారి సమావేశం కావాలని నిర్ణయించినట్లు రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ విలేకరులతో చెప్పారు. వనరులను దృష్టిలోపెట్టుకొని, పరిమితంగానే పునర్వ్యవస్థీకరణ ఉంటుందని స్పష్టం చేశారు.
































