private schools: ప్రైవేటు బడుల్లో 25శాతం ఉచిత సీట్లెలా?

హైదరాబాద్‌: విద్యాహక్కు చట్టం ప్రకారం ప్రైవేటు పాఠశాలల్లో 25 శాతం సీట్లను బలహీనవర్గాలకు కేటాయిస్తామని హైకోర్టులో అంగీకరించిన రాష్ట్ర ప్రభుత్వం.. దాన్ని ఎలా అమలు చేయాలో తేల్చుకోలేక మల్లగుల్లాలు పడుతోంది. కర్ణాటక తరహాలో ప్రభుత్వ పాఠశాలలు లేని ఆవాసాల్లోని విద్యార్థులకు మాత్రమే సీట్లు కేటాయించడం అన్నివిధాలా శ్రేయస్కరమని భావిస్తున్నా ఇంకా తుది నిర్ణయానికి రాలేకపోతోంది. విద్యాహక్కు చట్టాన్ని అమలు చేయడం లేదన్న కేసులో.. చట్టంలోని సెక్షన్‌ 12(1)(సి)ని అమలు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ఆరు నెలల క్రితం హైకోర్టులో అంగీకరించింది. అంటే ప్రైవేటు పాఠశాలల్లో 25 శాతం సీట్లను ప్రభుత్వమే పేద విద్యార్థులకు కేటాయించాలి. వారి ఫీజును సైతం చెల్లించాల్సి ఉంటుంది. వచ్చే విద్యాసంవత్సరం(2025-26) ప్రారంభం నాటికి చట్టాన్ని అమలు చేస్తామని హామీ ఇచ్చి ఉండటంతో విధివిధానాలు రూపొందించేందుకు కసరత్తు చేపట్టింది.


విద్యాహక్కు చట్టంలోని నిబంధన ఇదీ…
విద్యాహక్కు చట్టం-2009లోని సెక్షన్‌ 12(1)(సి) ప్రకారం అన్‌-ఎయిడెడ్‌(ప్రైవేటు) పాఠశాలల్లో 1 నుంచి 8వ తరగతి వరకు ఉన్న సీట్లలో 25 శాతం పరిసర ప్రాంతాలకు చెందిన బలహీనవర్గాలు, అనాథలు, ఎయిడ్స్‌ బాధిత కుటుంబాల పిల్లలకు కేటాయించాలి. అందుకయ్యే ఖర్చును ప్రభుత్వం నుంచి పాఠశాల యాజమాన్యం తిరిగి పొందొచ్చు. విద్యాహక్కు చట్టం ప్రకారం విద్యార్థులుండే ఆవాసానికి కిలోమీటరు దూరంలోపు ప్రాథమిక పాఠశాల, 3 కి.మీ.లోపు ప్రాథమికోన్నత, 5 కి.మీ.లోపు ఉన్నత పాఠశాల ఉండాలంటూ ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం 2011 మార్చి 3న జీఓ 20 జారీ చేసింది. ఆ దూరం పరిధిలో ప్రభుత్వ పాఠశాలలు ఉన్నా… పరిసర ప్రాంతంలోని ప్రైవేటు బడిలో తమ పిల్లలకు సీట్లు కావాలని తల్లిదండ్రులు అడగవచ్చు. ఈ నిబంధనను అమలు చేయడం లేదన్న అంశంపై ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పటి నుంచే హైకోర్టులో కేసు నడుస్తోంది. ఈ నేపథ్యంలోనే చట్టంలోని సెక్షన్‌ 12(1)(సి)ని అమలు చేస్తామని గత అక్టోబరులో ప్రభుత్వం అంగీకరించింది.

చట్టంలోనూ సవరణ తప్పదు..
దేశంలోని కొన్ని రాష్ట్రాలు ఇప్పటికే సెక్షన్‌ 12(1)(సి) అమలు చేస్తున్నాయి. కర్ణాటక తరహాలో ఇక్కడా అమలు చేయాలని 2019 నుంచే తెలంగాణ విద్యాశాఖ అధికారులు ప్రతిపాదిస్తున్నారు. ఆ ప్రకారం విద్యార్థులుండే ఆవాసానికి నిర్దిష్ట దూరంలో ప్రభుత్వ బడి లేకుంటేనే ప్రైవేటులో సీట్లు ఇవ్వాలని, లేకపోతే ప్రభుత్వ పాఠశాలలు నిరుపయోగంగా మారతాయని సర్కారు భావిస్తున్నట్లు సమాచారం. అలా చేయాలంటే ఇప్పుడున్న చట్టంలో కేంద్రం సవరణ చేయాల్సి ఉంటుందని చెబుతున్నారు. చట్టం అమలుపై గత కొద్దిరోజులుగా అధికారులు పలుమార్లు సమావేశమై చర్చించారు. తాజాగా సీఎం కార్యదర్శి(విద్య) మాణిక్‌రాజ్‌ ఆధ్వర్యంలో విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా, పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు ఈవీ నరసింహారెడ్డి, కళాశాల విద్యాశాఖ కమిషనర్‌ శ్రీదేవసేన, ప్రత్యేక కార్యదర్శి హరిత, అదనపు సంచాలకులు పీవీ శ్రీహరి, లింగయ్య తదితరులు సమావేశమై సుదీర్ఘంగా చర్చించారు. సెక్షన్‌ 12(1)(సీ)ని అమలు చేయాలంటే తొలుత ఒకటి, మూడు, ఐదు కిలోమీటర్ల పరిధిలో ప్రైవేటు పాఠశాలలను ఆయా ఆవాసాలకు మ్యాపింగ్‌ చేయాలి. ఆ పరిసర ప్రాంతాల్లోని బడుల్లోనే విద్యార్థులను చేర్పించాల్సి ఉంటుంది. దానికితోడు ప్రైవేటు పాఠశాలల ఫీజు ఎంతో నిర్ణయించాలి. లేదా బడ్జెట్‌ ప్రకారం ఒక్కో విద్యార్థిపై రాష్ట్ర ప్రభుత్వం రూ.1.10 లక్షలు వ్యయం చేస్తున్నందువల్ల ఆ మొత్తాన్ని ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలకు చెల్లించాల్సి ఉంటుంది. దరఖాస్తుల స్వీకరణకు ప్రత్యేకంగా పోర్టల్‌ రూపొందించాలి. 25 శాతం సీట్లలో రిజర్వేషన్‌ కూడా ఖరారు చేయాలి. ప్రవేశాలకు లాటరీ విధానం పాటించాలా? మరొకటా? అనేది నిర్ణయించాలి. వీటిపై న్యాయనిపుణుల అభిప్రాయాలను స్వీకరించి తుది నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది.