TG ప్రభుత్వ స్కూళ్లలో 2,837 ఉద్యోగాలు.. నెలకు రూ.15 వేలు జీతం, అర్హులు వీరే

తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో సాంకేతిక విద్యను పటిష్టం చేయడానికి, కంప్యూటర్‌ టీచర్లు (ఐసీటీ ఇన్‌స్ట్రక్టర్లు) లేదా బోధకులను నియమించాలని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.


దాదాపు రెండు దశాబ్దాల సుదీర్ఘ విరామం తర్వాత ఈ నియామకాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ప్రస్తుతం, రాష్ట్రంలో ఐదు లేదా అంతకంటే ఎక్కువ కంప్యూటర్లు కలిగిన పాఠశాలలు 2,837 ఉన్నట్లు గుర్తించారు. ఈ కంప్యూటర్‌ ల్యాబ్‌లను పూర్తిగా ఉపయోగించుకోవడానికి.. అలాగే విద్యార్థులకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంలో శిక్షణ ఇవ్వడానికి, పొరుగు సేవల విధానంలో ఈ కంప్యూటర్ టీచర్లను నియమించనున్నారు. త్వరలో తెలంగాణ టెక్నాలజీ సర్వీసెస్‌ (TGTS) ద్వారా ఈ నియామక ప్రక్రియ చేపట్టడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.

ఎంపికైన ఐసీటీ ఇన్‌స్ట్రక్టర్లకు ప్రభుత్వం గౌరవ వేతనంగా నెలకు రూ. 15,000 చొప్పున చెల్లించాలని నిర్ణయించింది. ఈ వేతనాన్ని ఏడాదిలో పది నెలలపాటు చెల్లిస్తారు. ఈ ఖర్చును సమగ్ర శిక్షా నిధుల నుంచి వినియోగించనున్నారు. కంప్యూటర్‌ వినియోగంపై పూర్తి అవగాహన ఉన్నవారిని అర్హులు గుర్తించి నియామకాలు చేపట్టనున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇరవై ఏళ్ల క్రితం సుమారు 4,200 పాఠశాలల్లో కంప్యూటర్లు సమకూర్చారు. అప్పట్లో ఐదేళ్ల కాలపరిమితికి కంప్యూటర్‌ ఇన్‌స్ట్రక్టర్లను నియమించారు. అయితే వారిని తొలగించిన తర్వాత సరైన పర్యవేక్షణ లేక కంప్యూటర్‌ ల్యాబ్‌లు నిరుపయోగంగా మారాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు కొత్తగా నియమించబోయే బోధకులు ల్యాబ్‌ల నిర్వహణతో పాటు, విద్యార్థులకు డిజిటల్ అక్షరాస్యతను అందించడంలో కీలక పాత్ర పోషించనున్నారు.

విద్యా శాఖ ఇటీవల చేపట్టిన పలు డిజిటల్ కార్యక్రమాల సమర్థవంతమైన అమలుకు కూడా ఈ టీచర్ల నియామకం చాలా అవసరం. విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యాలు పెంచాలనే లక్ష్యంతో విద్యాశాఖ.. బెంగళూరుకు చెందిన ఏక్‌స్టెప్‌ ఫౌండేషన్‌ సహకారంతో గత ఏడాది ఫిబ్రవరి నుంచి 1,354 పాఠశాలల్లో ‘అసిస్టెడ్‌ లాంగ్వేజ్‌ అండ్‌ మ్యాథ్స్‌ లెర్నింగ్‌ ప్రోగ్రామ్‌’ను అమలు చేస్తోంది. అంతేకాకుండా, ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచే ఆన్‌లైన్ విధానంలో ఆరో తరగతి నుంచి ఇంటర్ వరకు విద్యార్థులకు గణితం, సైన్స్ పాఠాలు సులువుగా అర్థమయ్యేలా ‘ఖాన్‌ అకాడమీ’ తరగతులను కూడా ప్రారంభించారు. ఈ ఆన్‌లైన్, అసిస్టెడ్‌ లెర్నింగ్ ప్రోగ్రామ్‌లు విజయవంతం కావాలంటే, కంప్యూటర్లపై, సాఫ్ట్‌వేర్‌లపై పూర్తి అవగాహన ఉన్న బోధకులు తప్పనిసరి. ఈ కొత్త నియామకాలతో ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ విద్యకు కొత్త ఊపు రానుంది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.