ప్రభుత్వ ప్రకటనతో పింఛను లబ్ధిదారుల్లో ఆనందంకలెక్టరేట్, నక్కపల్లి, న్యూస్‌టుడే
నక్కపల్లి మండలం డి.ఎల్.పురానికి చెందిన చినతాతారావు చేపల వేట నిమిత్తం ఒడిశాలో ఉంటాడు.
ప్రతినెలా పింఛన్ నిమిత్తం ఛార్జీలు చెల్లించి గ్రామానికి రావాల్సి వస్తోంది. దీంతో పింఛనులో సగం సొమ్ము రానూపోనూ ఛార్జీలకే సరిపోతోంది.
సబ్బవరం మండలానికి చెందిన శ్రీలక్ష్మి సెప్టెంబర్‌లో విజయవాడ బంధువుల ఇంటికి వెళ్లారు. పింఛను ఇచ్చే సమయానికి రాలేకపోవడంతో ఆ నెల పింఛను చేజారిపోయింది. అక్టోబరులో పింఛను తీసుకునే క్రమంలో ఒక నెల పింఛను మాత్రమే ఇచ్చారు.
అవకాశం కుదరని వారు ఇకపై ప్రతినెలా కచ్చితంగా పింఛను తీసుకుని తీరాల్సిన అవసరం లేదు. మూడు నెలలకోసారి మొత్తం సొమ్ము తీసుకునే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అందుబాటులో లేనివారికి ప్రభుత్వం కల్పించిన సదుపాయం ద్వారా ఒకే సారి భారీ మొత్తంలో నగదు అందడంతోపాటు ఆర్థిక అవసరాలు తీరతాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రూ. 3 వేలు ఉన్న పింఛన్ సొమ్మును రూ. 4 వేలకు పెంచడంతోపాటు దివ్యాంగులు, మంచాలకే పరిమితమైన వారికి అందించే లబ్ధి భారీగా పెంచింది. చాలా కుటుంబాలకు ఇది ఆర్థిక అవసరాలను తీర్చుతోంది. కాగా ఇందులో అనేకమంది వైద్యం, కుటుంబ అవసరాల రీత్యా ఇతర ప్రాంతాల్లో ఉంటూ ప్రతినెలా సొంత గ్రామానికి వచ్చి పింఛన్ తీసుకుంటున్నారు. దీంతో ఇది వారికి ఇబ్బందిగా మారడమే కాకుండా, పింఛను సొమ్ములో చాలామేర ఛార్జీల నిమిత్తం పోతోంది.
ఇకపై ఇలాంటి ఇబ్బంది లేకుండా మూడు నెలలకోసారి వచ్చి, మొత్తం సొమ్ము ఒకేసారి తీసుకోవచ్చంటూ సీఎం చంద్రబాబునాయుడు చేసిన ప్రకటనతో ఇలాంటి వారికి అమితానందాన్ని నింపింది. జిల్లాలో ప్రతినెలా 2.6 లక్షల మంది వివిధ రకాల పింఛన్లను పొందుతున్నారు. ఇంతవరకు వీరంతా ప్రతినెలా తమ గ్రామాల్లోనే పింఛన్లు పొందాల్సిందే. ఆసుపత్రుల్లో చికిత్స పొందుతుంటే కొంతమంది సచివాలయ ఉద్యోగులు మానవతా దృక్పథంతో వారి వద్దకే వెళ్లి పింఛన్లు అందిస్తున్నారు. కాగా వివిధ పనులపై ఇతర ప్రాంతాలకు వలస వెళ్లేవారు సొంత గ్రామాలకు కచ్చితంగా వచ్చి తీసుకోవడం దూరాభారంతో పాటు, ఖర్చులు అవుతున్నాయి. రాలేనివారు ఆనెల సొమ్మును నష్టపోవాల్సి వస్తోంది. తెదేపా హయాంలో 2014-19 మధ్యన మూడు నెలలకోసారి పింఛను మొత్తం తీసుకునే సదుపాయం ఉండేది. వైకాపా పాలనలో దీన్ని రద్దు చేశారు. లబ్ధిదారుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకున్న సీఎం చంద్రబాబు తిరిగి పాత విధానాన్ని అమలు చేస్తూ.. మొదటి రెండు నెలలపాటు ఎవరైనా పింఛన్ పొందకపోతే, ఈ మొత్తాన్ని రెండో నెలగాని, మూడో నెలతోగాని కలిపి తీసుకోవచ్చని ప్రకటించారు.
ఆసుపత్రిలో ఉన్నవారికి పింఛన్ ఇస్తున్న ఉద్యోగులు
జిల్లాలో 14 రకాల పింఛనుదారులు ఉన్నారు. 24 మండలాలు, అనకాపల్లి పట్టణం, ఎలమంచిలి, నర్సీపట్నం మున్సిపాల్టీల పరిధిలో 2,59,778 మంది లబ్ధిదారులున్నారు. వీరికి ప్రతినెలా రూ. 107.16 కోట్ల మేర ఉద్యోగులు ఇంటింటికీ వెళ్లి అందిస్తున్నారు. ప్రతినెలా వివిధ కారణాల వల్ల 1400-1600 మంది పింఛను తీసుకోవడం లేదు. ఇందులో 800 వరకు మరణాలు ఉంటున్నాయి. మిగిలిన వారిలో ఉపాధి నిమిత్తం ఇతర ప్రాంతాల్లో ఉండిపోవడం, ఆసుపత్రులకు వెళ్లడం, కుటుంబ సభ్యుల వద్ద ఉండటం జరుగుతోంది.
మూడు నెలల్లో 4424 మంది పింఛను అందుకోలేదు. వీరిలో చాలామంది వివిధ కారణాలతో ప్రతినెలా 1, 2 తేదీల్లో ఇంటి వద్ద నగదు ఇచ్చే సమయంలో అందుబాటులో లేకపోవడంతో పింఛను అందుకోలేక పోతున్నారు.
జాబితా సిద్ధం చేస్తాం
ప్రతి నెలా 1500 మంది వరకు పింఛను తీసుకోవడం లేదు. వీరిలో చాలామంది ఇంటి వద్ద పింఛను ఇచ్చే సమయంలో అందుబాటులో లేనివారు ఉన్నారు. మూడు నెలలపాటు పింఛను అందుకోలేని వారి జాబితాను సిద్ధం చేస్తాం. ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందిన వెంటనే లబ్ధిదారులకు చెల్లిస్తాం.