రైల్వే శాఖలోని పలు విభాగాల్లో దాదాపు 32 వేల లెవెల్ -1 (గ్రూప్ డి) ఉద్యోగాల భర్తీకి రంగం సిద్ధం చేస్తోన్న రైల్వే బోర్డు..
విద్యార్హతల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఉద్యోగాల భర్తీకి అవసరమైన కనీస విద్యార్హత ప్రమాణాలను సడలించింది. కొత్త ప్రమాణాల ప్రకారం.. పదో తరగతి లేదా ఐటీఐ డిప్లమా లేదా నేషనల్ కౌన్సిల్ ఫర్ వొకేషనల్ ట్రైనింగ్ (NCVT) జారీ చేసిన నేషనల్ అప్రెంటిషిప్ సర్టిఫికెట్ (NAC) కలిగిన ఎవరైనా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చని స్పష్టంచేసింది.
పిల్లల్ని సైనిక్ స్కూళ్లలో చేరుస్తారా? ఇదిగో సువర్ణావకాశం!
ఇటీవల విడుదలైన నోటీసులో టెక్నికల్ విభాగాల్లో పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు కనీస విద్యార్హత పదో తరగతితో పాటు ఎన్‌ఏసీ సర్టిఫికెట్ లేదా ఐటీఐ డిప్లొమా కలిగి ఉన్న వారిని మాత్రమే అర్హులుగా పేర్కొన్న విషయం తెలిసిందే. అయితే, తాజాగా ఆ విద్యార్హత ప్రమాణాలను సడలిస్తూ నిర్ణయం ప్రకటించింది. రైల్వే శాఖలోని పలు విభాగాల్లో పాయింట్స్‌మన్, అసిస్టెంట్, ట్రాక్ మెయింటెయినర్ సహా దాదాపు 32 వేల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ ఉద్యోగాలకు జనవరి 23 నుంచి ఫిబ్రవరి 22వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు.
ట్రాఫిక్, ఇంజినీరింగ్, మెకానికల్, ఎలక్ట్రికల్ విభాగాల్లో ఈ పోస్టుల భర్తీకి వయో పరిమితి (జనవరి 7, 2025 నాటికి) 18 నుంచి 36 ఏళ్లు మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, దివ్యాంగ అభ్యర్థులకు వయో సడలింపు కల్పించారు. కంప్యూటర్ ఆధారిత పరీక్షతో పాటు ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. ప్రారంభ వేతనం రూ.18 వేలు ఉంటుంది.