వందే భారత్ రైళ్లతో ప్రయాణ సమయం ఎంతో తగ్గింది. అత్యాధునిక హంగులతో వచ్చిన ఈ రైళ్ల వల్ల ప్రయాణికులకు చాలా టైమ్ సేవ్ అవుతుంది. మరికొన్ని రోజుల్లో వందే భారత్ స్లీపర్ రైళ్లు కూడా అందుబాటులోకి రానున్నాయి.
ఈ క్రమంలో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ సేవలను భారతీయ రైల్వే మరింత విస్తరిస్తోంది. నాలుగు కొత్త వందే భారత్ రైళ్లకు రైల్వే బోర్డు ఆమోదం తెలిపింది. ఈ కొత్త రైళ్లతో దేశంలో మొత్తం వందే భారత్ సర్వీసుల సంఖ్య 164కు చేరుకోనుంది.
కొత్తగా ఆమోదం పొందిన రూట్లు:
భారతీయ రైల్వే నోటిఫై చేసిన నాలుగు కొత్త మార్గాలు అనేక రాష్ట్రాల మధ్య కనెక్టివిటీని బలోపేతం చేయనున్నాయి.
బెంగళూరు – ఎర్నాకులం: కర్ణాటక మరియు కేరళ రాష్ట్రాల మధ్య అనుసంధానాన్ని మెరుగుపరుస్తుంది.
ఫిరోజ్‌పూర్ కాంట్ – ఢిల్లీ: పంజాబ్ రాజధానిని జాతీయ రాజధాని ఢిల్లీకి అనుసంధానిస్తుంది.
వారణాసి – ఖజురహో: ఉత్తరప్రదేశ్ – మధ్యప్రదేశ్ మధ్య ప్రయాణ సంబంధాలను పెంచుతుంది.
లక్నో – సహరాన్పూర్: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అంతర్గత, వాయువ్య ప్రాంతాల్లో కనెక్టివిటీని బలోపేతం చేస్తుంది.
ఈ నాలుగు కొత్త వందే భారత్ రైళ్లను నోటిఫై చేసినట్లుగా రైల్వే అధికారిక ఒకరు ధృవీకరించారు.
వందే భారత్ ప్రత్యేకతలు
కొత్తగా రానున్న ఈ రైళ్లు కూడా ప్రయాణీకులకు మెరుగైన సౌకర్యాన్ని అందిస్తాయి. ప్రమాదాలను నివారించడానికి అత్యంత ముఖ్యమైన కవచ్ ఆటోమేటిక్ రైలు రక్షణ వ్యవస్థతో ఈ రైళ్లు వస్తాయి. ఈ రైళ్ డిజైన్ లక్ష్యం గంటకు 180 కి.మీ వేగం కాగా.. ఆపరేటింగ్ వేగం ట్రాక్ పరిస్థితులకు అనుగుణంగా గంటకు 160 కి.మీగా లక్ష్యంగా పెట్టుకున్నారు. UV-C ల్యాంప్ ఆధారిత క్రిమిసంహారక వ్యవస్థతో కూడిన ఎయిర్ కండిషనింగ్ యూనిట్లు, జెర్క్-ఫ్రీ సెమీ-పర్మనెంట్ కప్లర్లు, పూర్తిగా సీల్ చేసిన గ్యాంగ్‌వేలు ప్రయాణాన్ని మరింత సౌకర్యంగా మారుస్తాయి. మెరుగైన ఫైర్ సేఫ్టీ వ్యవస్థలు, అన్ని కోచ్‌లలో సీసీటీవీ కెమెరాలు, అత్యవసర అలారం బటన్లు, టాక్-బ్యాక్ యూనిట్లు అందుబాటులో ఉంటాయి. వికలాంగ ప్రయాణీకులకు అనువుగా ప్రత్యేక మరుగుదొడ్లు ఏర్పాటు చేశారు.
పెరుగుతున్న డిమాండ్
వందే భారత్ రైళ్లపై ప్రజలు ఎంతో ఆసక్తి చూపుతున్నారని గణాంకాలు చెబుతున్నాయి. టికెట్ల బుకింగ్ సామర్థ్2024-25 ఆర్థిక సంవత్సరంలో 102శాతం కంటే ఎక్కువగా ఉండగా.. 2025-26లో 105శాతానికి కి పైగా ఉంది. అంటే టికెట్లు వేగంగా అమ్ముడవుతున్నాయని అర్థం. ప్రస్తుతానికి ఈ నాలుగు రైళ్లకు ఆమోదం మాత్రమే లభించినప్పటికీ.. ఇవి ఎప్పటి నుంచి నడుస్తాయనే ఖచ్చితమైన తేదీలు మాత్రం ఇంకా ప్రకటించాల్సి ఉంది.
































