‘మీ భర్త ఎవరో వివరణ ఇవ్వండి’ సహాయ కమిషనర్‌ శాంతిపై మరో 6 అభియోగాలు నమోదు

www.mannamweb.com


విజయసాయిరెడ్డిపై ట్వీట్‌ ఉద్యోగ నిబంధనలకు విరుద్ధం ..సహాయ కమిషనర్‌ శాంతిపై మరో 6 అభియోగాలు నమోదు

అమరావతి: ‘దేవాదాయశాఖలో 2020లో ఉద్యోగంలో చేరినప్పుడు భర్త పేరు కె.మదన్‌మోహన్‌ అని పేర్కొన్నారు.

సర్వీస్‌ రిజిస్టర్‌లో అదే నమోదు చేయించారు. గత ఏడాది జనవరి 25న ప్రసూతి సెలవుల కోసం దరఖాస్తు చేసినప్పుడు కూడా భర్త పేరు మదన్‌మోహన్‌ అని పేర్కొన్నారు. కానీ ఈ నెల 17న నిర్వహించిన విలేకరుల సమావేశంలో పి.సుభాష్‌ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్నట్లు తెలిపారు. విడాకులు తీసుకోకుండా రెండో పెళ్లి చేసుకోవడం ఉద్యోగి ప్రవర్తనా నియమావళికి విరుద్ధం. దీనిపై 15 రోజుల్లో సమాధానం చెప్పాలి’ అంటూ సస్పెన్షన్‌లో ఉన్న సహాయ కమిషనర్‌ కె.శాంతికి ఆ శాఖ కమిషనర్‌ సత్యనారాయణ తాఖీదు జారీ చేశారు. ఆమె తీరుతో దేవాదాయశాఖ ప్రతిష్ఠకు భంగం కలిగిందని, దీనిపై వివరణ ఇవ్వాలని కోరారు. ఆమెపై కొత్తగా ఆరు అభియోగాలు నమోదు చేస్తూ కమిషనర్‌ ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే శాంతిపై వివిధ ఆరోపణలు రావడంతో ఈ నెల 2న సస్పెండ్‌ చేసి తొమ్మిది అభియోగాలు నమోదు చేశారు. ఇటీవల ఆమె నిర్వహించిన విలేకరుల సమావేశంలో ప్రస్తావించిన అంశాలు, ఉమ్మడి విశాఖ జిల్లాలో సహాయ కమిషనర్‌గా ఉన్నప్పుడు చేసిన ఉల్లంఘనలకు సంబంధించి కొత్తగా ఆరు అభియోగాలు మోపారు.

కొత్త అభియోగాలు ఇవి..

విధుల్లో చేరినప్పుడు భర్త పేరు మదన్‌మోహన్‌ అని చెప్పి, వేరొకరిని వివాహం చేసుకున్నట్లు వెల్లడించడంపై ఓ అభియోగం నమోదు చేయగా, దేవాదాయశాఖ ప్రతిష్ఠకు భంగం కలిగించారంటూ రెండో అభియోగం మోపారు.
కమిషనర్‌ అనుమతి లేకుండా విలేకరుల సమావేశంలో మాట్లాడటంపై మరో అభియోగం నమోదు చేశారు.
‘ఎప్పుడు ఎలా మాట్లాడాలో మీకు బాగా తెలుసు సర్‌. మీరు పార్టీకి వెన్నెముక’ అంటూ ఎంపీ విజయసాయిరెడ్డి గురించి గత ఏడాది మే 28న ట్వీట్‌ చేశారని, ఇది ఆ పార్టీతో ఉన్న అనుబంధాన్ని సూచిస్తోందని, ప్రభుత్వ ఉద్యోగిగా ఇది నిబంధనలకు విరుద్ధమని అభియోగంలో పేర్కొన్నారు.
విశాఖపట్నంలో నివాసం ఉన్నప్పుడు అపార్ట్‌మెంట్‌లోని మరో ప్లాట్‌లో నివాసితులతో గొడవపడగా, 2022 ఆగస్టులో అరిలోవ పోలీస్‌స్టేషన్‌లో నమోదైన కేసుపై వివరణ ఇవ్వాలని కోరారు.
శాంతికి అధికారం లేకపోయినా సరే ఉమ్మడి విశాఖపట్నం జిల్లా పరిధిలో.. అనకాపల్లిలో సిద్ధేశ్వరస్వామి ఆలయం, చోడవరంలో విఘ్నేశ్వర ఆలయం, హార్డేంజ్‌ రెస్ట్‌హౌస్, లంకెలపాలెం పరదేశమ్మ ఆలయం, పాయకరావుపేట పాండురంగస్వామి ఆలయం, ధారపాలెం ధారమల్లేశ్వరస్వామి ఆలయాలకు చెందిన దుకాణాలు, భూముల లీజులను 3 ఏళ్లకు బదులు 11 ఏళ్లకు రెన్యువల్‌ చేసేలా కమిషనర్‌కు ప్రతిపాదనలు పంపడం, అవి రెన్యువల్‌ కావడంపై వివరణ కోరుతూ అభియోగం మోపారు.
వీటన్నింటిపై 15 రోజుల్లో వివరణ ఇవ్వాలన్నారు.
ఉల్లంఘనలపై అధికారులతో కమిటీ

శాంతి సహాయ కమిషనర్‌గా పని చేసినప్పుడు విశాఖపట్నం, అనకాపల్లి, ఎన్టీఆర్‌ జిల్లాల పరిధిలో ఇంకా ఏయే ఉల్లంఘనలకు పాల్పడ్డారు? భూములు, దుకాణాల లీజులలో ఏం చేశారు? ఆలయాల భూములు పరాయిపరం చేసేలా ఎన్వోసీల జారీకి సిఫార్సులు చేశారా? అనేవి పరిశీలించేందుకు ముగ్గురు అధికారులతో కమిటీ వేయనున్నారు.