రాష్ట్రంలోని యూనివర్సిటీల్లో పనిచేసే ప్రొఫెసర్ల వయో పరిమితి పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. 60 సంవత్సరాల నుంచి 65 సంవత్సరాలకు వయో పరిమితిని పెంచారు.
ఈ మేరకు గురువారం విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం యూనివర్సిటీల్లో పనిచేస్తూ యూజీసీ స్కేల్పొందుతున్న టీచింగ్స్టాఫ్కు మాత్రమే ఈ నిబంధన అమలవుతుందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో గత కొన్ని సంవత్సరాలుగా యూనివర్సిటీల్లో టీచింగ్‌స్టాఫ్ నియమకాలు నిలిచిపోయాయి.
దీంతో యూనివర్సిటీల్లో బోధన సిబ్బంది తీవ్ర కొరత ఉంది. ఈ నేపథ్యంలో క్లాసులు సజావుగా సాగడానికి వయో పరిమితి పెంపు తప్పనిసరిగా మారింది. ఈ నేపథ్యంలో వయో పరిమితిని పెంచుతూ ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలోని 12 యూనివర్సిటిల్లో 2817 టీచింగ్ స్టాఫ్పోస్టులు ఉండగా వీటిలో 757 మందే పనిచేస్తున్నారని విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి. మిగిలిన పోస్టులన్ని ఖాళీగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో యూనివర్సిటీల మనుగడ ప్రశ్నార్ధకంగా మారింది. దీంతో ప్రొఫెసర్ల వయో పరిమితిని పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది.
ఇదిలా ఉండగా.. అధ్యాపకుల రిటైర్మెంట్ వయసు తగ్గించాలని కోరుతూ ఇటీవల ఆందోళనలు జరిగాయి. పదవీ విరమణ వయసును 58 ఏళ్లకు తగ్గించాలనే డిమాండ్‌తో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విద్యార్థులు ఆందోళన చేశారు. పదవీ విరమణ వయసు పెంచి ఉద్యోగులపై పని భారాన్ని పెంచిందని ఆరోపించారు.