ఆఫ్రికా నుంచి ఉపాది కోసం గల్ఫ్ దేశాలకు వస్తున్న శరణార్థులు, వలసదారులతో ప్రయాణిస్తున్న పడవ యెమెన్ తీరంలో మునిగిపోయింది. ఈ ఘోర విషాద ఘటనలో 68 మంది మరణించగా, మరో 74 మంది గల్లంతయ్యారని ఐక్యరాజ్యసమితి వలస సంస్థ (IOM) వెల్లడించింది.
ఈ పడవలో మొత్తం 154 మంది ప్రయాణికులు ఉన్నారని, వీరంతా ఇథియోపియన్లు అని ఐఓఎం యెమెన్ విభాగాధిపతి అబ్దుసత్తర్ ఎసోవ్ తెలిపారు. ప్రమాదం ఆదివారం తెల్లవారుజామున యెమెన్‌లోని అబియాన్ ప్రావిన్స్ తీరంలో, గల్ఫ్ ఆఫ్ అడెన్ సమీపంలో చోటుచేసుకుంది. సముద్రంలో మునిగిన పడవలో 12 మంది మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారని, వారిలో ఒకరు యెమెన్ దేశస్థుడు కాగా, మిగిలిన 11 మంది ఇథియోపియన్లు అని ఆయన వివరించారు.
మరణించినవారిలో 54 మంది మృతదేహాలు ఖన్ఫర్ జిల్లా తీరంలో లభ్యమయ్యాయని, మరో 14 మృతదేహాలను జింజిబార్ నగరంలోని ఆసుపత్రికి తరలించారని అధికారులు తెలిపారు. గల్లంతైనవారి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నప్పటికీ, బలమైన అలల కారణంగా గాలింపు చర్యలు కష్టంగా మారింది.
ఆఫ్రికాలోని హార్న్ ఆఫ్ ఆఫ్రికా ప్రాంతం నుండి గల్ఫ్ దేశాలకు చేరుకోవడానికి యెమెన్ ఒక కీలకమైన, కానీ ప్రమాదకరమైన మార్గంగా మారింది. ఉపాధి, తిండి కోసం ఈ వలసదారులు తరచుగా రద్దీగా ఉండే, నాణ్యత లేని పడవల్లో ప్రయాణం చేస్తుంటారు. ఈ ప్రయాణంలో అనేకసార్లు ప్రాణనష్టం జరుగుతుంది.
తాజా ప్రమాదం ఈ మార్గంలో ఉన్న ప్రమాదాలను మరోసారి వెలుగులోకి తీసుకొచ్చింది. ఈ విషాద ఘటన పట్ల ఐక్యరాజ్యసమితి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఇలాంటి ప్రమాదకరమైన ప్రయాణాలను నివారించడానికి అంతర్జాతీయ సమాజం చర్యలు తీసుకోవాలని, శరణార్థులకు, వలసదారులకు సురక్షితమైన మార్గాలను కల్పించాలని పిలుపునిచ్చింది. ఈ ఘటన ఈ ఏడాదిలో ఇప్పటివరకు యెమెన్ తీరంలో జరిగిన అత్యంత ఘోరమైన ప్రమాదాలలో ఒకటిగా నిలిచింది.
































