వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం జగన్‌కి సొంత జిల్లాలోనే బిగ్ షాక్ తగిలింది. పార్టీ గుర్తు అయిన ఫ్యాన్ రెక్కలు ఊడిపోతున్నాయని రాజకీయ విశ్లేషకులు అంచనాలు వేస్తున్నారు.
నాలుగున్నర సంవత్సరాల తర్వాత జరిగే సాధారణ ఎన్నికల్లో మళ్లీ వైసీపీ అధికారంలోకి వస్తుందన్న నమ్మకం లేక కొందరు.. పార్టీ నేతలపై ఉన్న తీవ్ర అసంతృప్తితో మరి కొందరు కడప కార్పొరేటర్లు వైసీపీకి బైబై చెప్పి సైకిలెక్కుతున్నారు. అందులో భాగంగా అమరావతిలో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి, కడప ఎమ్మెల్యే మాధని ఆధ్వర్యంలో 8 మంది కార్పొరేటర్లు సీఎం చంద్రబాబునాయుడును కలిసి టీడీపీ తీర్థం పుచ్చుకుని.. కడప కార్పొరేషన్ ఈక్వేషన్లు మార్చేశారు.
వైసీపీ అధ్యక్షుడు జగన్ సొంత జిల్లా కడపలో ఆయనకు పెద్ద షాక్ తగిలింది . కడప అసెంబ్లీ నియోజకవర్గంలో పరాజయం పాలైన వైసీపీకీ.. తాజాగా కార్పొరేషన్ల్లో కార్పొరేటర్లు ఝలక్ ఇచ్చారు. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు, జిల్లా పార్టీ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి, కడప ఎమ్మెల్యే మాధని దంపతులు ఆధ్వర్యంలో ఎనిమింది మంది కార్పొరేటర్లు ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో టీడీపీ గూటికి చేరారు. మంత్రి నారా లోకేశ్ వారిని పార్టీలోకి ఆహ్వానించరు.
2వ డివిజన్ కార్పొరేటర్ సుబ్బారెడ్డి, 3వ డివిజన్ కార్పొరేటర్ మానస, 6 వ డివిజన్‌కు చెందిన నాగేంద్ర, 8వ డివిజన్ లక్ష్మిదేవి. 25వ డివిజన్ సూర్యనారాయణ. 12వ డివిజన్ ఎసిబి జఫ్రుల్లా, 42 వ డివిజన్ స్వప్న, 50వ డివిజన్ కార్పొరేటర్ రుణప్రభ కుటుంబ సభ్యులతో కలిసి సీఎం చంద్రబాబునాయుడును కలసి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. వీరిలో సూర్యనారాయణ ఇప్పటికే టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా కడప అభివృద్దికి సహక రించాలని టీడీపీలో చేరిన కార్పొరేటర్లు చంద్రబాబునాయుడును కోరారు.
ఒకేసారి ఎనిమిది మంది కార్పొరేటర్లు జగన్ కు టాటా చెప్పి సైకిల్ ఎక్కేయడం వైసీపీకి కోలుకోలేని దెబ్బే అంటున్నారు. మరో వారం పది రోజుల్లో ఇంకో 11 మంది కార్పొరేటర్లు టీడీపీ తీర్ధం పుచ్చుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెబుతున్నారు. ఈ నెల 21న మాజీ సీఎం జగన్ పుట్టినరోజును జరువుకునే నమయంలో సొంత జిల్లాలో ఝలక్ ఇచ్చేందుకు పలువురు వైసీపీ కార్పొరేటర్లను టీడీపీలోకి చేర్చుకునేందుకు పావులు కదువుతున్నారని ఆ పార్టీ వర్గాలలో గుసగుసలు వినిపిస్తున్నాయి.
2024 అసెంబ్లీ ఎన్నికలలో మాజీ సీఎం జగన్ కు సొంత జిల్లాలో గట్టి షాకే తగిలింది. గడిచిన 20 సంవత్సరాల లో కడప జిల్లా పేరు చెప్తేనే వైఎస్ కుటుంబం కంచుకోటగా ముద్ర పడింది. 2019లో జిల్లాలోని పదికి పది అసెంబ్లీ సీట్లలో వైసీపీనే విజయం సాధించి క్లీన్ స్వీప్ చేసింది. అలాంటిది 2024 ఎన్నికలలో జిల్లాలో ఏడు సీట్లను టిడిపి కైవసం చేసుకుని షాక్ ఇచ్చింది. మరోవైపు కడప మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పడినప్పటి నుండి ఇప్పటివరకు కాంగ్రెస్, వైసీపీ నేతలే పాలిస్తూ వచ్చారు. అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలకే కార్పొరేషన్ ఈక్వేషన్లు మారిపోతున్నాయి. మేయర్ సీటును కాపాడుకోవడం కూడా వైసీపీ నేతలకు తలకు మించిన భారం అవుతుందంటున్నారు.
కార్పొరేషన్ పరిధిలో మేయర్ సీటు కూటమి ప్రభుత్వ నేతలకు దక్కాలంటే సుమారు 27 మంది కార్పొరేటర్లు అవసరం ఉంటుంది. ఇప్పటికే టీడీపీ ఆ మ్యాజిక్ ఫిగర్‌కి చేరువవుతుండటంతో వైసీపీ నేతల గుండెల్లో గుబులు పుడుతుందట. ఒకవేళ కూటమి నేతలు కడప కార్పొరేషన్ మేయర్ సీటును కైవసం చేసుకుంటే రాబోయే నాలుగున్నర సంవత్సరాల్లో కడప రాజకీయ ముఖచిత్రమే మారిపోతుందన్న అభిప్రాయం వ్యక్తం అవుతుంది.. మరి కడప మేయర్ సీటుపై టీడీపీ లెక్కలు ఎలా ఉన్నాయో చూడాలి.