90 డిగ్రీల వంతెన.. ఏడుగురు ఇంజినీర్ల సస్పెన్షన్‌

మధ్యప్రదేశ్‌లో ఇటీవల నిర్మించిన ఓ రైల్వే వంతెన (Indian Railways) దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. ఆ వంతెన 90 డిగ్రీల మలుపుతో (90 Degree Bridge) నిర్మించడమే అందుకు కారణం.


దీనికి సంబంధించి మీడియాలో అనేక కథనాలు రావడంతోపాటు సామాజిక మాధ్యమాల్లో విస్తృత ప్రచారం జరిగింది. ఇలాంటి డిజైన్‌లను రూపొందించడంలో అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందని తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించిన ప్రభుత్వం తాజాగా ఏడుగురు ఇంజినీర్లపై సస్పెన్షన్‌ వేటు విధించింది. మరో విశ్రాంత చీఫ్ ఇంజినీర్‌పై శాఖాపరమైన విచారణకు ఆదేశించింది.

”ఐష్‌బాగ్‌లో ఆర్‌వోబీ నిర్మాణంలో తీవ్ర నిర్లక్ష్యంపై దర్యాప్తునకు ఆదేశించా. నివేదిక ఆధారంగా ఎనిమిది మంది పీడబ్ల్యూడీ ఇంజినీర్లపై చర్యలు తీసుకున్నా. ఇందులో ఏడుగురు ఇంజినీర్లపై తక్షణమే సస్పెన్షన్‌ విధించా. నిర్మాణ ఏజెన్సీ, డిజైన్‌ రూపొందించిన కన్సల్టెంట్‌లను బ్లాక్‌లిస్టులో చేర్చాం. ఆర్వోబీ పునరుద్ధరణ కోసం ఓ కమిటీని ఏర్పాటు చేశాం” అని ముఖ్యమంత్రి మోహన్‌ యాదవ్‌ వెల్లడించారు.

రాజధాని భోపాల్‌లో ఐష్‌బాగ్‌ వద్ద రూ.18 కోట్లతో ఇటీవల కొత్తగా ఓ రైల్వే వంతెన నిర్మించారు. అయితే, అది 90 డిగ్రీల మలుపు కలిగి ఉండటం తీవ్ర విమర్శలకు దారితీసింది. నిర్మాణ సంస్థ మాత్రం ఆ డిజైన్‌ను సమర్థించుకుంది. సమీపంలో మెట్రో రైల్‌ స్టేషన్‌, భూమి కొరత దృష్ట్యా ఇలా నిర్మించడం తప్పితే మరో మార్గం లేదని వివరణ ఇచ్చింది. కొంచెం అదనపు భూమి అందుబాటులో ఉంటే ఆ మార్గం సవ్యంగానే ఉండేదని చెప్పింది. అయినప్పటికీ తీవ్రంగా పరిగణించిన ప్రభుత్వం చర్యలు తీసుకుంది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.