పరువు గంగపాలు

www.mannamweb.com


అమరావతి ఎన్‌ఐడీకి రక్షిత నీరివ్వలేని దుస్థితి
అనారోగ్యంతో పలువురు ఆస్పత్రిపాలు
జాతీయ మీడియా దృష్టికి తీసుకెళ్లిన విద్యార్థులు
ఆగమేఘాలపై ప్రిన్సిపల్‌ సెక్రటరీని పంపిన వైనం
రాష్ట్రం పరువు పోయేలా వైకాపా ప్రభుత్వం వ్యవహరించింది. ఎన్‌ఐడీ విద్యనభ్యసించడానికి దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి రాజధాని అమరావతికి వచ్చిన విద్యార్థులకు కనీసం గుక్కెడు రక్షిత నీళ్లు ఇవ్వలేని దుస్థితిలో ఉంది. దీనిపై విద్యార్థుల నుంచి విస్మయం వ్యక్తమవుతోంది. విద్యా సంస్థకు చేరుకోవడానికి సరైన రహదారులు లేవు. అనారోగ్యం పాలైతే ఆస్పత్రిలో చేరి చికిత్స పొందడానికి స్థానికంగా వైద్య సదుపాయాలు లేక అడవిలో మగ్గిపోతున్నామని విద్యార్థులు మొరపెట్టుకుంటున్నా వారిది అరణ్య రోదనగానే మిగిలిపోయింది. ఇటు ప్రభుత్వం, అటు స్థానిక ఎన్‌ఐడీ అధికారులు పట్టించుకోకపోవడంతో ఎన్నాళ్లు సమస్యలతో సతమతమవుతామని ఏకంగా జాతీయ మీడియా దృష్టికి తీసుకెళ్లారు.దీంతో ఇక్కడ నెలకొన్న సమస్యలు ఒక్కసారిగా వెలుగులోకి వచ్చాయి.

అమరావతిలో ఉన్న ప్రతిష్ఠాత్మకమైన ఎన్‌ఐడీ (నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డిజైన్‌)లో సమస్యలు విద్యార్థులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వానికి పట్టడం లేదు. తల్లిదండ్రులు ఎన్నో ఆశలతో ఇక్కడకు పంపితే తాము ఉండే వసతిగృహాల్లోకి గుర్తు తెలియని వ్యక్తులు చొరబడి హల్‌చల్‌ చేస్తున్నా పట్టించుకునే భద్రతా వ్యవస్థ లేదని విద్యార్థులు ఆందోళన చెందుతున్న విషయం మీడియాలో వచ్చింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఆగమేఘాలపై స్పందించింది. రాష్ట్ర టెక్స్‌టైల్స్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీ సునీత, గుంటూరు జేసీ రాజకుమారితో పాటు ఇతర అధికారుల బృందం అమరావతి ఎన్‌ఐడీకి చేరుకుంది. స్థానిక ఎన్‌ఐడీ అధికారులతో పాటు విద్యార్థులతోనూ మాట్లాడి సమస్యలు తెలుసుకుంది. ఇక్కడ రక్షిత నీళ్లు సరఫరా కావడం లేదని, దిక్కుతోచని పరిస్థితుల్లో అవే తాగున్నామని, ఆ నీటితోనే స్నానాలు చేయడంతో చర్మ సంబంధిత సమస్యలు తలెత్తి అనారోగ్యం పాలవుతున్నామని వాపోయారు.

ఆహార కల్తీ జరిగి అస్వస్థతకు గురైతే అప్పట్లో వెంటనే వెళ్లి చికిత్స పొందుదామంటే తమకు ఇక్కడ ఆ సౌకర్యం కూడా ఏర్పాటు చేయలేదని, కనీసం అంబులెన్సు లేదని వారి దృష్టికి తీసుకెళ్లారు. తాము ఉండే పరిసరాల్లో కనీసం చెత్త శుభ్రం చేసే కార్మికులే కనిపించడం లేదని వాపోయారు. షాపింగ్‌ చేసుకోవాల్సి వస్తే కనీసం డబ్బులు డ్రా చేసుకోవటానికి కనీసం ఏటీఎం సౌకర్యం కల్పించలేదని ఆవేదన చెందారు. సమస్యలు తెలుసుకుని ఉన్నతాధికారులే నివ్వెరపోయారు. నాలుగేళ్ల కోర్సులో ప్రస్తుతం 190 మంది విద్యార్థులు ఉన్నారు.

ఎయిమ్స్‌లాగే దీన్నీ విస్మరించారు..
విభజన హామీల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం 2014లో రాష్ట్రానికి ప్రతిష్ఠాత్మకమైన ఎన్‌ఐడీని కేటాయించింది. అప్పటి తెదేపా ప్రభుత్వం దాని నిర్మాణానికి రాజధానిలోని శాఖమూరు వద్ద 50 ఎకరాల భూమి కేటాయించింది. నిర్మాణాలు వేగవంతంగా పూర్తి చేసి సాధ్యమైనంత త్వరగా అమరావతి నుంచే రెగ్యులర్‌గా తరగతులు నిర్వహించేలా ఎన్‌ఐడీ అధికారులతో సమన్వయం చేసుకుని పనుల వేగవంతానికి చర్యలు చేపట్టారు. దీంతో తెదేపా ప్రభుత్వ హయాంలోనే చాలా వరకు భవన నిర్మాణ పనులు జరిగాయి. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైకాపా ప్రభుత్వం ఎయిమ్స్‌కు నీళ్లు అందించడాన్ని ఎలాగైతే విస్మరించిందో ఎన్‌ఐడీ శాశ్వత భవనాలు పూర్తి చేయడాన్ని పట్టించుకోలేదు. ఒకవైపు భవన నిర్మాణ పనులు జరుగుతుండగానే ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో తాత్కాలిక భవనాల్లో కొనసాగుతున్న ఎన్‌ఐడీని సుమారు నెల కిందట అమరావతిలో అసంపూర్తిగా ఉన్న భవనాల్లోకి మార్చారు. అప్పటివరకు ఏఎన్‌యూలో ఉండగా ఎలాంటి సమస్యలు ఎదురుకాలేదు. ఇక్కడి నుంచి రాజధానికి వెళ్లగానే సమస్యలు తలెత్తడంతో తొలుత విద్యార్థులు స్థానిక ఎన్‌ఐడీ అధికారుల దృష్టికి తీసుకెల్లారు. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని గవర్నింగ్‌ బాడీకి ఫిర్యాదు చేశారు. ఇక్కడ వసతి సౌకర్యాలు దారుణంగా ఉన్నాయని దిల్లీలోని ఎన్‌ఐడీ ఉన్నతాధికారులకు మెయిల్స్‌ రూపంలో ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. చుట్టూ దట్టమైన ముళ్ల పొదలతో చిట్టడవిని తలపిస్తోందని, తమకు చాలా భయంగా ఉంటోందని ఫిర్యాదులో పేర్కొన్నట్లు సమాచారం. వసతిగృహాల్లో సరఫరా చేసే ఆహారం నాణ్యతగా ఉండడం లేదని, అపరిశుభ్ర వాతావరణంలో వండి వార్చుతున్నారని ఏకరవు పెడుతున్నారు. ఈ మధ్య సుమారు 30 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని తెలిసింది.

మీడియాను అనుమతించక..
ఇక్కడి లోపాలను క్షేత్రస్థాయిలో తెలుసుకోవడానికి వచ్చిన మీడియాను అనుమతించలేదు. ‘విద్యార్థులకు ఎదురవుతున్న సమస్యలను వారితో మాట్లాడి తెలుసుకున్నాం. గుంటూరు జిల్లా యంత్రాంగం పరంగా వెంటనే పారిశుద్ధ్య సమస్య పరిష్కరించడానికి సీఆర్‌డీఏ అధికారులకు ఆదేశాలిస్తాం. జిల్లా లీడ్‌ బ్యాంకు మేనేజరుతో చెప్పి ఏటీఎం సౌకర్యం కల్పిస్తాం. వైద్య సదుపాయాల కోసం తుళ్లూరు సామాజిక ఆసుపత్రితో అనుసంధానం చేసి ఇకమీదట అసౌకర్యాలు లేకుండా చర్యలు తీసుకుంటామని’ జిల్లా అధికారి ఒకరు తెలిపారు. మిగిలినవి రాష్ట్ర స్థాయిలో పరిష్కరించాల్సి ఉందని సదరు అధికారి పేర్కొన్నారు.