ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా ఇప్పటివరకూ అప్రూవర్ గా మారి సీబీఐకీ, వివేకా కుమార్తె సునీతకు అనుకూలంగా మాట్లాడిన దస్తగిరి ఇప్పుడు ఆమెతో పాటు వైఎస్ షర్మిలపైనా ఈసీని ఆశ్రయించాడు. అదే సమయంలో కీలక నిందితుడు శివశంకర్ రెడ్డికి హైకోర్టు బెయిల్ ఇవ్వడంతో ఎన్నికల్లోపు బెయిల్ కోసం మిగతా నిందితులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. వివేకా హత్య కేసులో సీబీఐ దర్యాప్తు నత్తనడకన సాగుతుండటంపై సుప్రీంకోర్టు అక్షింతలు వేసిన నేపథ్యంలో సీబీఐ స్పీడు పెంచింది. అదే సమయంలో నిందితుల డిశ్చార్జ్ పిటిషన్లను ఆమోదించవద్దంటూ సీబీఐ కోర్టునూ కోరుతోంది. అలాగే నిందితులు బెయిల్ కోసం చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఇప్పటికే ఈ కేసులో కీలక నిందితుడు, అవినాష్ రెడ్డి ప్రధాన అనుచరుడు శివశంకర్ రెడ్డికి బెయిల్ లభించిన నేపథ్యంలో అప్రమత్తమైంది.
తాజాగా వైఎస్ భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డి తమకూ శివశంకర్ రెడ్డి తరహాలోనే బెయిల్ ఇవ్వాలంటూ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. దీంతో ఈ పిటిషన్ పై సీబీఐ తమ అభిప్రాయం తెలిపింది. మాజీ ఐపీఎస్ లనే ప్రభావితం చేయగలిగిన వీరికి సామాన్య సాక్ష్యులు ఓ లెక్కా అంటూ అఫిడవిట్ లో వ్యాఖ్యానించింది. ఇలాంటి పలుకుబడి కలిగిన వ్యక్తులు బెయిల్ పై బయట ఉంటే సాక్ష్యం చెప్పేందుకు ఎవరూ ముందుకు రారని తెలిపింది. దీంతో కోర్టు తీర్పును రిజర్వు చేసింది. మరోవైపు ఇన్నాళ్లూ వివేకా హత్య చేసిన తర్వాత అప్రూవర్ గా మారి ఆయన కుమార్తె సునీతారెడ్డికి అండగా ఉన్న దస్తగిరి ఎన్నికల వేళ ప్లేటు మార్చాడు. వివేకా హత్యను జనంలోకి తీసుకెళ్తున్న షర్మిల, సునీత, టీడీపీ ప్రయత్నాలను అడ్డుకునేలా ఈసీని ఆశ్రయించాడు. దీంతో ఇప్పుడు దస్తగిరి వ్యవహారం సంచలనంగా మారింది. షర్మిల, సునీత, టీడీపీ వివేకా హత్యను జనంలోకి తీసుకెళ్తే నష్టం ఎవరికి?, అటువంటప్పుడు వీరిని అడ్డుకోవాలని ఈసీని దస్తగిరి ఆశ్రయించడం వెనుక కారణమేంటన్నది ఇప్పుడు అందరికీ సులువుగానే అర్ధమవుతోంది.