కర్ణాటకలో గత కొన్నిరోజులుగా నీళ్ల సమస్య ఏవిధంగా ఉందో మనం చూస్తున్నాం. చేతులు కడుక్కోవడానికి కూడా టిష్యూలు వాడుతున్నారంటే నీటి సమస్య ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఈ సమస్య ఇపుడు మరింత తీవ్ర రూపం దాల్చింది. రాష్ట్ర రాజధాని బెంగళూరు సిటీలో వ్యాపారులు మూతపడ్డాయి. బిజినెస్ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. చాలా చిన్నాచితక హోటళ్లు నీటి కొరతతో మూసేసారు. చాలా మంది ఇప్పటికే తమ సొంతూళ్లకు వెళ్లారు.
బెంగళూరులోని మామూలు ప్రాంతాల్లోనే కాదు..ఏకంగా కోట్ల రూపాయలు పెట్టి ఫ్లాట్లు కొన్న రెసిడెన్సియల్ కాలనీల్లోనూ,సొసైటీల్లోనూ నీటి సమస్య తీవ్రమైంది. అపార్ట్ మెంట్ ,రెసిడెన్షియల్ వాసులు నీళ్ల కోసం రోడ్డెక్కుతున్నారు. కోట్టు పెట్టి ఫ్లాట్లు కొన్నా నీళ్లు లేవని ఆందోళన చేస్తున్నారు.
నీటి కొరతను దృష్టిలో పెట్టుకుని బెంగుళూరు నీటి సరఫరా మురుగునీటి బోర్డు (BWSSB) రోజుకు 40 లక్షల నుండి 2 కోట్ల లీటర్ల మధ్య వినియోగిస్తున్న రెసిడెన్షియల్ కాలనీలకు, సొసైటీలకు నీటి సరఫరాలో 10 శాతం కోత విధించారు. దీంతో సెంట్రల్ బెంగళూరులోని షాపూర్జీ పల్లోంజీ పార్క్‌వెస్ట్‌లో కూడా నీటి ఇబ్బందులు తలెత్తాయి. ఈ రెసిడెన్షియల్ లో ఒక్కో ఫ్లాట్ ధర దాదాపు రూ. 2 కోట్ల వరకు ఉంది. అయితే కోట్లు పెట్టి కొన్నా నీటి కష్టాలేంటని బిల్డర్ కు వ్యతిరేకంగా రోడ్డెక్కి నిరసన తెలుపుతున్నారు నివాసితులు. నిరసన చేస్తున్న ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పెద్ద సంఖ్యలో పురుషులు, మహిళలు ప్లకార్డులు పట్టుకుని కోట్టు పెట్టి ఫ్లాట్టు కొన్నా నీటి ఇబ్బందులేంటి..మాకు నీళ్లు కావాలి అంటూ బిల్డర్ కు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్నారు.
అయితే నివాసితుల నీటి సమస్యలు తీర్చడానికి తాము ప్రయత్నిస్తున్నామని షాపూర్జీ పల్లోంజీ రియల్ ఎస్టేట్ యాజమాన్యం ప్రకటించింది. నీటి సమస్యను దృష్టిలో పెట్టుకుని సొసైటీ ఆఫీస్ బేరర్లతో మాట్లాడుతున్నామని షాపూర్జీ పల్లోంజి అధికార ప్రతినిధి మీడియాకు తెలిపారు. నీటి ట్యాంకర్లకు ఆర్డర్ ఇచ్చినా వంద శాతం సరఫరా చేయలేకపోతున్నామని చెప్పారు.