Chilkur Balaji Temple: చిలుకూరు బాలాజీ ఆలయ రహస్యం తెలుసా?

www.mannamweb.com


Chilkur Balaji Temple: చిలుకూరు బాలాజీ.. ప్రసిద్ధ ఆలయం. రంగారెడ్డి జిల్లాలో ఉన్న ఈ ఆలయంలో కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వరుడు కొలువై ఉన్నాడు.

ఇక్కడికి వచ్చి 108 ప్రదక్షిణలు చేసి కోరిక కోరుకుంటే కచ్చితంగా నెరవేరుతుందని భక్తులు నమ్ముతారు. చారిత్రక ప్రాశస్త్యం ఉన్న ఈ ఆలయ రహస్యం తెలుసుకుందాం.

= భక్త రామదాసు మేనమామలు అక్కన్న, మాదన్నల కాలంలో ఈ ఆలయం నిర్మించారు. తెలంగాణలోని పురాతన ఆలయాల్లో ఇదీ ఒకటి.

= సంప్రదాయం ప్రకారం ప్రతీ సంవత్సరం తిరుపతికి వచ్చే ఒక భక్తుడు తీవ్రమైన అనారోగ్యం కారణంగా ఒక సందర్భంలో వెళ్లలేకపోయాడు.

= దీంతో వేంకటేశ్వరస్వామి అతని కలలోకి వచ్చి.. ‘నేను ఇక్కడ మీకు సమీపంలోని అడవిలో ఉన్నాను. నువ్వు ఆందోళన చెందాల్సి పనిలేదు’ అని చెప్పారట.

= ఆ భక్తుడు వెంటనే కలలో భగవంతుడు సూచించిన ప్రదేశానికి వెళ్లి చూడగా అక్కడ ఒక పుట్ట కనిపించింది. దానిని తవ్వడం మొదలు పెట్టాడు. ఈ క్రమంలో గొడ్డలి గడ్డం కింద, ఛాతీపై కప్పబడి ఉన్న బాలాజీ విగ్రహానికి తాకింది. ఆశ్చర్యకరంగా గాయాలు అయి విగ్రహం నుంచి విపరీతమైన రక్తం కారింది. ఇది చూసిన భక్తుడు తన కళ్లను తానే నమ్మలేకపోయాడు. వెంటనే ‘ఆవు పాలతో పుట్టను ముంచెత్తండి’ అని ఆకాశవాణి వినిపించింది. భక్తుడు అలా చేయగా శ్రీదేవి, భూదేవి సమేత బాలాజీ స్వామి స్వయంభూ విగ్రహం బయట పడింది.

పునఃప్రతిష్టించి..
వెంటనే ఆ విగ్రహాన్ని బయటకు తీసి తర్వాత తగిన ఆచారాలతో పునఃప్రతిష్టించారు. కొన్నాళ్లకు దాని కోసం అక్కడ ఆలయం నిర్మించారు. ఆ గ్రామమే చిలుకూరు. అక్కడ వెలసిన వేంకటేశ్వరస్వామి చిలుకూరు బాలాజీగా ప్రసిద్ధి చెందాడు.

108 ప్రదక్షణల రహస్యమిదీ..
ఇక పురాతన కాలంలో తీవ్ర కరువు రావడంతో ఓ రైతు బావి తవ్వకం ప్రారంభించాడట. ఎన్ని బావులు తవ్వినా నీళ్లు పడకపోవడంతో అక్కడి రైతు ఆలయంలో ప్రదక్షిణలు చేస్తూ తాను చేపట్టిన బావిలో నీళ్లు పడాలని మొక్కుకున్నాడట. ఈమేరకు ఆలయం చుట్టూ ప్రదక్షిణలు 108 పూర్తి కాగానే రైతు బావిలో పాతాళ గంగా పైకి ఉబికి వచ్చిందట. దీంతో రైతు ప్రదక్షిణలు ఆపి స్వామివారికి మొక్కుకుని బావి దగ్గరకు వెళ్లి సంతోష వ్యక్తం చేశాడు. బాలాజీ మహిమతోనే నీళ్లు పడ్డాయని నమ్మాడు. దీంతో మొక్కు నెరవేరాలంటే 108 ప్రదక్షిణలు చేయాలని తర్వాత అందరూ దానినే పాటిస్తున్నారు.