#SRH: చరిత్ర సృష్టించిన సన్‌రైజర్స్‌.. ప్రపంచంలోనే తొలి జట్టుగా

www.mannamweb.com


ఐపీఎల్‌-2024లో భాగంగా అరుణ్‌ జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఓపెనర్లు ట్రావిస్‌ హెడ్‌, అభిషేక్‌ శర్మ విధ్వంసం సృష్టించారు. ఇన్నింగ్స్‌ ఆరంభం నుంచే ఢిల్లీ బౌలర్లను ఊచకోత కోశారు. హెడ్‌, అభిషేక్‌ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. పవర్‌ప్లేలో వారిద్దరిని ఆపడం ఢిల్లీ బౌలర్ల తరం కాలేదు. ఢిల్లీ కెప్టెన్‌ రిషబ్‌ పంత్‌ ఎంత మంది బౌలర్లు మార్చినా ఫలితం దక్కలేదు.

వీరిద్దరి విధ్వంసం ధాటికి సన్‌రైజర్స్‌ పవర్‌ప్లే(6 ఓవర్లు)లో ఏకంగా 125 పరుగులు చేసింది. తద్వారా టీ20 క్రికెట్‌లో పవర్‌ప్లేలో అత్యధిక స్కోర్‌ సాధించిన జట్టుగా ఎస్‌ఆర్‌హెచ్‌ జట్టు చరిత్ర సృష్టించింది. ఇంతుకుమందు ఈ రికార్డుకు ఇంగ్లండ్‌ కౌంటీ జట్టు నాటింగ్‌హామ్‌షైర్ పేరిట ఉండేది. 2017లో జరిగిన ఓ టీ 20 మ్యాచ్‌లో డర్హామ్‌పై 6 ఓవర్లలో 106 పరుగులు చేసింది.

తాజా మ్యాచ్‌తో ఈ ఆల్‌టైమ్‌ రికార్డును సన్‌రైజర్స్‌ బ్రేక్‌ చేసింది. అదేవిధంగా ఐపీఎల్‌లో కూడా అత్యధిక పవర్‌ప్లే స్కోర్‌ సాధించిన జట్టుగా సన్‌రైజర్స్‌ నిలిచింది. ఇంతకుముందు కేకేఆర్‌ పేరిట ఉండేది. కేకేఆర్‌ 2017 సీజన్‌లో ఆర్సీబీపై పవర్‌ప్లేలో 106 పరుగులు చేసింది. ఇక ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో హెడ్‌, అభిషేక్‌ తొలి వికెట్‌కు 131 పరుగులు భాగస్వామ్యం నెలకొల్పారు. హెడ్‌ కేవలం 32 బంతుల్లో 11 ఫోర్లు, 6 సిక్స్‌లతో 89 పరుగులు చేయగా.. అభిషేక్‌ కేవలం 12 బంతుల్లో 2 ఫోర్లు, 6 సిక్స్‌లతో 46 పరుగులు చేశాడు.