Gold Price | బంగారం ధర రూ.2 లక్షల మార్కును తాకనుందా..?.. గోల్డ్‌ మార్కెట్‌ను షేక్‌ చేస్తున్న అంచనాలు

www.mannamweb.com


Gold Price | న్యూఢిల్లీ/ముంబై, మే 1: తులం బంగారం ధర రూ.2 లక్షల మార్కును తాకబోతున్నదా?.. దేశీయ గోల్డ్‌ మార్కెట్‌ను ఈ అంచనా ఇప్పుడు షేక్‌ చేస్తున్నది.

అవును.. ప్రస్తుతం రికార్డు స్థాయి దరిదాపుల్లో కదలాడుతున్న పసిడి రేట్లు.. మున్ముందు మరింత పెరుగుతాయంటున్నారు. ఈ క్రమంలోనే 10 గ్రాముల 24 క్యారెట్‌ పుత్తడి విలువ లక్ష రూపాయలు కాదు.. ఏకంగా రూ.2 లక్షలు పలుకుతుందని ట్రేడింగ్‌ వర్గాలు చెప్తుండటం గమనార్హం.

ఇదీ లెక్క..

గడిచిన 9 ఏండ్లలో భారతీయ మార్కెట్‌లో బంగారం ధర మూడింతలైంది. 2015లో 10 గ్రాములు రూ.24,740గా ఉన్నది. కానీ ఇప్పుడు రూ.75,000కు అటుఇటుగా వచ్చింది. అంటే 2015తో పోల్చితే 2024కల్లా మూడింతలు పెరిగింది. అలాగే 2006లో తులం రూ.8,250గా నమోదైంది. అక్కడి నుంచి 9 ఏండ్లకు ఇది మూడింతలై.. 2015లో రూ.25,000 మార్కును సమీపించింది. ఈ నేపథ్యంలోనే వచ్చే 7 నుంచి 12 ఏండ్లలో తులం పసిడి ధర దేశీయ మార్కెట్‌లో రూ.2 లక్షల్ని దాటేస్తుందని మార్కెట్‌లో గట్టిగా వినిపిస్తున్నది. నిజానికి రోజులు గడుస్తున్నకొద్దీ బంగారం ధరలు గణనీయంగా పెరుగడానికి కారణం.. పుత్తడిని కేవలం ఓ ఖరీదైన అలంకరణ సాధనంగానేగాక పెట్టుబడిగా చూసేవారు ఎక్కువైపోవడమే. 1987లో 10 గ్రాములు రూ.2,570గా ఉన్నది. 19 ఏండ్ల తర్వాత 2006లో ఇది దాదాపు మూడింతల ధరకు చేరింది. కానీ ఆ తర్వాత ధరలు పరుగులు పెట్టడాన్ని గమనించవచ్చు. ఇందుకు కారణం మదుపరులలో మారిన ఆలోచనా వైఖరేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ ధోరణి ఇంకా పెరుగుతూపోతే 2030కల్లా తులం బంగారం రేటు రూ.2 లక్షలకు చేరువ కావడం ఖాయమేనన్న అంచనాలు బలంగా ఉన్నాయి.

గత ఐదేండ్లలో..

గత ఐదేండ్లలో బంగారం ధరలు రివ్వున ఎగిసి పడటానికి వెనుక అనేక కారణాలు, అంశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ బలహీనపడటం, భౌగోళిక రాజకీయ అనిశ్చిత పరిస్థితులు, కరోనా మహమ్మారితో ఏర్పడ్డ పరిణామాలు, రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం వంటివి గోల్డ్‌ రేటు వృద్ధిలో 75 శాతానికి కారణమయ్యాయి. ఈ 3.3 ఏండ్లలోనే తులం ధర రూ.40,000 నుంచి రూ.70,000 దాటేసింది. అంతకుముందు 2014 నుంచి 2018 వరకు పెరిగింది 12 శాతమే. రూ.28,000 నుంచి రూ.31,250కి చేరింది. కానీ ఆ తర్వాత రాకెట్‌ వేగాన్ని అందుకోవడం గమనించవచ్చు. అప్పుడే కరోనా, యుద్ధం, అనిశ్చితి, రూపీ నష్టాలు బాగా పెరిగాయి.

నిపుణుల మాట..

దేశ, విదేశీ స్టాక్‌ మార్కెట్లతోపాటు ఇతర పెట్టుబడులకు ప్రత్యామ్నాయ మార్గంగా మదుపరులకు కనిపిస్తున్నది బంగారమే. గోల్డ్‌ను ఓ సురక్షిత పెట్టుబడి సాధనంగా అంతా భావిస్తున్నారు మరి. అయినప్పటికీ ఆయా అంశాలు దీన్నీ ప్రభావితం చేస్తూనే ఉన్నాయి. కానీ ఇతర ఇన్వెస్ట్‌మెంట్లతో చూస్తే తక్కువ రిస్క్‌ ఉంటున్నది. దీంతో బంగారంపై పెట్టుబడులు భవిష్యత్తులో ఆకర్షణీయ లాభాలనే అందిస్తాయని ఎక్స్‌పర్ట్స్‌ పేర్కొంటున్నారు. అయితే పెట్టుబడుల్లో వైవిధ్యాన్ని కనబరుస్తూ ముందుకెళ్తే మరింత లాభాలను పొందవచ్చని, కనుక ఇన్వెస్ట్‌మెంట్‌ పోర్ట్‌ఫోలియోను మార్కెట్‌ నిపుణుల సలహాతో తీర్చిదిద్దుకోవాలని సూచిస్తున్నారు. బంగారాన్ని భౌతికం (నగలు)గా కాకుండా బాండ్లు, ఇతరత్రా మార్గాల్లో మదుపు చేసుకోవడం ఉత్తమమని పేర్కొంటున్నారు.