ఫాం-12 సమర్పణ గడువు ముగియడానికి కొన్నిగంటల ముందు ఎన్నికల విధులు
దరఖాస్తు సమర్పించలేక పోవడంతో ఓటుహక్కు కోల్పోయిన వందల మంది
ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓట్లేస్తారని కుట్ర!
ఈనాడు, అమరావతి: ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రచారం చేసే ఎన్నికల సంఘం.. ఉద్యోగులపై మాత్రం కక్షగట్టినట్లు వ్యవహరిస్తోంది. పోస్టల్ బ్యాలట్ దరఖాస్తు ఫాం-12 సమర్పణకు గడువు ముగియడానికి కొన్ని గంటల ముందు, గడువు ముగిసిన తర్వాత ఎన్నికల విధులు కేటాయించడంతో కొంతమంది పోస్టల్ బ్యాలట్ సదుపాయం కోల్పోయారు. పోలింగ్ బూత్‌లలో ఇతర పోలింగ్ అధికారులు(ఓపీఓ)లుగా ఎస్జీటీ టీచర్లు, అంగన్‌వాడీ కార్యకర్తలు, విద్యాసంస్థల్లోని ఒప్పంద ఉద్యోగులు, ఎయిడెడ్ సంస్థల్లో పని చేసేవారికి విధులు కేటాయించారు. వీరందరికీ పోస్టల్ బ్యాలట్ సదుపాయం కల్పించాలి. పోస్టల్ బ్యాలట్ ఫాం-12 సమర్పణకు గడువు ఈ నెల ఒకటో తేదీతో ముగిసింది. ఈ గడువు ముగియడానికి కొన్ని గంటల ముందు, ఆ తర్వాత కొందరికి ఎన్నికల డ్యూటీలు వేశారు. సమయం లేకపోవడంతో ఇలా డ్యూటీలు పడిన వారు పోస్టల్ బ్యాలట్‌కు దరఖాస్తు చేసుకోలేక పోయారు. శ్రీసత్యసాయి జిల్లాలో ఓపీఓలుగా విధులు కేటాయించినట్లు బుధవారం సాయంత్రం తెలిపారు. అప్పటికే పోస్టల్ బ్యాలట్ దరఖాస్తు సమర్పణకు గడువు ముగిసింది. ఎన్నికల సంఘం అలసత్వం కారణంగా వీరంతా ఓటుకు దూరమయ్యారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం, విజయవాడలోని లయోలా కళాశాలల్లోనూ ఇలాంటి పరిస్థితే నెలకొంది. పోస్టల్ బ్యాలట్ దరఖాస్తు సమర్పణకు గడువు పొడిగించాలని అధికారులు కోరుతున్నా పట్టించుకోని ఎన్నికల సంఘం.. ఉద్యోగులకు మాత్రం ఇంకా విధులు కేటాయిస్తూనే ఉంది.
ఏమిటీ నిర్లక్ష్యం?
విశాఖ ఆంధ్ర విశ్వవిద్యాలయంలోని ఒప్పంద ఉద్యోగులకు పోలింగ్ డ్యూటీ వేసిన అధికారులు.. వారు పోస్టల్ బ్యాలట్ వినియోగించుకోకుండా చేశారు. వర్సిటీలో పనిచేస్తున్న సుమారు 200 మంది ఒప్పంద ఉద్యోగులకు ఓపీఓలుగా డ్యూటీలు వేసినట్లు మంగళవారం ఆదేశాలనిచ్చి ఒక్క రోజులోనే అంటే బుధవారంలోపు పోస్టల్ బ్యాలట్ ఫాం-12 సమర్పించాలని సూచించారు. ఫాం-12ను ఎక్కడ సమర్పించాలనే దానిపై స్పష్టతనివ్వలేదు. కొంతమందికి భీమిలి నియోజకవర్గంలో ఓటు ఉండటంతో అక్కడికి వెళ్లి ఇచ్చారు. మరికొందరు విశాఖ ఉత్తర, దక్షిణ నియోజకవర్గాలకు వెళ్లి సమర్పించగా.. చాలామంది ఫాం-12ను అసలు ఇవ్వనేలేదు. వాస్తవంగా వర్సిటీ తరఫున వాటిని తీసుకొని సహాయ రిటర్నింగ్ అధికారికి సమర్పిస్తే సరిపోతుంది. కానీ, ఒప్పంద ఉద్యోగుల ఓట్లు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పడతాయనే ఉద్దేశంతో ఇలా చేసినట్లు విమర్శలున్నాయి. దాదాపు 150 మంది ఫాం-12 సమర్పించ లేకపోయారు. మరో నలుగురికి బుధవారమే డ్యూటీలు వేసి, అప్పుడే ఫాం-12 సమర్పించాలని ఆదేశాలిచ్చారు.
శ్రీసత్యసాయి జిల్లాలో ఎస్జీటీ టీచర్లకు ఓపీఓలుగా డ్యూటీలు వేస్తున్నట్లు బుధవారం సాయంత్రం చెప్పారు. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం బుధవారం సాయంత్రంతో పోస్టల్ బ్యాలట్ దరఖాస్తు ఫాం-12 సమర్పణకు గడువు ముగిసింది. సహాయ రిటర్నింగ్ అధికారులు ఫాం-12 తీసుకోవడానికి నిరాకరించారు. దీంతో వీరంతా ఓటు హక్కును కోల్పోయారు.
విజయవాడలోని లయోలా కళాశాలలో ఎయిడెడ్ సిబ్బందితోపాటు అన్ ఎయిడెడ్ ప్రైవేటు వారికి విధులు కేటాయించారు. వేసవి సెలవులు కావడంతో వారు విధులకు రావడం లేదు. ఎన్నికల డ్యూటీలు వేసినట్లు ఆలస్యంగా సమాచారం ఇచ్చారు. వీరికి సంబంధించిన ఫాం-12ను సమర్పించేందుకు గురువారం సహాయ రిటర్నింగ్ అధికారుల వద్దకు వెళ్లగా వాటిని తీసుకోవడానికి నిరాకరించారు.