ఏపీలో ఎన్నికల సమరం హోరా హోరీగా మారుతోంది. కూటమి నేతలు జగన్ ను టార్గెట్ చేస్తున్నారు. చంద్రబాబు, పవన్, పురందేశ్వరి ప్రతీ సభలో జగన్ లక్ష్యంగా విమర్శలు చేస్తున్నారు. జగన్ తన ప్రచారం లో చంద్రబాబు లక్ష్యంగా వ్యాఖ్యలు కొనసాగిస్తున్నారు. విశ్వసనీయత గురించి ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. ఇదే సమయంలో జగన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. మరో పది రోజుల్లో పోలింగ్ జరగనున్న వేళ కూటమిని ఫిక్స్ చేసే వ్యూహాన్ని అమలు చేస్తున్నారు.
వైసీపీ కొత్త ప్రచారం
టీడీపీ కూటమి, వైసీపీ ఇప్పటికే తమ మేనిఫెస్టోలను ప్రకటించాయి. జగన్ నవరత్నాలను కొనాగిస్తూనే అమ్మఒడి, రైతు భరోసా, పెన్షన్ పెంపుతో ప్రజల్లోకి మరోసారి తీర్పు కోసం వెళ్తున్నారు. టీడీపీ కూటమి మేనిఫెస్టోలో పలు హామీలు ఇచ్చారు. బీసీ,ఎస్సీ, ఎస్టీ,మైనార్టీలకు 50 ఏళ్లకే పెన్షన్ ఇస్తామని హామీ ఇచ్చారు. జగన్ ప్రతీ సభలో చంద్రబాబు హామీలను నమ్మవద్దని..2014లో ఇదే తరహాలో చెప్పిన హామీలను అమలు చేయలేదని చెబుతున్నారు. ఇదే సమయంతో తన మేనిఫెస్టోలోని సంక్షేమ పథకాలను వివరిస్తున్నారు. ఈ తరహా ప్రచారం కొనసాగిస్తూనే..ప్రచారంలో మిగిలిన సమయంలో కొత్త తరహాలో ప్రజల ముందకు వెళ్లేలా తాజాగా నిర్ణయించారు.
మేనిఫెస్టోతో ప్రతీ ఇంటికి
వైసీపీ నవరత్నాల ప్లస్ మేనిఫెస్టోలోని అంశాలను ప్రతి గడపకూ వెళ్లి, ప్రతి ఓటరుకు వివరించాలని డిసైడ్ అయ్యారు. బీసీలు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు, అగ్రవర్ణాల్లోని నిరుపేదలు అంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలు, నియోజకవర్గాలు, పట్టణాలు, పల్లెల్లోని ప్రతి ఇంటికి తీసుకెళ్లేలా కార్యాచరణ నిర్ణయించారు. వెంటనే దీనిని ప్రారంభించాలని ఆదేశించారు.దీంతో.. జగన్ కోసం సిద్ధం నినాదంతో పార్టీ క్యాడర్ ముందుకెళ్తుంది. అదే సమయంలో టీడీపీ,జనసేన మేనిఫెస్టోకు బీజేపీ మద్దతు లేదనే అంశంతో పాటుగా..సాధ్యం కాని హామీలను చంద్రబాబు ఇచ్చారనేది ఈ ప్రచారంలో వైసీపీ శ్రేణులు ప్రధానంగా వివరించనున్నారు. అటు జగన్ ప్రచారంలో విశ్వసనీయత గురించి ప్రశ్నిస్తున్నారు.
కూటమిని టార్గెట్ చేస్తూ ;;;
టీడీపీ కూటమి ప్రకటించిన మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల గురించి చర్చ జరుగుతోంది. వైసీపీకి మించిన సంక్షేమం అందిస్తామని టీడీపీ చెబుతోంది. ఇదే సమయంలో అసలు టీడీపీ, జనసేన మేనిఫెస్టోకు కలిసి పోటీ చేస్తున్న బీజేపీ నమ్మటం లేదని వైసీపీ వాదిస్తోంది. ఈ నెల 13న పోలింగ్ జరగనుంది. ప్రచారానికి మరో 9 రోజుల సమయం మాత్రమే ఉంది. ఈ సమయంలోనే మేనిఫెస్టోను ప్రతీ ఇంటికి తీసుకెళ్లి ఓటర్ల మద్దతు కూడగట్టాలని వైసీపీ వ్యూహంగా కనిపిస్తోంది. దీంతో..ఇప్పుడు ఎన్నికల వేళ వైసీపీ వ్యూహం ఎంత వరకు ఫలిస్తుందనేది ఆసక్తి కరంగా మారుతోంది.