ఏపీలో ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తామంటున్నాయి ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్. రోగులకు అందించిన చికిత్సలకు తగ్గట్లు ఫీజుల చెల్లింపుల్లో ఆలస్యం, ప్యాకేజీ ధరలను పెంచకపోవడాన్ని నిరసిస్తూ ఈ నెల 29వ తేదీ నుంచి ఆరోగ్యశ్రీ ట్రస్టు కింద కొత్త కేసులను చూసేది లేదని అసోసియేషన్ తెలిపింది. న్యాయపరమైన తమ డిమాండ్లను ఆమోదించే ఉద్దేశం రాష్ట్ర ప్రభుత్వంలో కనిపించకపోవడంతో ఈ నిర్ణయాన్ని తీసుకున్నామని తెలిపారు. ఉద్యోగుల ఈహెచ్‌ఎస్ కింద కూడా వైద్య సేవలు అందించలేమన్నారు.
ఈ ఏడాది జూన్, నవంబరు నెలల్లో తమ డిమాండ్ల పరిష్కారం కోసం సేవలు నిలిపివేస్తామని అసోసియేషన్ ప్రకటించింది. ఆ తర్వాత చర్చలు జరిపి ఈ సమస్యలు పరిష్కరిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఈ మేరకు రోగులకు ప్రైవేటు ఆసుపత్రులు యథావిధిగా సేవలు కొనసాగించాయి. గత నెలలో ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం నుంచి సానుకూల చర్యలు లేకపోవడంతో.. ఈ నెల 29 నుంచి వైద్యసేవలు నిలిపివేయాలని నిర్ణయించామన్నారు. ఈ మేరకు లేఖను 22వ తేదీన ప్రభుత్వానికి అందజేశామంటోంది.
ప్రస్తుతం ప్రైవేటు ఆసుపత్రులకు రూ.1,000 కోట్ల వరకు చెల్లించాల్సి ఉంది. ప్రభుత్వంతో నవంబరులో జరిగిన చర్చల సందర్భంగా డిసెంబరు నెలాఖరులోగా పూర్తిస్థాయిలో చెల్లిస్తామని హామీ ఇచ్చినా అమలు కాలేదు. 2013 నుంచి చికిత్సల ప్యాకేజీ ధరలను పెంచలేదంటున్నారు.. పెంపు కోసం అసోసియేషన్ తరఫున పలుమార్లు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినా ఫలితం లేదంటున్నారు. అంతేకాదు తాజాగా కుటుంబ వార్షిక చికిత్స పరిమితి ప్రస్తుతం రూ.5 లక్షలు ఉండగా రూ.25 లక్షలకు పెంచారు. పెంపు నిర్ణయం ప్రైవేటు ఆసుపత్రులపై ఆర్థిక భారాన్ని పెంచింది అంటున్నారు.
ఆయుష్మాన్ భారత్ కింద నిర్ణయించిన ధరలను పరిగణనలోకి తీసుకుని ఇటీవల ప్యాకేజీ ధరలను 10శాతం తగ్గించారు. 70శాతం ప్యాకేజీ ధరల్లో మార్పు చేయలేదంటున్నారు. మిగిలిన ప్యాకేజీల ధరల పెంపు 2.5 శాతం మేర పెరిగింది.. ఈ చర్యలతో ఆసుపత్రులకు ఆర్థికంగా జరిగిన ప్రయోజనం శూన్యం అంటున్నారు. ఈ పరిస్థితుల్లో వైద్య సేవల నిలిపివేత నిర్ణయం ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలనో..ఎన్నికలను దృష్టిలో పెట్టుకునో తీసుకున్నది కాదంటున్నారు. గత్యంతరం లేని పరిస్థితుల్లోనే ఈ నెల 29 నుంచి ఆరోగ్యశ్రీ కేసులను చూడకూడదు అని నిర్ణయించామంటున్నారు.
ఆరోగ్యశ్రీ వైద్య సేవలు నిలిపివేయాలని గత నెలలోనే నెట్‌వర్క్ ఆస్పత్రులు నిర్ణయం తీసుకున్నాయి. ప్రభుత్వం చర్చలు జరిపి.. నెట్‌వర్క్ సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. డిసెంబరు 15 నాటికి ప్యాకేజీల పెంపుపై నిర్ణయం తీసుకుంటామని చెప్పా రు. ఇప్పటివరకూ ఈ ప్రక్రియ ప్రారంభం కాలేదంటున్నారు. పైగా ఆస్పత్రుల బకాయిల విడుదల్లో కూడా తాత్సారం చేస్తున్నారు. దీంతో సమస్యలు పరిష్కారమయ్యే వరకూ నిరసన కొనసాగించాలని నిర్ణయించాయి.