కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం తాటిపర్తిలో జనసైనికులపై వైకాపా వర్గీయులు ఆదివారం రాత్రి దాడికి పాల్పడ్డారు. సినీ హీరో సాయి ధరమ్‌తేజ్ కాన్వాయ్ ముందుకు వెళుతున్న తరుణంలో గుర్తుతెలియని వ్యక్తి రాయి విసరడంతో తాటిపర్తి గ్రామానికి చెందిన జనసైనికుడు నల్లల శ్రీధర్ గాయపడ్డాడు. ఈ ఘటనతో తాటిపర్తిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వివరాల్లోకి వెళితే.. పవన్‌కల్యాణ్‌కు మద్దతుగా సాయి ధరమ్‌తేజ్ ప్రచారం నిర్వహించేందుకు తాటిపర్తికి వస్తున్నారని తెలిసి భారీగా జనసైనికులు స్థానిక గజ్జాలమ్మ కూడలికి చేరుకుని పవన్ కల్యాణ్‌కు మద్దతుగా నినాదాలు చేశారు. అక్కడికి సమీపంలో ఉన్న శిబిరంలో నుంచి వైకాపా వర్గీయులు జగన్‌కు మద్దతుగా నినాదాలు చేశారు. దీంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. సాయి ధరమ్ తేజ్ తాటిపర్తి కూడలిలో మాట్లాడి చినజగ్గంపేట వెళ్లగా.. ఆయన తిరిగి వచ్చేలోపు వైకాపా వర్గీయులు టపాకాయలు కాల్చి కవ్వింపు చర్యలకు దిగడంతో పాటు.. నినాదాలు, వాగ్వాదాలు, తోపులాటలు సాగాయి. సాయిధరమ్‌తేజ్ తిరిగి వెళుతుండగా కాన్వాయ్‌పై గుర్తు తెలియని వ్యక్తి రాయి విసరడంతో నల్లల శ్రీధర్ అనే జనసైనికుడికి తలకు తీవ్ర గాయమైంది. క్షతగాత్రుణ్ని హుటాహుటిన ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందించారు.
పోలీసులు అక్కడికి చేరుకుని ఇరువర్గాలను పంపించి బందోబస్తు ఏర్పాటు చేశారు. కాన్వాయిపై వేసిన రాయి తనకు తగిలినట్లు క్షతగాత్రుడు శ్రీధర్ తెలిపారు. సాయిధరమ్‌తేజ్ పర్యటనకు అనూహ్య స్పందన రావడంతో తట్టుకోలేక ఉక్రోషంతో వైకాపా వర్గీయులు దాడికి దిగినట్లు జనసేన శ్రేణులు ఆరోపిస్తున్నాయి. దాడికి పాల్పడిన తీరును జనసేన ఎంపీ అభ్యర్థి తంగెళ్ల ఉదయ్‌శ్రీనివాస్‌కు స్థానికులు వివరించారు. పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రుణ్ని పరామర్శించారు. ఓటమి భయంతోనే వంగాగీత ఈ దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. సోమవారం కల్లా నిందితులను అరెస్టు చేయకపోతే కాకినాడ జిల్లా ఎస్పీ కార్యాలయాన్ని, గొల్లప్రోలు పోలీసు స్టేషన్‌ను ముట్టడిస్తామని వర్మ హెచ్చరించారు. కడప, కర్నూలు నుంచి కొందరు పిఠాపురం వచ్చారని సమాచారం తమకు ఉందన్నారు. పవన్ కల్యాణ్‌ను ఓడించడమే లక్ష్యంగా ఈ దాడులకు దిగుతున్నారని ఆరోపించారు.