నిజం చెప్పటమే నేరమా..? 572 మంది ఉపాధ్యాయులకు నోటీసులు

www.mannamweb.com


ఉపాధ్యాయులు నిజం చెప్పడమే రాష్ట్రంలో నేరమైంది. అడ్డదారులు తొక్కకుండా తమ పాఠశాలల్లో సమస్యలను నమోదు చేసిన ఉపాధ్యాయులకు రాష్ట్ర ఉన్నతాధికారులు నోటీసులు పంపించడం చర్చనీయాంశమైంది. దీనిపై ఉపాధ్యాయ సంఘాలు, ఉపాధ్యాయులు మండిపడుతున్నారు.

పార్వతీపురం పట్టణం, విజయనగరం విద్యావిభాగం, న్యూస్‌టుడే: పాఠశాలల్లో సమస్యలను యూడైస్‌లో ఉపాధ్యాయులు నమోదు చేయాల్సి ఉంటుంది. దీని ద్వారా రాష్ట్రాలకు ర్యాంకులు కేటాయించి నీతి ఆయోగ్‌ నిధులు విడుదల చేస్తుంది. కానీ పాఠశాలల్లోని సమస్యలను ఉన్నది ఉన్నట్లు నమోదు చేయడంతో రాష్ట్ర ర్యాంకు దిగజారిపోయింది. దీంతో ఉపాధ్యాయులు తప్పు చేశారని ఉన్నతాధికారులు నోటీసులు ఇచ్చినట్లు సంఘాల సభ్యులు చెబుతున్నారు. పార్వతీపురం మన్యంలో 32 పాఠశాలలకు తరగతి గదులు, 121 చోట్ల మరుగుదొడ్లు, 53 చోట్ల తాగునీరు, 56 పాఠశాలల్లో విద్యుత్తు, 336 చోట్ల ఇంటర్నెట్‌ కనెక్షన్‌ లేదని యూడైస్‌లో పేర్కొన్నారు. కానీ జాబితాలు తప్పుగా ఉన్నాయని, అన్నీ సక్రమంగా ఉన్నట్లు నివేదిక ఇవ్వాలని కోరుతున్నారన్నారు.

ఉమ్మడి జల్లాలో పరిస్థితి..
ఉమ్మడి జిల్లాల పరిధిలో పార్వతీపురం మన్యం నుంచి 537, విజయనగరంలో 35 మందికి షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు. వీరిలో సంతకవిటి, ఎస్‌.కోట, వంగర, వేపాడ, గరివిడి, గుర్ల, మెరకముడిదాం, రేగిడి ఆమదాలవలస, రాజాం, రామభద్రపురం, బాడంగి, చీపురుపల్లి, పార్వతీపురం, సీతంపేట, భామిని, మక్కువ, బలిజిపేట, గుమ్మలక్ష్మీపురం, గరుగుబిల్లి, జియ్యమ్మవలస, కొమరాడ, కురుపాం, పాచిపెంట, పాలకొండ, సాలూరు, సీతానగరం, వీరఘట్టం మండలాలకు చెందిన వారున్నారు. సంబంధిత హెచ్‌ఎంలు, ఎంఈవోలు వివరణ ఇవ్వాలని పేర్కొన్నారు.

ఎన్నడూ లేని విధంగా ఒత్తిడి..
గతంలో ఎన్నడూ లేని విధంగా విద్యాశాఖపై ఈ అయిదేళ్లలో ఒత్తిడి పెంచారు. రాష్ట్రస్థాయి అధికారులు తనిఖీల పేరుతో ఉపాధ్యాయులను భయాందోళనకు గురి చేశారు. చిన్న చిన్న పొరపాట్లు, తప్పులకు నోటీసులు ఇస్తూ సస్పెన్షన్లు చేశారు. విద్యార్థుల ముందే ఉపాధ్యాయులను దూషించారు. ఈ వైఖరిపై ఉపాధ్యాయులు, సంఘాలు నిరసనలు, ఆందోళనలు చేసినా ఎలాంటి మార్పు రాలేదు.

గతేడాది విద్యాశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ ప్రవీణ్‌ప్రకాశ్‌ వీరఘట్టంలోని కేజీబీవీని సందర్శించారు. కొందరు విద్యార్థులకు పుస్తకాలు సరఫరా చేయలేదని డీఈవో, ఎంఈవో, పాఠశాల ఎస్‌వోని సస్పెండ్‌ చేయడం విమర్శలకు దారితీసింది.
ఉమ్మడి జిల్లాలో ముఖ హాజరు అమలు విషయంలో ఉన్నతాధికారుల తీరుతో గురువులు ఆందోళన చేపట్టారు.
వర్కు, నోట్‌ పుస్తకాలను దిద్దలేదని రాష్ట్రస్థాయి అధికారులు హడావుడి చేసి నోటీసులు జారీ చేశారు.
ఎన్నికల నేపథ్యంలో పాఠశాలల్లో ఉన్న పోలింగ్‌ బూత్‌లలో దివ్యాంగుల కోసం ర్యాంపుల నిర్మాణానికి బలవంతం చేయడంతో సొంత నిధులు వినియోగించామని పలువురు ఉపాధ్యాయులు చెబుతున్నారు.