Andhra Pradesh : కడప బాద్‌షా ఎవరో?

www.mannamweb.com


ఈ దఫా వైసీపీ, టీడీపీ, కాంగ్రెస్‌ మధ్య బిగ్‌ఫైట్‌

తొలిసారి వైఎస్‌ కుటుంబం నుంచి అక్కాతమ్ముడి పోటీ

కాంగ్రెస్‌ తరఫున తొలిసారి షర్మిల బరిలోకి

ఆమెకు మద్దతుగా సునీత ప్రచారం

వైసీపీ అభ్యర్థిగా వైఎస్‌ అవినాశ్‌రెడ్డి

టీడీపీ అభ్యర్థిగా మొదటిసారి భూపేశ్‌రెడ్డి పోటీ

వివేకా హత్య కేసే ప్రధాన ప్రచారాస్త్రం

రాయలసీమకు నడిబొడ్డున ఉన్న కడప లోక్‌సభ నియోజకవర్గం.. ఒకప్పుడు ఫ్యాక్షన్‌కు అడ్డా. కళలు, కవులు, ఖనిజాభివృద్ధి, మత సామరస్యానికి నిలయం.. తిరుమలేశుని కడప దేవునికడప.. కాలజ్ఞాని పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి నడచిన ఈ గడ్డలో.. ఈసారి లోక్‌సభ ఎన్నికలు హైవోల్టేజీ రగిలిస్తున్నాయి. కడప లోక్‌సభ స్థానం 1952లో ఆవిర్భవించింది.

తొలినాళ్లలో ఇది కమ్యూనిస్టుల కోట. 1952లో జరిగిన తొలి ఎన్నికల్లో సీపీఐ గెలిచింది. 1957లో కాంగ్రెస్‌ నెగ్గింది. ఆ తర్వాత 1962, 67, 71 ఎన్నికల్లో వరుసగా సీపీఐ విజయం సాధించింది. అనంతరం కాంగ్రె్‌సదే పైచేయి అయ్యింది. 1984లో టీడీపీ నుంచి డి.నారాయణరెడ్డి ఎంపీగా ఎన్నికయ్యారు. 1989 నుంచి ఈ స్థానం వైఎస్‌ కుటుంబానికి కంచుకోటగా మారింది. 1989, 91, 96, 98 ఎన్నికల్లో వైఎస్‌ వరుసగా గెలుపొందారు. 1999, 2004 ఎన్నికల్లో వైఎస్‌ వివేకా ఎన్నికయ్యారు. 2009లో జగన్‌ గెలిచారు.

వైసీపీ స్థాపించిన తరువాత కాంగ్రెస్‌ ఎంపీగా రాజీనామా చేసి 2011 ఉప ఎన్నికలో బరిలోకి దిగి విజయం సాధించారు. 2014, 19 ఎన్నికల్లో వరుసగా అవినాశ్‌రెడ్డి ఎన్నికయ్యారు. ఇప్పుడు మూడోసారి పోటీ చేస్తున్నారు.

వైసీపీ ఓట్ల చీలికతో టీడీపీకి లబ్ధి!

ప్రస్తుత ఎన్నికల్లో మాజీ సీఎం వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి కుమార్తె, పీసీసీ అధ్యక్షురాలు షర్మిలారెడ్డి.. తన అన్న సీఎం జగన్మోహన్‌రెడ్డిని నేరుగా సవాల్‌ చేస్తున్నారు. జగన్‌ నిలబెట్టిన తన చిన్నాన్న వైఎస్‌ భాస్కర్‌రెడ్డి కుమారుడు అవినాశ్‌రెడ్డిపై ఆమె పోటీచేస్తున్నారు. ఒకప్పుడు పులివెందుల ఉప ఎన్నికలో రాజశేఖర్‌రెడ్డి భార్య విజయలక్ష్మి, తమ్ముడు వివేకానందరెడ్డి తలపడ్డారు. అయితే కడప లోక్‌సభ స్థానంలో వైఎస్‌ కుటుంబ సభ్యులు ఒకరిపై మరొకరు పోటీచేస్తుండడం ఇదే తొలిసారి.

2019 ఎన్నికల్లో జగన్‌ పార్టీ గెలుపు కోసం ప్రచారం చేసిన షర్మిల.. నేడు అదే పార్టీని ఢీకొంటున్నారు. టీడీపీ సైతం ఈసారి ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని మాజీ ఎమ్మెల్సీ చదిపిరాళ్ల నారాయణరెడ్డి కుమారుడు భూపేశ్‌రెడ్డిని బరిలోకి దింపింది. వైసీపీ ఓట్ల చీలికపైనే టీడీపీ ఆశలు పెట్టుకుంది. ఆ ఓట్లు షర్మిల, అవినాశ్‌ మధ్య చీలిపోతే టీడీపీ నెగ్గే అవకాశాలు కూడా ఉన్నాయని పరిశీలకులు అంటున్నారు.

వివేకా హత్య చుట్టూ..

2019 ఎన్నికల ముందు జరిగిన తన చిన్నాన్న వివేకా హత్యను జగన్‌ అనుకూలంగా మలుచుకుని రాజకీయంగా లబ్ధిపొందారు. వివేకా హత్య కేసు దర్యాప్తును సీబీఐకి ఇవ్వాలని ఎన్నికల ముందు డిమాండ్‌ చేసిన ఆయన.. గద్దెనెక్కాక ఆ పిటిషన్‌ను ఉపసంహరించుకున్నారు. దర్యాప్తు సీబీఐకి వెళ్లాక అనేక కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి.

దస్తగిరి అప్రూవర్‌గా మారిన తర్వాత శివశంకర్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి, అవినాశ్‌రెడ్డిల పాత్ర తెరపైకి వచ్చింది. అయినా అవినాశ్‌ కుటుంబానికి జగన్‌ అండగా నిలిచారు. చెల్లెలు సునీత భర్త రాజశేఖర్‌రెడ్డే హత్య చేసి ఉంటారని ప్రత్యారోపణ చేశారు.

ఈ కేసులో నిందితుడిగా ఉన్న అవినాశ్‌కే మళ్లీ ఎంపీ టికెట్‌ ఇవ్వడాన్ని షర్మిల, సునీత జీర్ణించుకోలేకపోయారు. అవినాశ్‌కు టికెట్‌ ఇవ్వడం వల్లే తాను పోటీ చేస్తున్నానని షర్మిల చెబుతున్నారు. ఆమెకు మద్దతుగా సునీత ప్రచారం చేస్తున్నారు. కడప, బద్వేలు, మైదుకూరు, కమలాపురం, పులివెందుల నియోజకవర్గాల్లో వివేకా అభిమానులు మెండుగా ఉండడంతో వారి ప్రచారం ఇక్కడే సాగుతోంది.

– కడప, ఆంధ్రజ్యోతి

నియోజకవర్గ స్వరూపం

(కడప, పులివెందుల, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, బ ద్వేలు(ఎస్సీ), కమలాపురం, మైదుకూరు అసెంబ్లీ సెగ్మెంట్లు)

మొత్తం ఓటర్లు 16,39,066

పురుషులు 8,00,857

మహిళలు 8,37,993

ట్రాన్స్‌జెండర్లు 216

అవినాశ్‌రెడ్డి బలాలు..

సీఎం జగన్‌ అండ. జగన్‌ బహిరంగసభలో నా తమ్ముడు అమాయకుడు అంటూ వెనకేసుకురావడం, ఎమ్మెల్యేలందరితో సఖ్యతగా ఉండడం, జిల్లాలో ప్రజలకు అందుబాటులో ఉండడం.. సీఎం భార్య భారతీరెడ్డి స్వయంగా ప్రచారం చేస్తుండడం.

బలహీనతలు..

వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడి(ఏ-8)గా సీబీఐ చార్జిషీట్‌ వేయడం.. వివేకాను అవినాశే చంపించాడంటూ ఆయన కుమార్తె సునీత, షర్మిల ఊరూవాడా ప్రచారం చేస్తుండడంతో అవినాశ్‌పై పెల్లుబుకుతున్న ప్రజావ్యతిరేకత. ఇప్పటికే జగన్‌ సర్కారుపై తీవ్ర వ్యతిరేకత.. ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాల్లో అసంతృప్తి.. స్టీల్‌ ప్లాంటుకు మళ్లీ మళ్లీ శంకుస్థాపనలు.. అవినాశ్‌ సన్నిహితుల భూకబ్జాలు, దందాలు.

షర్మిల రెడ్డి బలాలు..

రాజశేఖర్‌రెడ్డి కుమార్తెగా ప్రజల్లో ఆదరణ. జగన్‌ జైలులో ఉన్నప్పుడు పాదయాత్ర చేసి వైసీపీని నిలబెట్టినా.. అధికారంలోకి వచ్చాక ఆమెను దూరం పెట్టడం. ఆస్తులివ్వకుండా ఇబ్బంది పెట్టడం, వివేకా హత్య కేసులో న్యాయం చేయండని కొంగుచాపి అడగడం.. ఆడబిడ్డ కావడంతో మహిళల్లో సానుభూతి. కాంగ్రె్‌సకు సంప్రదాయ ఓటుబ్యాంకుగా ఉన్న ముస్లిం, క్రిస్టియన్‌, దళితులు వైసీపీని వీడి కాంగ్రెస్‌ వైపు మొగ్గుచూపే అవకాశం. క్రైస్తవులతో బ్రదర్‌ అనిల్‌కుమార్‌ సమావేశాలు.

బలహీనతలు..

నిన్నమొన్నటిదాకా హైదరాబాద్‌కే పరిమితం కావడం.. స్థానిక నేతలపైనే ఆధారపడాల్సి రావడం.. రెండుచోట్ల మినహాయిస్తే మిగిలిన అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌కు బలమైన అభ్యర్థులు లేకపోవడం.

భూపేశ్‌ రెడ్డి బలాలు..

తొలిసారి పోటీ.. అయినా అండగా టీడీపీ కేడర్‌.. ప్రధానంగా జమ్మలమడుగు అసెంబ్లీ స్థానం నుంచి సొంత బాబాయి ఆదినారాయణరెడ్డి బీజేపీ తరఫున బరిలోకి దిగారు. ఇక్కడ వారి కుటుంబానికి సొంతగా ఓటుబ్యాంకు ఉంది. యువకుడు కావడం, అందరితో కలిసిపోవడం.. సూపర్‌సిక్స్‌ పథకాలు జనంలోకి బాగా వెళ్లడం.. వైసీపీ ఓట్లను షర్మిల చీలిస్తే టీడీపీ లాభపడే అవకాశం.

బలహీనతలు..

ఏడు అసెంబ్లీ సెగ్మెంట్ల నేతలతో సమన్వయం సాధించలేకపోవడం.. ఎన్నికల మేనేజ్‌మెంట్‌లో అనుభవం లేకపోవడం.. టీడీపీ నేతలు సొంత నియోజకవర్గాలకు పరిమితం కావడం.. పార్లమెంటు స్థానంపై దృష్టిపెట్టకపోవడం..