‘పది’లో 625/625 మార్కులు.. అదరగొట్టావ్‌ అంకిత!

www.mannamweb.com


పదో తరగతి ఫలితాల్లో కర్ణాటక విద్యార్థులు అదరగొట్టేశారు.. ఓ బాలిక ఏకంగా 625/625 మార్కులు సాధించగా.. ఏడుగురు విద్యార్థులు 624 మార్కులతో సత్తా చాటారు.

బెంగళూరు: ఇటీవల ఏపీలోని పదో తరగతి ఫలితాల్లో ఏలూరు జిల్లాకు చెందిన నాగసాయి మనస్వీ 599/600 మార్కులతో ప్రశంసలు అందుకోగా.. తాజాగా కర్ణాటకలో ఓ అమ్మాయి ఏకంగా 625/625 మార్కులు సాధించి అదరహో అనిపించింది. బాగల్‌కోట్‌ జిల్లాకు చెందిన అంకిత కొసప్ప ఎస్‌ఎస్‌ఎల్‌సీ పరీక్షల ఫలితాల్లో అన్ని సబ్జెక్టుల్లోనూ నూటికి నూరుశాతం మార్కులతో అదరగొట్టారు. తండ్రి బసప్ప రైతు కాగా.. తల్లి గృహిణి. ముధోల్‌ తాలుకాలో ఉన్న మొరార్జీ దేశాయ్‌ రెసిడెన్షియల్‌ పాఠశాలలో చదువుతున్న బాలిక.. ఇంజినీరింగ్‌ పూర్తి చేశాక ఐఏఎస్‌ కావడమే తన లక్ష్యమని చెబుతున్నారు. ఆమె సాధించిన అపూర్వ విజయం గురించి టీచర్లు చెప్పగానే స్వగ్రామం వజ్జరమట్టిలో ప్రజలంతా ఇంటికి చేరుకొని బాలికను అభినందించారు. గ్రామస్థులు సంబరాలు చేసుకొని మిఠాయిలు పంచుకున్నారు.

ఈసందర్భంగా అంకిత మాట్లాడుతూ.. ఈ విజయం అంతా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులదేనన్నారు. ఉపాధ్యాయులు తనను ఎంతగానో ప్రోత్సహించి సహకరించారన్నారు. ఈ విజయంతో తనకన్నా వాళ్లే ఎక్కువ ఆనందంగా ఉన్నారని చెప్పారు. ప్రీ-యూనివర్సిటీలో సైన్స్‌ను అభ్యసించాలని, ఇంజినీరింగ్‌ కోర్సు పూర్తి చేశాక.. ఆపై ఐఏఎస్‌ అధికారిగా దేశానికి సేవ చేయాలని కోరుకొంటున్నట్లు అంకిత తెలిపారు. ఫలితాల్లో ఫస్ట్‌ ర్యాంక్‌ సాధించిన బాలికకు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, బాలాకోట్‌ డిప్యూటీ కమిషనర్‌ కేఎం జానకి, జిల్లా పంచాయత్‌ సీఈవో శశిధర్‌ అభినందనలు తెలిపారు. డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ ఆమె కుటుంబాన్ని త్వరలో కలిసే అవకాశం ఉన్నట్లు సమాచారం. మరోవైపు, ఈ ఏడాది ఫలితాల్లో ఏడుగురు విద్యార్థులు 624 మార్కులతో రెండో ర్యాంకులో నిలవడం విశేషం. కర్ణాటక ఎస్‌ఎస్‌ఎల్‌సీ పరీక్షలు మార్చిలో జరగ్గా.. దాదాపు 8.6 లక్షల మందికి పైగా విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో 6.31 లక్షల మంది ఉత్తీర్ణత సాధించినట్లు అధికారులు వెల్లడించారు.