First Class Students: ఈనెల 10లోగా ఉచిత సీట్లలో విద్యార్థులను చేర్పించాలి..!

www.mannamweb.com


విద్యాహక్కు చట్టం ప్రకారం కార్పొరేట్/ప్రైవేటు పాఠశాలల్లో ఒకటో తరగతిలో ప్రవేశాలకు ఉచిత అడ్మిషన్లు లభించిన విద్యార్థులను ఈ నెల 10లోపు ఎంపికైన స్కూల్లో చేర్పించాల్సి ఉంటుందని సమగ్రశిక్ష శ్రీకాకుళం జిల్లా అదనపు ప్రాజెక్ట్ కో-ఆర్డినేటర్ (ఏపీసీ) డాక్టర్ రోణంకి జయప్రకాష్ తెలిపారు. మంగళవారం సమగ్రశిక్ష జిల్లా ప్రాజెక్ట్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ విద్యా హక్కు చట్టం ప్రకారం ప్రైవేటు పాఠశాలల్లో ఒకటో తరగతిలో ఉచిత ప్రవేశాల కోసం 3,185 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నట్టు చెప్పారు.

మొదటి దశలో 796 మందిని పాఠశాల విద్య ఉన్నతాధికారులు తగు అర్హతలు ఆధారంగా ఎంపిక చేసినట్లు పేర్కొన్నారు. ఎంపికైన విద్యార్థుల సమాచారాన్ని తల్లిదండ్రులకు ఫోన్ ద్వారా చేరవేసినట్లు తెలిపారు. ఆన్లైన్లో కూడా పొందుపర్చినట్టు చెప్పారు. ఈ నెల 10లోపు విద్యార్థులను పాఠశాలల్లో చేర్చాలని కోరారు. సంబంధిత ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు విద్యార్థుల వద్ద నుంచి అదనపు ఫీజులు వసూలు చేయడానికి వీల్లేదని స్పష్టంచేశారు. ఫీజులు వసూలు చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రతి ప్రైవేటు పాఠశాలలో విద్యాహక్కు చట్టం ప్రకారం అడ్మిషన్లు పూర్తిచేసిన విద్యార్థుల వివరాలతో రిజిస్టర్ నిర్వహించాలని సూచించారు.