పోలింగ్‌కు ముందే బీఆర్ఎస్‌కు ఊహించని షాక్.. కారు దిగనున్న పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు..?

www.mannamweb.com


లోక్‌సభ ఎన్నికల వేళ బీఆర్ఎస్ పార్టీకి బెంగ పట్టుకుందా..? పోలింగుకు ముందు పార్టీకి ఊహించని దెబ్బ తగలనుందా..? పలువురు ప్రజాప్రతినిధులు పార్టీని వీడనున్నారా..?

ఇప్పటికే వారితో సంప్రదింపులు పూర్తయ్యాయా..? ఒకటి రెండు రోజుల్లోనే కాంగ్రెస్ గూటికి చేరనున్నారా..? అంటే అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి. ప్రస్తుతం వలసలపై బీఆర్ఎస్ పార్టీలో గుసగుసలు నడుస్తున్నాయి. ఆ జాబితాలో ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు సైతం ఉన్నట్లు డిస్కస్ జరుగుతోంది. అయితే.. చివరి రోజు ప్రచారంలో పాల్గొని కాంగ్రెస్ కండువా కప్పుకోనున్న ఆ నేతలు ఎవరనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

కేసీఆర్‌కు ఝలక్ ఇచ్చే ప్లాన్

పోలింగ్ ముందు రోజు బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్‌కు ఝలక్ ఇచ్చేందుకు ఆ పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పార్టీ మారేందుకు ప్లాన్ చేస్తున్నట్టు ప్రచారం నడుస్తున్నది. రెండు మూడు రోజులుగా సదరు లీడర్లు కాంగ్రెస్‌కు చెందిన కీలక నేతలతో టచ్‌లో ఉంటూ, పార్టీలో చేర్చుకోవాలని ఒత్తిడి తెస్తున్నట్లు టాక్ ఉంది. అయితే.. చేరికల అంశాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లిన కాంగ్రెస్ లీడర్లు.. అక్కడి నుంచి క్లియరెన్స్ కోసం ఎదురుచూస్తున్నట్టుగా తెలుస్తున్నది. పోలింగ్‌కు ముందురోజు వలసలను ఎంకరేజ్ చేస్తే, రాజకీయంగా ఎలాంటి ప్రభావం ఉంటుందా అనే కోణంలో ఢిల్లీ పెద్దలు ఆరా తీస్తున్నారని ఓ సీనియర్ మంత్రి కామెంట్ చేశారు.

తమ పార్టీకి రాజకీయంగా ఉపయోగం ఉంటే చేరికలు ఉంటాయని, లేకపోతే ఎన్నికల తరువాత చేరికల పరంపర కొనసాగుతుందని వివరించారు. ఒకవేళ పోలింగ్ ముందు రోజు బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు పార్టీ మారితే ఓటింగ్‌పై ఎఫెక్ట్ పడుతుందనే చర్చ రాజకీయవర్గాల్లో ఉంది. ఇప్పటికే చాలా పార్లమెంట్ సెగ్మెంట్‌లో బీఆర్ఎస్ మూడో స్థానంలో ఉంది. ఇలాంటి సమయంలో వలసలు కొనసాగితే.. ఆ పార్టీకి మరింత నష్టం వాటిల్లే ప్రమాదం లేకపోలేదనే అభిప్రాయాలూ వ్యక్తం అవుతున్నాయి.

ఎవరా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు..?

కాంగ్రెస్ గూటికి వెళ్లే ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు ఎవరనే చర్చ మొదలైంది. ఆ జాబితాలో ఉత్తర తెలంగాణకు చెందిన ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్సీలు, గ్రేటర్ హైదరాబాద్ చెందిన ఒకరిద్దరు ఎమ్మెల్యేలు ఉన్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. కొన్ని రోజులుగా వీరు పార్టీ మారేందుకు కాంగ్రెస్ నేతలతో రహస్యంగా మంతనాలు జరుపుతున్నట్టు బీఆర్ఎస్‌కు చెందిన ఓ మాజీ మంత్రి అనుమానం వ్యక్తం చేశారు. ఎప్పుడు ఏ లీడర్ పార్టీకి గుడ్ బై చెపుతారో తెలియని ఆయోమయ పరిస్థితి నెలకొందని ఆందోళన వ్యక్తం చేశారు. వలసల కదలికలను తెలుసుకున్న బీఆర్ఎస్‌కు చెందిన కీలక లీడర్లు సదరు నేతలను బుజ్జగించేందుకు ప్రయత్నం చేస్తున్నట్టు తెలిసింది.