గన్నవరం వైసీపీ అభ్యర్థి వల్లభనేని వంశీ (Vallabhaneni Vamsi) అమెరికా వెళ్లారు. వాస్తవానికి ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి అమెరికా వెళ్లడం పెద్ద సంచలనం కలిగించే అంశమేమీ కాదు.
అయితే వంశీ ప్రస్తుతం ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో ఆయన ఏ అడుగు వేసినా అది చర్చనీయాంశంగా మారుతోంది. 2019లో టీడీపీ టికెట్‌పై గెలిచిన వంశీ ఆ తర్వాత వైసీపీ పంచన చేరారు. రాజకీయాల్లో ఇది కూడా సాధారణ విషయమే. ఆ తర్వాత ఆయన వేసిన అడుగులు ఆయన రాజకీయ ప్రస్థానాన్ని వివాదాస్పదం చేశాయి. టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన సతీమణి భువనేశ్వరి, కొడుకు లోకేశ్‌ను ఉద్దేశించి వంశీ చేసిన వ్యాఖ్యలు టీడీపీ శ్రేణుల్లోనే కాకుండా తెలుగువారందరి లోనూ వంశీపై వ్యతిరేకతను తీసుకొచ్చాయి. రాజకీయాల్లో నాయకులు ఒకరిపై ఒకరు బురద చల్లుకోవడం సహజమే కానీ ఇంట్లోని మహిళలపై అసభ్యకరంగా మాట్లాడటం అనే కొత్త విధానాన్ని వంశీ తీసుకొచ్చారు.
వంశీ ఓడిపోతే..!
ఈ పరిణామాలతో టీడీపీ అధిష్ఠానం మొదలు గ్రామస్థాయి నాయకులు వరకు వంశీ ఓటమి కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు. అందులో భాగంగా వంశీకి బలమైన ప్రత్యర్థిగా 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఎన్ఆర్ఐ యార్లగడ్డ వెంకట్రావును తీసుకొచ్చారు. ఆయన నియోజకవర్గంలో బలంగా ఉన్న టీడీపీని మరింత బలోపేతం చేశారు. దీంతో 2024 ఎన్నికల్లో వంశీ ఓటమి ఖాయమని ఆయన అనుచరులే వ్యాఖ్యానించడం మొదలుపెట్టారు. ఈ ఎన్నికల్లో వంశీ ఓడిపోతే ఆ తర్వాత ఆయన పరిస్థితి ఏమిటన్న దానిపై రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరుగుతోంది.
ఓహో.. ఇదా అసలు కథ!
ఈ నేపథ్యంలో వంశీ అమెరికా వెళ్లారన్న అంశం ప్రాధాన్యం సంతరించుకుంది. వంశీ మే 17న అమెరికా వెళ్లారని ఆయన అనుచరులు చెబుతున్నారు. కొడుకు చదువుల కోసం ఆయన అమెరికాలోని డల్లాస్ వెళ్లారని అనుచరులు చెబుతున్న మాట. అయితే టీడీపీ నాయకులు దీనికి భిన్నంగా చెబుతున్నారు. వంశీ అమెరికాలో శాశ్వతంగా స్థిరపడేందుకు సిద్ధమయ్యారని అందులో భాగంగా ఆయన అమెరికా వెళ్లారన్నది టీడీపీలో కొంతమంది నాయకుల వాదన. డల్లాస్‌లోని కొందరు ఎన్ఆర్ఐల ద్వారా టీడీపీ పెద్దలతో రాజీ కోసం ప్రయత్నాలు చేస్తున్నారని, అందుకే అమెరికా వెళ్లారని మరికొంత మంది నాయకులు చెబుతున్నారు. ఏది ఏమైనా వంశీ అమెరికా పర్యటన నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది.


































