Ap Elections: ‘కౌంటింగ్ టైంలో హింసాత్మక ఘటనలు జరగొచ్చు’

www.mannamweb.com


Intelligence Alert To Election Comission: ఏపీలో ఎన్నికల కౌంటింగ్ తేదీ దగ్గర పడుతున్న వేళ.. ఎన్నికల సంఘానికి ఇంటెలిజెన్స్ నివేదిక తాజాగా ఇచ్చింది. కౌంటింగ్ కు ముందు తర్వాత కాకినాడ సిటీ (Kakinada), పిఠాపురం (Pithapuram) నియోజకవర్గాల్లో అల్లర్లు జరిగే ఛాన్స్ ఉందని అప్రమత్తం చేసింది. ఆయా నియోజకవర్గాల్లోని ఏటిమొగ, దుమ్ములపేట, రామకృష్ణారావుపేటతో సహా పలు ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించింది. దీంతో ఎన్నికల సంఘం ఆ ప్రాంతాలపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఎన్నికల్లో గొడవలు చేసిన, ప్రేరేపించిన వ్యక్తులపై నిఘా ఉంచాలని పోలీసులకు సూచించింది. కాగా, జూన్ 4న ఎన్నికల కౌంటింగ్ జరగనుంది. ఇప్పటికే ఈవీఎంలు ఉంచిన స్ట్రాంగ్ రూంల వద్ద మూడంచెల భద్రతా వ్యవస్థ కొనసాగుతోంది. సీసీ కెమెరాలతో భద్రతా సిబ్బంది నిరంతరం స్ట్రాంగ్ రూంల వద్ద భద్రతను పర్యవేక్షిస్తున్నారు.

ఈసీ అలర్ట్

ఇంటెలిజెన్స్ నివేదికతో ఎన్నికల సంఘం అప్రమత్తమైంది. ఆ రెండు నియోజకవర్గాలపై ప్రత్యేక ఫోకస్ పెట్టిన అధికారులు.. పోలీసులకు కీలక సూచనలు ఇచ్చారు. ఆయా నియోజకవర్గాల్లో ఎవరెవరికి నేర చరిత్ర ఉందనే దానిపై ఆరా తీస్తున్నారు. కౌంటింగ్ సమయంలో ఎలాంటి అల్లర్లు జరగకుండా పటిష్ట చర్యలు చేపడుతున్నారు. ఆయా ప్రాంతాల్లో భారీగా బలగాలను మోహరిస్తున్నారు. పోలింగ్ రోజు, అనంతరం జరిగిన హింసాత్మక ఘటనల దృష్ట్యా అవి పునరావృతం కాకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని ఆయా జిల్లాల పోలీస్ ఉన్నతాధికారులకు ఇప్పటికే ఎన్నికల సంఘం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది.

సిట్ నివేదిక సిద్ధం

మరోవైపు, రాష్ట్రంలో ఈ నెల 13న పోలింగ్ రోజు, అనంతరం జరిగిన అల్లర్లపై సిట్ ప్రాథమిక నివేదికను సోమవారం డీజీపీకి విచారణ బృందం అందించనుంది. అలాగే, సీఎస్ కు కూడా నివేదిక అందించనుండగా.. ఆయన ద్వారా సీఈవో, సీఈసీకి నివేదిక చేరనుంది. డీజీపీకి నివేదిక సమర్పించిన అనంతరం సిట్ అధికారులు ప్రెస్ నోట్ విడుదల చేయనున్నారు. అయితే, పూర్తి స్థాయి నివేదికను అందించేందుకు మరిన్ని రోజులు గడువు కోరే అవకాశం ఉందని సమాచారం. గత రెండు రోజులుగా 3 జిల్లాల్లో పర్యటించిన సిట్ సభ్యులు.. నేతలు, స్థానికులు, పోలీసుల నుంచి వివరాలు సేకరించారు. ఆయా ఘటనా స్థలాలను పరిశీలించి అల్లర్లకు సంబంధించిన వీడియోలను పరిశీలించారు. అటు, ప్రాథమిక విచారణ పూర్తైన క్రమంలో.. అల్లర్లు జరిగిన ప్రాంతాల్లో కేసుల విచారణపై కూడా సిట్ సమీక్ష పూర్తి చేయనుంది. ఈ కేసుల విచారణపై ఇక ముందు కూడా పర్యవేక్షణ కొనసాగనుంది. రానున్న రోజుల్లో మరింత లోతుగా విచారణ చేయనున్నారు. మరోవైపు, పోలింగ్ అనంతరం అల్లర్లపై మరిన్ని కేసులు నమోదు చేసేందుకు సిట్ అధికారులు సిద్ధమయ్యారు. ఇప్పటికే స్థానిక పోలీసులకు దీనికి సంబంధించి పలు సూచనలు చేశారు. అల్లర్లలో ప్రమేయం ఉన్న రాజకీయ నేతల అరెస్టుపై కూడా సిట్ విచారించనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు పోలీసులకు తగు ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం.