AP Elections Results: ఫలితాలపై ఉత్కంఠ.. ఏపీలో గెలుపుపై అంచనాలు ఇవే..!

www.mannamweb.com


ఎన్నికల ఫలితాలు రావడానికి ఇంకా ఎనిమిది రోజుల సమయం ఉంది. గెలిచేదెవరు.. ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయనే ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. ఎవరి అంచనాలు వారివి. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వస్తుందని కొందరు చెబుతుంటే.. లేదు.. లేదు.. వైసీపీ వరుసగా రెండోసారి అధికారం చేపట్టబోతుందని మరికొందరు అంటున్నారు. మరోవైపు రెండు పార్టీల నేతలు.. సీఎం ప్రమాణ స్వీకారం తేదీలను ప్రకటిస్తున్నారు. జగన్ జూన్9న విశాఖలో ప్రమాణస్వీకారం చేస్తారని వైసీపీ నేతలు ప్రకటనలు ఇస్తుంటే.. అమరావతిలో చంద్రబాబు నాయుడు సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారని టీడీపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఎవరెన్ని ప్రకటనలు చేసినా సీఎంగా ప్రమాణం చేసేది ఒకరే.. ఆ ఒకరు ఎవరనే ఉత్కంఠ ఏపీ ప్రజల్లో కొనసాగుతూనే ఉంది. ఎన్నికల పోలింగ్ పూర్తై.. 14 రోజులైంది. ఇప్పటికే క్షేత్రస్థాయిలో సర్వే సంస్థలు తమ పనిని పూర్తిచేశాయి. పోలింగ్ తర్వత ఫలితాల వెల్లడికి ఎక్కువ రోజుల గ్యాప్ రావడంతో సర్వే సంస్థలు ఎక్కువమంది నుంచి అభిప్రాయాన్ని సేకరించడానికి అవకాశం దొరికింది. సంస్థలతో పాటు.. కొందరు అభ్యర్థులు సైతం సర్వే ఏజెన్సీలతో ఫలితాలపై సర్వే చేయించినట్లు తెలుస్తోంది. ఓటరు తీర్పు ఎలా ఉన్నప్పటికీ గెలుపుపై ఎవరి అంచనాలు వారు వేస్తున్నారు.

తాడిపత్రిలో అరాచకాలు..ఏఎస్పీ, సీఐలపై వేటు!

కూటమి విజయం పక్కా అంటూ..

పొత్తులో భాగంగా ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీచేశాయి. దీంతో 175 నియోజకవర్గాలున్న ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ 144 చోట్ల, జనసేన 21, బీజేపీ 10 స్థానాల్లో పోటీచేసింది. అధికారం కోసం 88 సీట్లు అవసరం. కూటమి కనీసం 110 నుంచి 120 సీట్లలో గెలుస్తుందని.. టీడీపీకి 100 నుంచి 110 సీట్లు వస్తాయని పార్టీ అంతర్గత సర్వేలో తేలిందట. ఓటింగ్ సరళి గమనించిన తర్వాత ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏపీ ప్రజలు ఓటు వేసినట్లు స్పష్టమైనట్లు తెలుస్తోంది. దీంతో విజయం మాదేనంటూ కూటమి నేతలు చెబుతున్నారు. ఎన్డీయే కూటమి అధికారంలోకి వచ్చే అవకాశాలు ఎక్కువుగా ఉన్నాయని పలువురు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మరోవైపు బీజేపీ కేంద్ర నాయకత్వం చేయించిన సర్వేలోనూ ఎన్డీయే కూటమికి మెజార్టీకి కావాల్సిన సీట్లు వస్తాయని తేలిందట.

వైసీపీ నేతల్లో ధీమా..

కూటమి వైపు ఏపీ ప్రజలు మొగ్గు చూపారని ఎక్కువ సర్వే సంస్థలు అంచనా వేస్తున్న నేపథ్యంలో.. గెలుపుపై వైసీపీ నేతలు సైతం ధీమా వ్యక్తం చేస్తున్నారు. కనీసం వంద సీట్లలో గెలుస్తామని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. 50 నుంచి 60 వరకు వైసీపీకి రావొచ్చని.. రాయలసీమలో ఎక్కువ ప్రభావం చూపించి.. ఉభయ గోదావరి జిల్లాల్లో గౌరవప్రధమైన స్థాయిలో సీట్లు గెలుచుకుంటే 60 నుంచి 70 గరిష్టంగా గెలుచుకోవచ్చని రాజకీయ పండితులు అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో ఏపీలో ఎవరి అంచనాలు కరెక్ట్.. ఫలితం ఎవరికి అనుకూలంగా ఉండబోతుందనేది జూన్4న తేలనుంది.