AP Election 2024: లెక్కింపు బాధ్యతల నుంచి ఉపాధ్యాయుల్ని తప్పించేశారు.. ఆఖరి నిమిషంలో కీలక నిర్ణయం

www.mannamweb.com


AP Election 2024: లెక్కింపు బాధ్యతల నుంచి ఉపాధ్యాయుల్ని తప్పించేశారు.. ఆఖరి నిమిషంలో కీలక నిర్ణయం

కర్నూలు: కర్నూలు జిల్లాలో మంగళవారం జరగబోయే ఓట్ల లెక్కింపు ప్రక్రియలో ఎక్కువ మంది ఉపాధ్యాయులను తప్పించడం చర్చకు దారితీస్తోంది. పీవోలుగా, ఏపీవోలుగా విధులు నిర్వర్తించిన ఉపాధ్యాయులకు ఓట్ల లెక్కింపు బాధ్యతలు ఎందుకు అప్పగించలేదనే అంశంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియలో ఏకంగా 50 శాతం వరకు తమ సేవల్ని ప్రభుత్వం ఉపయోగించుకుందని కొందరు ఉపాధ్యాయులు గుర్తు చేస్తున్నారు. తాజాగా సార్వత్రిక ఓట్ల లెక్కింపు బాధ్యతలు నిర్వహించేందుకు గానూ జిల్లా ఉన్నతాధికారులు సుమారు 300 మందికి శిక్షణ కూడా ఇచ్చినట్లు సమాచారం. రెండుసార్లు ఇచ్చిన శిక్షణకు తామంతా హాజరయ్యామని, ఆఖరి నిమిషంలో తమను ఎందుకు పక్కన పెట్టారో అర్థం కావడంలేదంటూ కొందరు ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉపాధ్యాయుల ప్రశ్నలకు ఉన్నతాధికారులు కూడా తగిన సమాధానాలు ఇవ్వలేకపోతున్నారు. దీనిపై కర్నూలు కలెక్టర్‌ జి.సృజనను ‘ఈనాడు’ సంప్రదించగా ఉపాధ్యాయులు స్థానిక సంస్థల యాజమాన్యం పరిధిలో ఉండటంతో వారి సేవలను వినియోగించుకోవడం లేదని పేర్కొన్నారు. స్థానిక సంస్థల యాజమాన్యాల పరిధిలో పనిచేసేవారు ఓట్ల లెక్కింపునకు అనర్హులైతే తమకు ఎందుకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించారని పలువురు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ యాజమాన్యంలోని విద్యాసంస్థల్లో విధులు నిర్వర్తిస్తున్న కొద్దిమంది ఉపాధ్యాయులకు మాత్రమే లెక్కింపు విధులు అప్పగించారని, జడ్పీ యాజమాన్యంలో పనిచేస్తున్న ఎస్జీటీ, స్కూల్‌అసిస్టెంట్లలో ఎవరికీ లెక్కింపు బాధ్యతలు అప్పగించలేదని వివరిస్తున్నారు.

గురువుల్లో కలకలం
ఓట్ల లెక్కింపు సిబ్బందికి గత మంగళవారం శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. దీనికి ఉపాధ్యాయులు వెళ్లకుండా వారికి తగిన సూచనలు ఇవ్వాలని కర్నూలు జిల్లా డీఈవో తన పరిధిలోని డీవైఈవోలకు, ఎంఈవోలకు వాట్సప్‌ సందేశం పంపించడంతో ఉపాధ్యాయవర్గాల్లో కలకలం రేగింది. ఆ సందేశం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యింది. లెక్కింపు విధులకు హాజరు కావాలని ఉన్నతాధికారుల నుంచి అధికారికంగా ఫోన్లు, వాట్సప్‌ సందేశాలు వచ్చిన వారు మాత్రమే దీనికి వెళ్లేలా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు.

Read more AP News