Ys Vijayamma met Jagan: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో అధికార వైసీపీ ఘోరంగా ఓటమి పాలైంది. ఓటర్లు కనీసం ప్రతిపక్షంలో కూడా కూర్చోనీయకుండా చేశారు. చివరకు వైసీపీలోని నేతలు జగన్ వ్యవహారశైలిని తప్పుబడుతున్నారు.
ఈ క్రమంలో అమెరికా నుంచి వచ్చిన విజయమ్మ హైదరాబాద్‌లో అడుగుపెట్టారు. అక్కడి నుంచి మరుసటిరోజు తాడేపల్లిలో ఉన్న కొడుకు జగన్‌బాబు దగ్గరకు వచ్చారు.
కొద్దిరోజులపాటు కొడుకు వద్దే ఉండనున్నారు విజయమ్మ. ఈ సమయంలో జగన్‌కు తన తల్లి కీలక సలహాలు ఇచ్చినట్టు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. రాజకీయాల్లో దూకుడు ఉండకూడదని, ఆలోచించి అడుగులు వేయాలని సలహా ఇచ్చారట. కాకపోతే ఇప్పుడున్న సమస్యల నుంచి గట్టెక్కేందుకు అడుగులు వేయాలని చెప్పారట. పార్టీ వ్యవహారాలను కీలకమైన వ్యక్తులకు అప్పగిస్తే కొద్దిరోజులపాటు వాళ్లే నడిపిస్తారని అన్నారట. అయినవాళ్లను అక్కున చేర్చుకుంటే మంచి ఫలితాలు వస్తాయని చెప్పారట.
గడిచిన ఎన్నికల్లో కూతురు వైఎస్ షర్మిలకు మద్దతుగా విజయమ్మ నిలిచారు. ఎన్నికల ప్రచారం ముగిసిన రోజు సాయంత్రం విజయమ్మ ఏపీ ఓటర్లకు వీడియో సందేశం ఇచ్చారు. కడప ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈసారి ఎన్నికల్లో షర్మిలను గెలిపించాలని అందులో పిలుపునిచ్చారు. తన కూతురికి కడప జిల్లా ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించాలని అందులో ప్రస్తావించారు.
ఎన్నికల ఫలితాల తర్వాత వైసీపీ అధినేత జగన్ మనసు మార్చుకుంటారా? అన్నదే అసలు టాపిక్. వైసీపీలో మరో పండుగ రానుంది. మరో నెలరోజుల్లో వైఎస్సార్ పుట్టినరోజు రాబోతోంది. అప్పుడైనా జగన్-షర్మిల కలిసి వైఎస్ ఘాట్ వద్దకు వెళ్లి నివాళులు అర్పిస్తారా? అన్నదే అసలు పాయింట్. ఇప్పటికే ఎడముఖం, పెడముఖంగా ఉన్నారు అన్నాచెల్లెలు. దీన్ని కంటిన్యూ చేస్తారా? రాజకీయాల్లో ఇలాంటి సహజమేనని భావిస్తారా? అన్నది చూడాలి.

































