Chandrababu Naidu: దటీజ్ చంద్రబాబు నాయుడు.. ఎనీ డౌట్స్?

www.mannamweb.com


Chandrababu Naidu did a Surprising Thing in the NDA Legislative Party Meeting: టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి శాసనసభాపక్ష భేటీలో చంద్రబాబను శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నారు. చంద్రబాబును సీఎం అభ్యర్ధిగా పవన్‌కల్యాణ్ ప్రతిపాదించగా.. మూడు పార్టీల ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. లాంఛనప్రాయం అయిన ఆ భేటీ సందర్భంగా అరుదైన సంఘటనలు చోటు చేసుకున్నాయి. చంద్రబాబు సంస్కారం, కూటమి నేతల మధ్య అనుబంధం, అప్యాయతలు ఫోకస్ అయి అందర్నీ ఆకట్టుకున్నాయి.

ఒకే వేదికపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, జనసేన అధినేత పవన్‌కల్యాణ్, బీజీపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి ఆశీనులయ్యారు. పక్కనేపక్కనే కూర్చుని ముచ్చటించుకున్నారు. చంద్రబాబును సీఎం అభ్యర్ధిగా ప్రకటించే క్రమంలో ఏర్పాటైన మూడు పార్టీల శాసనసభాపక్ష సమావేశంలో ఈ అరుదైన దృశ్యం ఎమ్మెల్యేలకు కనువిందు చేసింది.

శాసనసభా పక్ష భేటీలో చంద్రబాబు కోసం స్పెషల్‌గా రివాల్వింగ్ ఛైర్ వేయగా ఆయన దాన్ని మార్పించారు. వేదికపై పవన్ కళ్యాణ్, పురందీశ్వరిలకి వేసినటువంటి కుర్చీనే తనకూ వేయాలని సిబ్బందికి చెప్పడంతో వారు వెంటనే చెయిర్ మార్చారు. సదరు వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. కూటమిలో సమైక్యతను, సమానత్వాన్ని చాటిన చంద్రబాబు తన సంస్కరాన్ని మరో సారి రుజువు చేసుకున్నారని ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

కూటమి శాసన సభాపక్ష నేతగా చంద్రబాబు పేరును ప్రతిపాదించిన అనంతరం పవన్‌ మాట్లాడారు… అద్భుతమైన విజయాన్ని అందించి కూటమి అంటే ఎలా ఉండాలో రాష్ట్ర ప్రజలు కలిసికట్టుగా చూపించారని ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వం అని ఇప్పటం సభలో చెప్పాం.. అదే మాటపై నిలబడ్డామని.. ఎన్నో ఒడుదొడుకులు ఎదుర్కొన్నాం.. తగ్గాం.. ప్రజల్లో నమ్మకాన్ని పెంచి అద్భుతమైన మెజారిటీతో ప్రభుత్వాన్ని స్థాపించబోతున్నామని సగర్వంగా ప్రకటించారు.
చంద్రబాబు ఎంత నలిగిపోయారో జైల్లో చూశానని.. అప్పుడు చంద్రబాబు సతీమణి భువనేశ్వరి పడిన బాధను చూస్తూ.. మంచిరోజులు వస్తాయి. కన్నీళ్లు పెట్టొద్దని చెప్పానన్నారు. ఆ మంచి రోజులు వచ్చాయంటూ చంద్రబాబుకు మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు చెప్పారు . ఈ సందర్భంగా పవన్‌ను చంద్రబాబు ఆలింగనం చేసుకుని ధన్యవాదాలు తెలపడం అందరినీ కదిలించింది.

బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురందేశ్వరి ఈ మీటింగ్లో చంద్రబాబు పక్కనే కూర్చుని స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. చంద్రబాబు సీఎం అభ్యర్ధిగా పవన్‌ కల్యాణ్‌ చేసిన ప్రతిపాదనను ఆమె సమర్థించారు. నారా భువనేశ్వరి అక్క అయిన పురంధేశ్వరి 2004లో ప్రత్యక్షరాజకీయాల్లోకి వచ్చి కాంగ్రెస్ ఎంపీగా గెలిచారు. కాంగ్రెస్‌లో కేంద్రమంత్రిగా పనిచేసిన పురంధేశ్వరి అప్పటి నుంచి చంద్రబాబుకు పదేళ్లు రాజకీయ ప్రత్యర్ధిగా మారారు. ఆమె భర్త దగ్గుబాటి వెంకటేశ్వరరావు, కుమారుడు కొంత కాలం వైసీపీలో కూడా కొనసాగారు. ఆ క్రమంలో ఆ వదినా మరుదుల మధ్య కుటుంబాల మధ్య కూడా గ్యాప్ పెరిగినట్లు కనిపించింది. అయితే ఈ వేదికపై చంద్రబాబు ఆమెకు గౌరవంగా నమస్కరించి ముచ్చటించడం ఎమ్మెల్యేలను ఆకట్టుకుంది.

ఈ మీటింగ్లో చంద్రబాబు వైసీపీ నవ్వుతూ చురకలంటించారు. సీఎం పర్యటనల సందర్భంగా షాపులు బంద్‌ చేయడం, రోడ్లు మూసేయడం, పరదాలు కట్టుకోవడం వంటివి ఇక ఉండవని జగన్‌పై పరోక్షంగా సెటైర్లు విసిరారు. సీఎం కూడా మామూలు మనిషే. మామూలు మనిషిగానే వస్తానని.. మిత్రుడు పవన్‌తో పాటు మేమంతా సామాన్య వ్యక్తులుగానే ప్రజల దగ్గరకు వస్తామని ప్రకటించారు. హోదా సేవ కోసమే తప్ప.. స్టేట్‌ ఫస్ట్’ అనే నినాదంతో ముందుకెళ్తామని పేర్కొన్నారు.

వైసీపీ హయాంలో అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబుకు అవమానం జరిగింది. ఆయన కుటుంబంపై వైసీపీ ఎమ్మెల్యేలు ఇష్టమొచ్చినట్లు మాట్లాడారు. దాంతో చంద్రబాబు సీఎంగానే సభలో అడుగుపెడతానని శపధం చేసి బయటకొచ్చారు. ఆ ఉదంతాన్ని చంద్రబాబు గుర్తుచేశారు.. గౌరవ సభ కాదు.. కౌరవ సభ అని చెప్పి బయటకు వచ్చానని.. ప్రజాక్షేత్రంలో గెలిచి గౌరవ సభగా చేసి అడుగుపెడతానన్న తన శపథాన్ని ప్రజలు గౌరవించారని.. గౌరవించిన ప్రజలను నిలబెడతానన్నారు.

జగన్ పాలనలో ఏపీ ప్రజలు రాజధాని ఏదో చెప్పుకోలేని పరిస్థితి వచ్చారు. మూడు రాజధానుల స్లోగన్ ఎత్తుకున్న జగన్ .. ప్రజావేదిక కూల్చివేతతో తన పాలన మొదలుపెట్టారు. దాన్ని గురించి ప్రస్తావించిన చంద్రబాబు అమరావతే రాజధానని.. విస్ఫష్టంగా ప్రకటించి వందలరోజులుగా ఉద్యమబాట పట్టిన అమరావతి రైతులకు ఊరట నిచ్చారు. ఎమ్మెల్యేలంతా చప్పట్లతో ఆ నిర్ణయాన్ని స్వాగతించారు.

విజయవాడలో ఆ సమావేశానికి వచ్చిన చంద్రబాబు నాయుడుని చూసేందుకు ప్రజలు పెద్ద ఎత్తున రోడ్ల మీదకు వచ్చారు. పార్టీ కార్యకర్తలు, అభిమానులు దారి పొడవునా స్వాగతం పలికారు. ఏ కన్వెన్షన్ లో కూటమి సమావేశం అనంతరం ఉండవల్లి ప్రయాణమైన చంద్రబాబును చూసేందుకు మదనపల్లికి చెందిన ఓ మహిళ కాన్వాయ్ వెంట పరుగులు పెట్టింది.

ఆ మహిళను కారు లోంచి చూసిన చంద్రబాబు వెంటనే కాన్వాయ్ ను ఆపి.. ఆ మహిళను దగ్గరకు పిలిచి మాట్లాడారు. ఆమెను ఆప్యాయంగా పలకరించి ఆమెతో ఫోటో దిగారు. ఆమెబాగోగులు చూడాలని పార్టీ నేతలకు చంద్రబాబు నాయుడు సూచించారు. మొత్తమ్మీద ఈ సారి చంద్రబాబు మార్క్ పరిపాలన ఎలా ఉండబోతుందన్న దానిపై ఇవాల్టి మీటింగ్ సందర్భంగా చోటు చేసుకున్న పరిణామాలతో ఒకింత క్లారిటీ వచ్చిందన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది.