T20 World Cup 2024: న్యూయార్క్‌ స్టేడియం వద్ద బుల్డోజర్లు.. కూల్చివేతకు రంగం సిద్ధం!

www.mannamweb.com


న్యూయార్క్‌ మైదానం.. టీ20 ప్రపంచ కప్‌ కోసం తాత్కాలికంగా నిర్మించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అక్కడి మ్యాచులన్నీ పూర్తి కావడంతో దానిని కూల్చివేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

టీ20 ప్రపంచ కప్‌ టోర్నీకి సహ ఆతిథ్య దేశంగా యూఎస్‌ఏ ఉన్న సంగతి తెలిసిందే. ఈ మెగా సంగ్రామం కోసం న్యూయార్క్‌లో తాత్కాలికంగా స్టేడియాన్ని యూఎస్‌ఏ క్రికెట్ అసోసియేషన్‌ నేతృత్వంలో ఐసీసీ నిర్మించింది. డ్రాప్‌ ఇన్‌ పద్ధతిలో పిచ్‌లు తయారుచేయించింది. ఇదే మైదానంలో భారత్‌ మూడు మ్యాచ్‌లు ఆడింది. అందులో పాకిస్థాన్‌తో పోరు కూడా ఉంది.

తాజాగా యూఎస్‌ఏతో మ్యాచ్‌ అనంతరం ఆ వేదికను తొలగించేందుకు బుల్డోజర్లను సిద్ధం చేసి ఉంచిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అక్కడి సదుపాయాలను స్థానిక క్లబ్‌లు, అభిమానులు వినియోగించుకునేలా వాటిని జాగ్రత్తగా విడదీసి పెడతారు. కేవలం ఐదు నెలల ముందే ప్రపంచ కప్‌ కోసం ఈ మైదానాన్ని సిద్ధం చేయడం విశేషం.

ఇకపై ఫ్లోరిడాలో మ్యాచ్‌లు.. కానీ
న్యూయార్క్‌ వేదికగా మొత్తం 8 మ్యాచ్‌లు జరిగాయి. దాదాపు అన్నీ తక్కువ స్కోరింగ్‌ మ్యాచులే. ఇకపై ఫ్లోరిడా వేదికగా గ్రూప్ – A మ్యాచుల్లోని నాలుగు ఇక్కడే జరుగుతాయి. అందులో భారత్ – కెనడా మ్యాచ్‌ కూడా ఉంది. అయితే, పాకిస్థాన్‌కు తన చివరి మ్యాచ్‌ (ఐర్లాండ్‌తో జూన్ 16) అత్యంత కీలకం. అదే సమయంలో యూఎస్‌ఏకూ ముఖ్యమే.

ఆ జట్టు ఐర్లాండ్‌తో (జూన్ 14న) మ్యాచ్‌లో విజయం సాధిస్తే ‘సూపర్ – 8’కి చేరుతుంది. కానీ, ఇప్పుడు ఫ్లోరిడాను వర్షం ముంచెత్తుతోంది. దీంతో పాక్‌ అభిమానులను ఆందోళనకు గురిచేస్తోంది. యూఎస్‌ఏ-ఐర్లాండ్‌ మ్యాచ్‌ వర్షం వల్ల రద్దయినా.. పాక్‌ ఇంటిముఖం పట్టినట్లే. ఇప్పటికే అక్కడ ‘ఎమర్జెన్సీ’ని స్థానిక ప్రభుత్వం ప్రకటించింది. శ్రీలంక – నేపాల్‌ మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దు అయిన సంగతి తెలిసిందే.