Yediyurappa: బాలికపై లైంగిక వేధింపుల ఆరోపణలు.. యడియూరప్పపై అరెస్ట్‌ వారెంట్‌

www.mannamweb.com


బెంగళూరు: కర్ణాటక (Karnataka) మాజీ ముఖ్యమంత్రి, భాజపా సీనియర్‌ నేత బీఎస్‌ యడియూరప్ప (BS Yediyurappa).. ఓ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు వచ్చిన ఆరోపణలు తీవ్ర కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఆయనపై పోక్సో కేసు కూడా నమోదైంది. తాజాగా బెంగళూరు కోర్టు గురువారం ఆయనపై నాన్‌-బెయిలబుల్‌ అరెస్ట్‌ వారెంట్‌ (Arrest Warrant) జారీ చేసింది. త్వరలోనే ఆయనను అరెస్టు చేసే అవకాశాలు కన్పిస్తున్నాయి.

ఈ కేసు (POCSO case)లో అవసరమైతే యడియూరప్పను అరెస్టు చేస్తామని ఈ ఉదయం రాష్ట్ర హోం మంత్రి పరమేశ్వర వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే కేసు విచారణ నిమిత్తం సీఐడీ అధికారులు సమన్లు జారీ చేశారు. అయితే, ప్రస్తుతం ఆయన దిల్లీలో ఉన్నందున జూన్‌ 17న సీఐడీ ముందు హాజరుకానున్నట్లు తెలుస్తోంది.

17 ఏళ్ల బాలికపై యడియూరప్ప (EX CM Yediyurappa) లైంగిక దాడికి పాల్పడినట్లు లోక్‌సభ ఎన్నికలకు కొద్ది రోజుల ముందు ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. మోసం కేసులో సాయం చేయాలంటూ బాధితురాలు, ఆమె తల్లి ఫిబ్రవరి 2న యడియూరప్పను కలిశారు. ఆ సమయంలో తన కుమార్తెను భాజపా నేత బలవంతంగా గదిలోకి లాక్కెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డారంటూ బాధితురాలి తల్లి ఫిర్యాదు చేశారు. దీంతో ఆయనపై పోక్సో కేసు నమోదైంది.

ఈ కేసుపై సీఐడీ దర్యాప్తు చేపట్టింది. ఆరోపణలు చేసిన బాధితురాలి తల్లి ఇటీవల ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో ప్రాణాలు కోల్పోయారు. అయితే, అంతకంటే ముందే బాధితురాలు, ఆమె తల్లి వాంగ్మూలాలను సీఐడీ రికార్డ్‌ చేసినట్లు అధికారులు తెలిపారు. కేసు నమోదు చేసిన తర్వాత యడియూరప్ప వాయిస్‌ శాంపిళ్లను కూడా అధికారులు సేకరించారు. కాగా.. ఈ ఆరోపణలను మాజీ సీఎం ఖండించారు. తనపై కేసు కొట్టేయాలని కోర్టును ఆశ్రయించారు.