బ్యాంకుల నుంచి రుణాలు తీసుకోవడం నేడు సర్వసాధారణం. చదువు, వ్యాపారం, స్థిరాస్థి కొనుగోలు, వ్యక్తిగత ఖర్చులు తదితర వాటి కోసం బ్యాంకులను ఆశ్రయిస్తాం. మన అవసరాలకు అనుగుణంగా బ్యాంకులు వివిధ రకాల రుణాలను మంజూరు చేస్తాయి. వాటిపై వడ్డీరేట్లు కూడా మారుతూ ఉంటాయి. ప్రతి నెలా ఈఎంఐల రూపంలో వాయిదాలు చెల్లించి, నిర్ణీత కాలానికి రుణాన్ని తీర్చవచ్చు.
సొంతింటికి ప్రాధాన్యం..
ఇళ్లు, లేదా స్థలాల కొనుగోలు కోసం బ్యాంకుల నుంచి రుణాలను తీసుకుంటూ ఉంటారు. చాలామందికి తమ సొంత ఊరిలో ఇల్లు, స్థలాలు, పొలాలు ఉంటాయి. కానీ వారు ఉద్యోగం, వ్యాపారం, పిల్లల చదువుల రీత్యా పట్టణాలకు వలస వెళుతుంటారు. అలా వెళ్లిన వారిలో పట్టణాలలో స్థిరపడాలనుకునే వారి మొదటి ప్రాధాన్యం సొంతిల్లు సమకూర్చుకోవడమే. అలాగే ఉద్యోగాల కోెసం నగరాలకు వెళ్లిన యువతీ యువకులు కూడా సొంతింటిని సమకూర్చుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.
సులభ వాయిదాలు..
ఇటీవల రియల్ ఎస్టేట్ రంగం బాగా విస్తరించింది. పట్టణాల జనాభా పెరుగుతున్న కారణంగా ఇళ్లు, స్థలాలకు డిమాండ్ పెరిగింది. ఈ నేపథ్యంలో రియల్ ఎస్టేట్ సంస్థలు అపార్టుమెంట్లు, ఇంటివిడ్యువల్ హౌస్ లు నిర్మిస్తున్నాయి. నిర్ణీత ఆదాయం ఉన్న ఉద్యోగులు బ్యాంకుల నుంచి రుణాలను తీసుకుని, ఆ ఫ్లాట్లను సొంతం చేసుకోవచ్చు. బ్యాంకులకు ప్రతినెలా ఈఎంఐ కడితే సరిపోతుంది.
రుణాలలో రకాలు..
ఇల్లు లేదా ఫ్లాట్లకు బ్యాంకులు ఇచ్చే రుణాలు రెండు రకాలుగా ఉంటాయి. వాటిని స్థిర వడ్డీరేటు రుణాలు, ఫ్లోటింగ్ వడ్డీ రేటు రుణాలు అంటారు. బ్యాంకు నుంచి తీసుకున్న రుణాలకు వాయిదాలను దాదాపు 15 నుంచి 20 ఏళ్ల వరకూ చెల్లించాల్సి ఉంటుంది. స్థిర వడ్డీరేటు రుణాలకు సంబంధించి ప్రతినెలా చెల్లించే వాయిదాను రుణం తీసుకున్నప్పుడే లెక్కిస్తారు. ఈ మొత్తాన్ని రుణం తీరేవరకూ అంటే దాదాపు 20 ఏళ్లు చెల్లించాలి. రుణం తీరేవరకూ దానిలో ఎలాంటి మార్పు ఉండదు. ఫ్లోటింగ్ రుణాలకు సంబంధించీ ఈఎంఐలు మారుతూ ఉంటాయి. రుణం తీసుకున్నప్పుడు నిర్ధారించిన నెలవారీ వాయిదా సొమ్ము ఆ తర్వాత పెరగొచ్చు లేదా తగ్గవచ్చు. ఇలా ఎందుకు జరుగుతుందో తెలుసుకుందాం.
రెపోరేటు..
దేశంలో నగదు చలామణీని అదుపులో ఉంచడానికి రిజర్వ్ బ్యాంకు చర్యలు తీసుకుంటుంది. సాధారణంగా ఆర్బీఐ నుంచి వాణిజ్య బ్యాంకులు రుణాలు తీసుకుంటాయి. వాటినే మనకు రుణాలు అందజేస్తాయి. వాణిజ్య బ్యాంకుల నుంచి ఆర్బీఐ వసూలు చేసే వడ్డీ రేటును రెపోరేటు అంటారు. ఇది తక్కువగా ఉంటే వరకూ వడ్డీరేటుకు రుణాలు లభిస్తాయి. ఈఎంఐ కూడా తక్కువగా ఉంటాయి. రెపోరేటు ఎక్కువగా ఉంటే వాయిదాలు సొమ్ము కూడా పెరుగుతుంది. ప్రస్తుతం ఆర్బీఐ రెపోరేటు 6.50 శాతం ఉంది. ద్రవ్య పరపతి విధాన సమీక్ష జరిగినప్పుడల్లా రెపోరేటు పెరగడమో, తగ్గడమో, ముందున్నరేటు కొనసాగించడమో చేస్తారు.
వాయిదాలపై ప్రభావం..
స్థిర వడ్డీ రుణాల వాయిదాలపై రెపోరేటు ప్రభావం ఉండదు. అది తగ్గినా, పెరిగినా ఈఎంఐలు పెరగవు. కానీ ఫ్లోటింగ్ రుణ వాయిదాలపై ప్రభావం ఉంటుంది. రెపోరేటు ఎప్పుడు పెరిగితే అప్పుడు రుణ వాయిదాల మొత్తం కూడా పెరుగుతుంది. అంటే నెలవారీ చెల్లించే వాయిదా సొమ్ము ఎక్కువవుతుంది.
ఆర్థిక ప్రణాళిక..
స్థిర వడ్డీ రుణాలతో ఆర్థిక ప్రణాళిక సక్రమంగా ఉంటుంది. వాయిదా కోసం కొంత మొత్తాన్ని పక్కన పెట్టి, మిగిలిన ఆదాయంతో మన అవసరాలను తీర్చుకోవచ్చు. వాయిదా సొమ్ము స్థిరంగా ఉంటుంది కాబట్టి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఫ్లోటింగ్ రుణాలకు సంబంధించి ఈ విధమైన ప్రణాళిక వేసుకోలేం. అయితే ఒక్కోసారి ఆర్బీఐ రెపోరేటును తగ్గిస్తుంది. అప్పుడు ఫ్లోటింగ్ రుణాలు తీసుకున్న వారికి ఈఎంఐ మొత్తం తగ్గుతుంది. కానీ స్థిరవడ్డీ రుణాలు తీసుకున్న వారికి ఆ అవకాశం ఉండదు. అలాగే స్థిర వడ్డీ రుణాలను తీసుకున్న వారు రుణాన్ని ముందుగా తీర్చాలనుకుంటే ముందస్తు చెల్లింపులు, ఫోర్ క్లోజింగ్ చార్జీలు చెల్లించాలి.