జగన్ ప్రభుత్వ అసంబద్ధ విధానాల వల్ల రాష్ట్రంలో పాఠశాల విద్య గందరగోళంగా మారింది. హేతుబద్ధీకరణ కారణంగా ప్రాథమిక విద్యలో విద్యార్థుల సంఖ్య తగ్గిపోయి.. కొన్నిచోట్ల బడులు మూతపడుతున్నాయి.
ఐదేళ్ల వైకాపా పాలనలో అంతా అస్తవ్యస్తం
సిలబస్ అమలుపై అస్పష్టత
హేతుబద్ధీకరణ, బడుల విలీనాలతో గందరగోళం
ఏటేటా తగ్గిపోతున్న విద్యార్థుల ప్రవేశాలు
పదిలోపే బడి మానేస్తున్న 16.29% మంది పిల్లలు
ప్రభుత్వ బడులను గాడిన పెట్టడం కొత్త ప్రభుత్వ తక్షణ కర్తవ్యం
జగన్ ప్రభుత్వ అసంబద్ధ విధానాల వల్ల రాష్ట్రంలో పాఠశాల విద్య గందరగోళంగా మారింది. హేతుబద్ధీకరణ కారణంగా ప్రాథమిక విద్యలో విద్యార్థుల సంఖ్య తగ్గిపోయి.. కొన్నిచోట్ల బడులు మూతపడుతున్నాయి. విద్యార్థులు చదువులోనూ వెనకబడుతున్నారు. 6, 7, 8 తరగతులు చదువుతున్న వారిలో 41.58 శాతం మంది తెలుగులో ఒక పేరానూ చదవలేకపోయినట్లు గత ప్రభుత్వం నిర్వహించిన బేస్‌లైన్ సర్వేలో బహిర్గతమైంది. అసర్ నివేదిక-2022 ప్రకారం మూడో తరగతిలో 24.3% మంది క్యాట్, రెడ్, సన్, న్యూ, ఫ్యాన్ వంటి తేలికైన ఆంగ్ల పదాలూ చదవలేకపోయారు. విద్యార్థులు చదువులో వెనకబడినట్లు సర్వేలు చెబుతున్నా పరీక్షల్లో మాత్రం భారీగా మార్కులు సాధిస్తున్నారు. మార్కులకు పిల్లల సామర్థ్యాలకు సంబంధం లేకుండా పోయింది. బోధనలో సమస్యలు, సిలబస్‌పై అస్పష్టత, హేతుబద్ధీకరణతో ఉపాధ్యాయులు, విద్యార్థుల అవస్థలు ప్రభుత్వ విద్యావ్యవస్థను చిక్కుల్లో పడేశాయి. ఈ పరిస్థితుల్లో పాఠశాల విద్యా వ్యవస్థలో ప్రతి అంశమూ కొత్త ప్రభుత్వానికి సవాలుగా కన్పిస్తోంది.
ఆంగ్లంలో విద్యార్థుల సన్నద్ధతే ముఖ్యం
2020-21లో ఉపాధ్యాయుల సన్నద్ధత, విద్యార్థుల సామర్థ్యాలను పట్టించుకోకుండా ఒకేసారి 1-6 తరగతులకు ఆంగ్ల మాధ్యమాన్ని అమలు చేశారు. అప్పటి వరకు తెలుగు మాధ్యమంలో చదివిన విద్యార్థులు ఆంగ్ల మాధ్యమంలోకి మారాల్సి వచ్చింది. ఏటా ఒక్కో తరగతికి అమలు చేస్తూ ప్రస్తుతం పదో తరగతికి వచ్చింది. ప్రస్తుతం బడుల్లో పాఠాలు చెబుతున్న ఉపాధ్యాయుల్లో ఎక్కువ మంది తెలుగు మాధ్యమంలో చదివి, ఉద్యోగాల్లోకి వచ్చినవారే. వీరు కొన్నేళ్లపాటు తెలుగులోనే పాఠాలు చెప్పారు. వీరికి ముందుగా శిక్షణ ఇచ్చి, వారి సామర్థ్యాలను పెంచిన తర్వాత ఆంగ్ల మాధ్యమాన్ని అమలు చేస్తే బోధన బాగుండేది. కానీ, ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టిన తర్వాత ఉపాధ్యాయులకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించారు. అవి పెద్దగా ప్రయోజనం ఇవ్వలేదు. ప్రస్తుత పదో తరగతి విద్యార్థులు వచ్చే ఏడాది మార్చిలో పబ్లిక్ పరీక్షలు రాయనున్నారు. ఆంగ్ల మాధ్యమం అమలును ఎవరూ తప్పుపట్టడం లేదు. అమలు విధానం సమర్థంగా ఉండాలని విద్యావేత్తలు సూచిస్తున్నారు. విద్యార్థులకు సరైన బోధన అందకపోతే ఏ భాషా సక్రమంగా రాకుండా పిల్లల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ద్విభాషా పాఠ్యపుస్తకాలు ఇచ్చినా 8, 9, 10 తరగతుల్లో సైన్స్, సోషల్ లాంటి థియరీ సబ్జెక్టులు పరీక్షల్లో ఆంగ్లంలో రాయడంపై విద్యార్థులను సన్నద్ధం చేయాల్సిన అవసరం ఉంది.
పాఠశాల విద్యలో సిలబస్‌పై వైకాపా ప్రభుత్వం అనేక ప్రయోగాలు చేసి.. ఉపాధ్యాయులు, విద్యార్థుల్లో గందరగోళం సృష్టించింది. 2021-22 వరకు రాష్ట్ర సిలబస్‌ను అమలు చేసిన గత ప్రభుత్వం 2022-23లో ఒక్కసారిగా 8వ తరగతి వరకు సీబీఎస్‌ఈలోకి మార్చింది. ఇప్పుడు ఈ విద్యార్థులు పదో తరగతిలోకి వచ్చారు. రాష్ట్రమంతా రాష్ట్ర బోర్డు పరిధిలోని అన్ని బడుల్లోనూ సీబీఎస్‌ఈ సిలబస్‌నే అమలు చేస్తుండగా.. 2025-26 నుంచి ఇంటర్నేషనల్ బకలారియట్ (ఐబీ) సిలబస్‌ను అమలు చేసేందుకు గత ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. దీని అధ్యయనం కోసం ఆ సంస్థకు రూ.4.86 కోట్లు చెల్లించింది. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది ఇదే సిలబస్ ఉంటుందో లేదోనన్న సందిగ్ధత నెలకొంది.
రాష్ట్రంలో 1000 ప్రభుత్వ పాఠశాలలకు సీబీఎస్‌ఈ అనుమతి ఉంది. వీటికి ఈ బోర్డు పదో తరగతి పరీక్షలు నిర్వహిస్తుంది. కానీ, రాష్ట్ర బోర్డు పరిధిలోనూ సీబీఎస్‌ఈ సిలబస్ అమలు చేస్తూ.. సొంతంగా పరీక్షలు నిర్వహిస్తుంది. సీబీఎస్‌ఈలో పదో తరగతిలో 20% అంతర్గత మార్కులు ఉంటాయి. ఐదు సబ్జెక్టుల విధానం అమలవుతోంది. రాష్ట్ర బోర్డులో సీబీఎస్‌ఈ సిలబస్ చదివినా ఆరు సబ్జెక్టుల విధానం అమలు చేస్తున్నారు. పైగా 100 మార్కులకు పరీక్షలు రాయాల్సి వస్తోంది. ఇది రాష్ట్ర బోర్డు విద్యార్థులకు నష్టం కలిగించనుంది.
టోఫెల్‌కు పటిష్ఠ చర్యలేవి?
ప్రభుత్వ పాఠశాలల్లో టోఫెల్ అమలు చేస్తున్నారు. 2024-25లో ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్స్, స్మార్ట్ టీవీలు ఉన్నచోటే 3-9 తరగతులకు అమలు చేశారు. ఇవి లేని బడుల్లో విద్యార్థులకు టోఫెల్ బోధన అందలేదు. కంటెంట్ అందించడంలోనూ జాప్యం చేశారు. దీంతో గతేడాది టోఫెల్ మొక్కుబడిగా మారింది.
టోఫెల్‌ను ఆంగ్ల ఉపాధ్యాయులతో బోధించాలి. ఉపాధ్యాయుల కొరత నేపథ్యంలో ఇతర సబ్జెక్టుల ఉపాధ్యాయులతోనూ టోఫెల్ బోధన చేయించారు. కొన్నిచోట్ల తెలుగు భాష ఉపాధ్యాయులతోనూ చెప్పించడంతో ఇది మొక్కుబడి తంతుగా మారింది. విద్యార్థులకు ఆంగ్ల భాష కమ్యూనికేషన్ నైపుణ్యాలు అవసరమే. అయితే వాటిని అందించేందుకు సరైన విధానాలు అమలు చేయాలి. ఆంగ్లం రాయడంతోపాటు మాట్లాడే నైపుణ్యాలు పిల్లలకు అందించాలి. టోఫెల్ కోసమే ఏడాదికి రూ.145 కోట్లకు పైగా ప్రభుత్వం వెచ్చిస్తోంది.
బైజూస్ కంటెంట్‌తో 8,9 తరగతుల విద్యార్థులకు ట్యాబ్‌లు ఇచ్చారు. ఆన్‌లైన్ పాఠాలు వింటున్న విద్యార్థులకు సందేహాలు వస్తే వాటిని నివృత్తి చేసే విధానం లేదు. విద్యార్థులు పాఠశాలకు వచ్చినప్పటి నుంచి తరగతుల్లో పాఠాలు వినడానికే సమయం సరిపోతుంది. రెగ్యులర్ సబ్జెక్టులతోపాటు అదనంగా టోఫెల్ తరగతులు పెట్టారు. బైజూస్ కంటెంట్ ఉన్నా పిల్లలు పూర్తిస్థాయిలో వాడుకోలేకపోతున్నారు. ట్యాబ్‌లు పాడైనా.. స్క్రీన్‌లు పగిలిపోయినా సకాలంలో మరమ్మతులు చేయడం లేదు. ఇతర యూట్యూబ్ వీడియోలు, గేమ్స్ రాకుండా లాక్ చేయడంపైనా అధికారులు దృష్టి సారించాలి.
తగ్గుతున్న ప్రవేశాలు
ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలు తగ్గుతున్నాయి. ఏటేటా విద్యార్థుల సంఖ్య పడిపోతోంది. 2018-19లో 39.29 లక్షల మంది విద్యార్థులు ఉండగా.. ఇప్పుడు ఈ సంఖ్య 36.54 లక్షలకు పడిపోయింది. కరోనా సమయంలో విద్యార్థుల సంఖ్య పెరిగినా ఆ తర్వాత పిల్లలు ప్రైవేటుకు వెళ్లిపోయారు. ఒకటో తరగతిలో చేరుతున్న పిల్లల సంఖ్యా తక్కువగానే ఉంటోంది. ఏటా పదో తరగతి పూర్తి చేసి 3 లక్షల మంది వెళ్లిపోతుండగా.. ఈ స్థాయిలో కొత్త ప్రవేశాలు ఉండటం లేదు. 46 పాఠశాలల్లో గతేడాది ఒక్కరూ చేరలేదు.
రాష్ట్రంలో 2021-22లో పదో తరగతిలోపు 16.29% మంది పిల్లలు బడి మానేసినట్లు సమగ్ర శిక్షా అభియాన్ ప్రాజెక్టు అనుమతుల బోర్డు(పీఏబీ) మినిట్స్‌లో ఇటీవల వెల్లడించింది. డ్రాప్‌ఔట్స్ ప్రాథమికోన్నత స్థాయిలో 1.62 శాతంగా ఉంది. ఏకోపాధ్యాయ పాఠశాలలు రాష్ట్రంలో భారీగా ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 44వేల పాఠశాలలు ఉంటే వీటిల్లో 11వేల బడులు ఒక్క టీచర్‌తోనే కొనసాగుతున్నాయి. ఇక్కడ 1-5 తరగతులు, 1, 2 తరగతులకు ఒక్కరే బోధన చేస్తున్నారు.
హేతుబద్ధీకరణ.. విలీనాలు..
వైకాపా ప్రభుత్వం ఉపాధ్యాయ పోస్టుల హేతుబద్ధీకరణ, తరగతుల విలీనాలతో మొత్తం గందరగోళం చేసింది. 3, 4, 5 తరగతుల విద్యార్థులకు సబ్జెక్టు టీచర్ల బోధనంటూ వీటిని కిలోమీటరు దూరంలోని ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో విలీనం చేశారు. ఇలాంటి చోట్ల ప్రాథమిక పాఠశాలల్లో 1, 2 తరగతులే మిగిలాయి. విద్యార్థుల సంఖ్య తగ్గిపోవడంతో కొన్ని ఏకోపాధ్యాయ బడులుగా మారగా.. మరికొన్ని పిల్లలు లేక మూతపడ్డాయి.
3-10 తరగతులు ఉండే ఉన్నత పాఠశాలలో 137 మంది, 6-10 తరగతులున్న బడిలో 92 మందిలోపు పిల్లలు ఉంటే ప్రధానోపాధ్యాయ, వ్యాయామ ఉపాధ్యాయ పోస్టులను తొలగించింది. 1-5 తరగతులు ఉండే బడిలో 30 మంది విద్యార్థుల వరకు ఒక్కరే టీచర్‌ను ఇచ్చారు. ఇలా పోస్టుల హేతుబద్ధీకరణను చేస్తూ ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలని ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.