Income Tax Benefits Of Personal Loan: ఆర్థిక అత్యవసర సమయాల్లో ఆదుకునే కల్పవృక్షం.. ‘వ్యక్తిగత రుణం’. పర్సనల్ లోన్ పొందడం చాలా ఈజీ. మీకు “ప్రి-అప్రూవ్డ్ పర్సనల్ లోన్” ఆఫర్ ఉంటే, ఆ రుణం పొందడానికి కేవలం రెండు నిమిషాల సమయం చాలు.
బ్యాంక్‌కు కూడా వెళ్లక్కర్లేకుండా కూర్చున్న చోటు నుంచే ఈ లోన్ తరహా రుణం తీసుకోవచ్చు.
ప్రి-అప్రూవ్డ్ పర్సనల్ లోన్ ఆఫర్ లేకపోతే, లోన్ కోసం ఆన్లైన్/బ్యాంక్ బ్రాంచ్‌కు వెళ్లి అప్లై చేయాలి. ఒకవేళ మీరు జీతం తీసుకునే వ్యక్తి (Salaried Person) అయితే, ఈ విధానంలోనూ పెద్ద తతంగం లేకుండానే పని పూర్తవుతుంది. గంటల వ్యవధిలోనే మీ అకౌంట్లోకి డబ్బు వచ్చి పడుతుంది. మీకు జీతం లేకపోయినా, రెగ్యులర్ ఇన్కమ్ వస్తుంటే చాలు. ఈ కేస్‌లో కూడా మీకు లోన్‌కు అర్హత ఉన్నట్లే.
జీతం ఉన్నా/లేకపోయినా, పర్సనల్ లోన్ ఇచ్చే ముందు దరఖాస్తుదారుడి క్రెడిట్ స్కోర్‌ను (Credit Score) బ్యాంక్‌లు చూస్తాయి. మంచి నంబర్ ఉన్న వ్యక్తికి సులభంగా, తక్కువ వడ్డీ రేటుకు వ్యక్తిగత రుణం దొరుకుతుంది.
చాలామందికి తెలీని విషయం ఏంటంటే, ఆదాయ పన్ను చట్టంలోని (Income Tax Act) సెక్షన్ 24(B) ప్రకారం, పర్సనల్ లోన్‌పై చెల్లించే వడ్డీపై పన్ను మినహాయింపు ప్రయోజనం పొందొచ్చు. అయితే.. మీరు ఆ లోన్‌ను ఎలా ఉపయోగించారు అన్నదానిపై ఆధారపడి టాక్స్ బెనిఫిట్స్ వర్తిస్తాయి. లోన్ తీసుకుని విహార యాత్రకు వెళ్లడం, ఇంట్లో వస్తువులు కొనడం, వ్యక్తిగత అవసరాల కోసం ఖర్చు చేయడం వంటి పనులు చేస్తే పన్ను ప్రయోజనాలను క్లెయిమ్ చేయలేరు.
ఎలాంటి సందర్భాల్లో పర్సనల్ లోన్‌పై పన్ను ప్రయోజనాలు పొందొచ్చు?
— పర్సనల్ లోన్‌ను మీ ఇంటి రిపేర్ల కోసం ఉపయోగిస్తే, లోన్‌పై చెల్లించిన వడ్డీపై ఏడాదికి రూ. 30,000 వరకు తగ్గింపును క్లెయిమ్ చేయవచ్చు. అంటే.. ITR ఫైలింగ్ సమయంలో, పర్సనల్ లోన్‌పై చెల్లించిన వడ్డీని మీ మొత్తం ఆదాయం నుంచి తగ్గించి చూపొచ్చు. తద్వారా మీపై పన్ను భారం తగ్గుతుంది.
— విదేశాల్లో ఉన్నత చదువుల కోసం లోన్ డబ్బును ఉపయోగిస్తే, ఒక ఆర్థిక సంవత్సరంలో చెల్లించిన మొత్తం వడ్డీపై మినహాయింపులను క్లెయిమ్ చేయవచ్చు. ఈ కేస్‌లో, చెల్లించిన వడ్డీని క్లెయిమ్ చేయడంలో ఎలాంటి గరిష్ట పరిమితి లేదు.
— ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 36(1) (iii) ప్రకారం, వ్యాపార ప్రయోజనాల కోసం వ్యక్తిగత రుణాన్ని ఉపయోగిస్తే, చెల్లించిన పూర్తి వడ్డీని క్లెయిమ్ చేయవచ్చు. వ్యాపారం కోసం పరికరాలు కొనడం, వస్తువులను నిల్వ చేయడానికి రుణాన్ని ఉపయోగించడం వంటివి ఈ కోవలోకి వస్తాయి. ఈ కేస్‌లో కూడా చెల్లించిన వడ్డీపై మినహాయింపు పొందడంలో ఎలాంటి గరిష్ట పరిమితి లేదు. తద్వారా, మీ వ్యాపార ఆదాయం నుంచి వడ్డీ మొత్తాన్ని తగ్గించి ITRలో చూపొచ్చు.
— ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 24(బి) ప్రకారం, ఒక ఆస్తిని పునరుద్ధరించడానికి (Renovation of property) లేదా కొనుగోలు చేయడానికి (Purchase a property) పర్సనల్ లోన్ మొత్తాన్ని ఉపయోగిస్తే, వడ్డీ చెల్లింపుపై మినహాయింపును క్లెయిమ్ చేయవచ్చు. ఉదాహరణకు, మీ ఇంటి ఆవరణలో కొత్తగా ఒక గది లేదా గ్యారేజ్ నిర్మించాలనుకుంటే వడ్డీ చెల్లింపులపై మినహాయింపు పొందొచ్చు. ఈ సెక్షన్ కింద సంవత్సరానికి రూ.2 లక్షల వరకు క్లెయిమ్ చేయవచ్చు.
–మీరు అద్దె ఇంట్లో ఉంటూ, ఆ ఇంటిని పునరుద్ధరించడానికి పర్సనల్ లోన్‌ను ఉపయోగించినా కూడా, సెక్షన్ 24(బి) ప్రకారం ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.2 లక్షల వరకు వడ్డీ మొత్తాన్ని క్లెయిమ్ చేసుకోవచ్చు.