వైసీపీ అధినేత జగన్ రెడ్డి దేశం మొత్తం తన వైపు తిరిగి చూసేలా నిర్ణయం తీసుకోబోతున్నట్లుగా తెలుస్తోంది. గెలిచిన ఎమ్మెల్యేలతో సహ సహా తమపార్టీ తరపున ఎవరూ అసెంబ్లీకి వెళ్లకూడదని.
.. అసెంబ్లీ బహిష్కరణ నిర్ణయం తీసుకోవాలని ఆయన యోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. ప్రతిపక్ష నేత హోదా ఇవ్వరని.. అవమానించడమే లక్ష్యంగా పెట్టుకుంటారని… ప్రజాస్వామ్య యుతంగా అసెంబ్లీ జరుగుతుందన్న నమ్మకం లేదన్న కారణాన్ని ఆయన చెప్పే అవకాశం ఉంది.
ఏపీ అసెంబ్లీ సమావేశాలు 24వ తేదీ నుంచి జరగనున్నాయి. 22వ తేదీన పార్టీ విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. మామూలుగా అయితే విస్తృత స్థాయి సమావేశం అవసరం లేదు. గెలిచిన ఎమ్మెల్యేలతో ఎల్పీ భేటీ నిర్వహించి నాయకుడ్ని ఎన్నుకుంటారు. ఇప్పటి వరకూ అలాంటి ఆలోచన చేయలేదు. నేరుగా విస్తృత స్థాయి సమావేశానికి పిలుపునిచ్చారు. అంటే ఖచ్చితంగా అసెంబ్లీ బహిష్కరణ నిర్ణయం తీసుకుంటారని అంటున్నారు.
గతంలో కూడాజగన్ ఓ సారి అసెంబ్లీ బ హిష్కరణ నిర్ణయం తీసుకున్నారు. అసలు కారణం తాను పాదయాత్రలో ఉంటే ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్లకూడదన్న ఉద్దేశం. ప్రచారం చేసుకుంది మాత్రం… ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హతా వేటు వేయకపోవడానికి నిరసన. అప్పుడు కూడా ఇలా విస్తృత స్థాయి సమావేశాన్ని లోటస్ పాండ్లో నిర్వహించి నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు కూడా అదే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది.
అయితే శాసనమండలిలో బలం ఉన్నందున.. మండలికి మాత్రం ఎమ్మెల్సీలు హాజరవుతారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.