అమరావతి: మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) నిర్వహిస్తున్న ప్రజా దర్బార్‌కు విశేష స్పందన లభిస్తోంది. ఉండవల్లిలోని నివాసంలో బుధవారం నిర్వహించిన ఈ కార్యక్రమానికి మంగళగిరి నియోజకవర్గంతో పాటు ఇతర ప్రాంతాల నుంచి ప్రజలు తరలివచ్చి సమస్యలను విన్నవించుకున్నారు.
లోకేశ్ ఓపికగా వారి వినతులు స్వీకరించారు. మంత్రిని కలిశాక తమ సమస్యను వెంటనే పరిష్కరించారని విశాఖ నగరానికి చెందిన మహిళ తెలిపారు.
విశాఖకు చెందిన అభ్యుదయ గ్రామీణ డ్వాక్రా రాష్ట్ర కమిటీ అధ్యక్షురాలు దేవకీదేవి ఎగ్జిబిషన్ గడువు రెన్యూవల్ కోసం గత కొన్ని రోజులుగా ఉన్నతాధికారుల చుట్టూ తిరిగారు. తాము తయారు చేసుకున్న చేతివృత్తుల ఉత్పత్తుల అమ్మకం కోసం అధికారులను గడువు కోరినా ఫలితం దక్కలేదని ఆవేదన వ్యక్తంచేశారు. బుధవారం మంత్రి లోకేశ్‌ను కలిశాక గంటలో సమస్య తీరిపోయిందంటూ దేవకీదేవి భావోద్వేగానికి గురై కన్నీటిపర్యంతమయ్యారు. పారా మెడికల్, ఆర్ఎంపీ, కేజీబీవీ సంఘాల సమస్యలను విని వాటి పరిష్కారానికి లోకేశ్ హామీ ఇచ్చారు. మిగతా జిల్లాల్లోని నేతలు ప్రజాదర్బార్ నిర్వహిస్తే దూర ప్రాంతాల నుంచి అమరావతికి వచ్చే సమస్య ఉండదని ప్రజలు అభిప్రాయపడ్డారు.