కొత్త సలహాదారుల నియామకం – ఏబీతో సహా లిస్టులో..!!

www.mannamweb.com


ఏపీలో కొత్త ప్రభుత్వ పాలన మొదలైంది. మంత్రులు బాధ్యతలు స్వీకరించారు. రేపు(శుక్రవారం) కొత్త అసెంబ్లీ కొలువు తీరనుంది. అధికార ప్రక్షాళన మొదలైంది.

నూతన డీజీపీగా ద్వారకా తిరుమల రావు నియమితులయ్యారు. పలువురు ఐఏఎస్ లను బదిలీ చేసారు. ఇక..ప్రభుత్వంలో సలహాదారుల నియామకం పైన కసరత్తు కొనసాగుతోంది. సీనియర్ ఐపీఎస్ ఏబీ వేంకటేశ్వరరావుతో సహా పలువురు సలహాదారుల జాబితాలో ఉన్నారు.

చంద్రబాబు కసరత్తు

ఏపీ ప్రభుత్వం కొత్త సలహాదారుల నియామకంపై కసరత్తు మొదలు పెట్టింది. పాలనా అనుభవంతో పాటుగా నమ్మకస్తులుగా ఉన్న రిటైర్డ్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల వైపు ప్రభుత్వం ముగ్గు చూపుతుంది. పాలనాపరంగా కీలక నిర్ణయాలు తీసుకుంటున్న చంద్రబాబు సలహాదారుల నియామకం పైన పలువురు పేర్లు పరిశీలిస్తున్నట్లు సమాచారం. గతంలో ఆర్థిక -ప్రణాళిక విభాగంలో పనిచేసిన సీనియర్ అధికారి టక్కర్, అవినీతి నిరోధక శాఖలో పట్టున్న ఆర్పీ ఠాకూర్, చంద్రబాబు హయాంలో నిఘా చీఫ్ గా పనిచేసిన ఏబీ వెంకటేశ్వర రావులను సలహాదారులుగా నియమించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

సలహాదారులుగా

ఏపీ వెంకటేశ్వరరావు క్యాట్ ఆదేశించినా.. గత ప్రభుత్వం పోస్టింగ్ ఇవ్వకుండా నిలిపివేసింది. చివరి రోజున పోస్టింగ్ ఇవ్వగా ఆయన అదే రోజున పదవీ విరమణ చేసారు. అదేవిధంగా వైసీపీ పాలనలో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్న అధికారులకు ప్రస్తుత ప్రభుత్వంలో కీలక బాధ్యతలు అప్పజెప్పే అవకాశం కనిపిస్తోంది. గతంలో ఇన్వెస్ట్మెంట్ బోర్డ్ చైర్మన్ గా పదవీ విరమణ చేసిన జాస్తి కృష్ణ కిషోర్ ను కూడా ప్రభుత్వ సలహాదారుడిగా నియమించుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

అవకాశం దక్కేదెవరికి

ప్రభుత్వ ఏజే శ్రీరామ్ స్థానంలో దమ్మాలపాటి శ్రీనివాస్ ను ప్రభుత్వం నియమించింది. తాజాగా..జలవనరుల శాఖ సలహాదారుడగా వెంకటేశ్వరరావును ప్రభుత్వం ఖరారు చేసింది. అదనపు అడ్వకేట్ జనరల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్లు పేర్లను కూడా ప్రభుత్వం పరిశీలిస్తుంది. నామినేటెడ్ పదవులు కంటే ముందుగానే పాలనాపరంగా సలహాదారుల నియామక పూర్తి చేయాలని చంద్రబాబు ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. దీంతో..ఒకటి రెండు రోజుల్లోనే ప్రభుత్వం కీలక శాఖలకు సలహాదారుల నియామకం పైన అధికారికంగా ఉత్తర్వులు జారీ అయ్యే అవకాశం కనిపిస్తోంది.