Praveen Prakash: కావాలని ఎవర్నీ అవమానించలేదు: ప్రవీణ్‌ప్రకాష్ పశ్చాత్తాపం
వైకాపా ప్రభుత్వంలో అధికార పక్షంతో అంటకాగినట్లు ఆరోపణలు ఎదుర్కొన్న సీనియర్ ఐఏఎస్ ప్రవీణ్ ప్రకాష్ పశ్చాత్తాపం వ్యక్తంచేశారు. పాఠశాల విద్యాశాఖలో తాను కావాలని ఎవర్నీ అవమానించలేదని, ఎవరికైనా అలా అనిపిస్తే వారికి చేతులు జోడించి ప్రార్థిస్తున్నానని తెలిపారు. పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి స్థానం నుంచి ప్రభుత్వం ఆయనను బదిలీ చేసింది.
సచివాలయంలో గురువారం కొత్త కార్యదర్శి కోన శశిధర్‌కు బాధ్యతలు అప్పగించిన అనంతరం ప్రవీణ్ ప్రకాష్ ఓ వీడియోను విడుదల చేశారు. ‘గత ఏడాదిన్నరలో ఎన్నో నేర్చుకున్నాను. విద్యాశాఖ పురోగతి కోసమే కృషి చేశాను. నేను తనిఖీలతో ఉపాధ్యాయులు, సిబ్బందిని అవమానించానంటూ సామాజిక మాధ్యమాల్లో ఎన్నో వచ్చాయి. అభ్యసన సామర్థ్యాలు పెంచేందుకే మాట్లాడాను. ఎవర్ని అవమానించేందుకు అలా చేయలేదు. ఎవరైనా అలా భావిస్తే చేతులు జోడించి, ప్రార్థిస్తున్నాను. దయచేసి వాటిని మనసులో ఉంచుకోకండి. మరో మనిషిని అవమానించే గుణం నాకు లేదు’ అని తెలిపారు.