Arvind Kejriwal: కేజ్రీవాల్‌కు ఎదురుదెబ్బ.. బెయిల్ ఉత్తర్వులపై స్టే

www.mannamweb.com


దిల్లీ: మద్యం విధానానికి (Delhi Excise Scam Case) సంబంధించిన మనీలాండరింగ్‌ కేసులో అరెస్టయిన దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ (Arvind Kejriwal)కు మళ్లీ ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో ఆయనకు సాధారణ బెయిల్‌ మంజూరుచేస్తూ ట్రయల్‌ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను దిల్లీ హైకోర్టు (Delhi High Court) నిలిపివేసింది. కేజ్రీవాల్‌ బెయిల్‌ను వ్యతిరేకిస్తూ ఈడీ పిటిషన్‌ వేసిన నేపథ్యంలో న్యాయస్థానం ఈ ఆదేశాలిచ్చింది.

మద్యం కుంభకోణం కేసులో కేజ్రీవాల్‌ (Delhi CM Kejriwal)కు గురువారం సాయంత్రం రెగ్యులర్‌ బెయిల్‌ లభించింది. రూ.లక్ష వ్యక్తిగత బాండు సమర్పించిన తర్వాత ఆయన్ని విడుదల చేయవచ్చని న్యాయమూర్తి ఆదేశించారు. ఈ తీర్పుపై పైకోర్టులో అప్పీలు దాఖలు చేయడానికి వీలుగా దానిని 48 గంటలపాటు పక్కనపెట్టాలని ఈడీ (ED) చేసిన వినతిని ట్రయల్‌ కోర్టు తిరస్కరించింది. ఈ క్రమంలోనే నేడు ఆయన జైలు నుంచి విడుదల కావాల్సిఉండగా.. ఈడీ హైకోర్టును ఆశ్రయించింది.

ట్రయల్‌ కోర్టు ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ దర్యాప్తు సంస్థ పిటిషన్‌ దాఖలు చేసింది. ‘‘బెయిల్‌ (Kejriwal Bail)ను వ్యతిరేకించేందుకు మాకు సరైన అవకాశం లభించలేదు. వెకేషన్‌ మా వాదనలను వినిపించేందుకు సరిపడా సమయం ఇవ్వలేదు’’ అని ఈడీ తరఫు న్యాయవాది హైకోర్టుకు తెలిపారు. ట్రయల్‌ కోర్టు ఉత్తర్వులపై స్టే విధించి, తమ పిటిషన్‌పై అత్యవసర చర్యలు చేపట్టాలని అభ్యర్థించారు.

ఈ పిటిషన్‌ను స్వీకరించిన హైకోర్టు.. దీనిపై శుక్రవారమే విచారణ జరుపుతామని వెల్లడించింది. అప్పటివరకు ట్రయల్‌ కోర్టు ఇచ్చిన బెయిల్‌ ఉత్తర్వులను అమలుచేయొద్దని ఆదేశాలు జారీ చేసింది. దీంతో కేజ్రీవాల్‌ ప్రస్తుతానికి జైలు నుంచి విడుదలయ్యే అవకాశం లేకుండా పోయింది.