Anti Paper Leak Law: పేపర్‌ లీక్‌కు 10 ఏళ్ల జైలు.. రూ.కోటి వరకూ జరిమానా

Anti Paper Leak Law: పేపర్‌ లీక్‌కు 10 ఏళ్ల జైలు.. రూ.కోటి వరకూ జరిమానా


దిల్లీ: వరుస పేపర్‌ లీక్‌లతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న కేంద్ర ప్రభుత్వం అందుకు బాధ్యులైన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకొనేందుకు ది పబ్లిక్‌ ఎగ్జామినేషన్స్‌ (ప్రివెన్షన్‌ ఆఫ్‌ అన్‌ఫెయిర్‌ మీన్స్‌) యాక్ట్‌ 2024ను అమల్లోకి తెచ్చింది. ఇది జూన్‌ 21 నుంచి అమల్లోకి వచ్చినట్లు చెబుతూ శుక్రవారం గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో చట్టం చేసినా ఎన్నికల హడావుడి మొదలుకావడంతో అమలు తేదీని ప్రకటించలేదు.

గురువారం జరిగిన విలేకర్ల సమావేశంలో దీనిపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్రప్రధాన్‌ను ప్రశ్నించగా… న్యాయశాఖ నిబంధనలు రూపొందిస్తోందని, త్వరలో నోటిఫై చేస్తామని ప్రకటించారు. ఆయన ఆ వ్యాఖ్యలు చేసిన24 గంటల్లోనే కేంద్ర సిబ్బంది, వ్యవహారాలశాఖ ఈ చట్టాన్ని అమల్లోకి తెస్తూ నోటిఫికేషన్‌ జారీ చేసింది. దీని ప్రకారం ఎవరైనా చట్టవిరుద్ధంగా పరీక్ష పేపర్లను అందుకున్నా, ప్రశ్నలు, జవాబులను లీక్‌ చేసినా, పరీక్ష రాసే వారికి అనుచితంగా సాయం చేసినా, కంప్యూటర్‌ నెట్‌వర్క్‌ను ట్యాంపరింగ్‌ చేసినా, నకిలీ పరీక్షలు నిర్వహించినా, నకిలీ ప్రవేశపరీక్ష కార్డులు జారీ చేసినా నేరంగా పరిగణిస్తారు. కారకులకు 5 నుంచి 10 ఏళ్ల వరకు జైలుశిక్ష, రూ.కోటి వరకు జరిమానా విధించడానికి వీలుంది. ఇందులో భాగస్వాములు వ్యవస్థీకృత నేరానికి పాల్పడినట్లు రుజువైతే వారి ఆస్తులనూ జప్తు చేస్తారు. పరీక్ష నిర్వహణకు అయిన ఖర్చునూ వసూలు చేస్తారు. ఇక నుంచి పేపర్‌ లీకేజీ కేసులను ఈ చట్టం కింద నమోదు చేయనున్నారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.