Jagan stay at Pulivendula: పులివెందులకు జగన్, టూర్ వెనుక ఏం జరుగుతోంది?

www.mannamweb.com


YS Jagan stay at Pulivendula(AP political news): ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాల్లో ఏం జరుగుతోంది? వైసీపీ అధినేత జగన్ సడన్‌గా పులివెందుల టూర్ ఎందుకు పెట్టుకున్నట్లు? శనివారం ఉదయం నిర్మాణంలో ఉన్న వైసీపీ ఆఫీసును అధికారులు కూల్చేశారు. ఈ సమయంలో పులివెందులకు ఎందుకు వెళ్తున్నారు? అక్కడివాళ్లను అలర్ట్ చేయడానికే వెళ్తున్నారా? అధినేత లేకుంటే మా పరిస్థితి ఏంటని పార్టీలో ఫైర్‌బ్రాండ్లు ఎందుకు భయపడుతున్నారు? ఇలా రకరకాల ప్రశ్నలు ఆ పార్టీ నేతలను వెంటాడుతున్నాయి.

శనివారం నుంచి ఐదురోజులపాటు నేతలకు వైసీపీ అధినేత జగన్ దూరంగా ఉండనున్నారు. బుధవారం వరకు ఆయన అందుబాటులోకి రారు. ఐదురోజులపాటు అక్కడ ఏం చేయబోతున్నారనేది అసలు ప్రశ్న. ఇందుకు కారణాలు చాలానే ఉన్నాయట. ముఖ్యంగా శుక్రవారం రాత్రి భారతీరెడ్డి పీఏ వర్రా రవీంద్రారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. టీడీపీ ముఖ్యనేతలపై రెండేళ్లగా సోషల్‌మీడియాలో నెగిటివ్ పోస్టులు పెట్టడమే కారణంగా తెలుస్తోంది. దీని వెనుక మరో కారణం ఉంటుందని అంటున్నారు కడప జిల్లా నేతలు.

ప్రభుత్వం మారిన తర్వాత వైఎస్ వివేకానంద హత్య కేసు తెరపైకి రావచ్చని అంటున్నారు. వివేకా మరణం తర్వాత తొలుత ఫోన్లు అక్కడికే వచ్చాయని, ఈ క్రమంలోనే రవీంద్రారెడ్డిని అదుపులోకి తీసుకుని ఉంటారని చెబుతున్నారు. ఆయన పోలీసుల అదుపులో గనుక వుంటే వివేకా హత్యకు సంబంధించి కీలక విషయాలు బయటకు రావచ్చని అంటున్నారు.

ఇదే క్రమంలో కడప ఎంపీ అవినాష్‌రెడ్డికి కష్టాలు తప్పవని అంటున్నారు నేతలు. ఈ కేసులో ఆయన్ని అరెస్టు చేయాలని సీబీఐ భావించినప్పటికీ, అప్పటి ప్రభుత్వం ఆ ఛాన్స్ ఇవ్వలేదు. ప్రస్తుత పరిస్థితుల్లో వివేకా కేసు కంక్లూజన్‌కు రావాలంటే అవినాష్ అరెస్ట్ తప్పదని అంటున్నారు. అవినాష్‌ను అలర్ట్ చేయడానికి జగన్ వెళ్తున్నట్లు పార్టీలో అంతర్గత చర్చ.

జగన్ క్లోజ్ మద్దతుదారులు మాత్రం.. అవినాష్, మిథున్‌రెడ్డిలను బీజేపీలోకి పంపించేందుకు స్కెచ్ వేస్తున్నారని అంటున్నారు. గతంలో టీడీపీ కొంతమందిని బీజేపీలోకి ఎలా పంపిందో అదే విధంగా వైసీపీ అధినేత చేయబోతున్నట్లు చెబుతున్నారు. ఈ విధంగా చేయడం వల్ల అవినాష్ అరెస్ట్ తప్పుతుందని అంటున్నారు. శుక్రవారం అసెంబ్లీ లాబీల్లో జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి ఆ తరహా వ్యాఖ్యలు చేశారని అంటున్నారు. అయితే బీజేపీ నాయకత్వం మాత్రం వాళ్లని వద్దని అంటోందని గుర్తు చేశారు. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తాము గట్టిగా మాట్లాడామని ఉన్నపళంగా జగన్ పులివెందులకు వెళ్తే మా పరిస్థితి ఏంటన్నది మరికొందరి నేతల ప్రశ్న.