వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు పింఛన్ల పంపిణీకి సంబంధించిన మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేసింది. ఇప్పటికే పింఛన్ల పంపిణీ గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల ద్వారా చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే.
ఇక సచివాలయ ఉద్యోగులకు ఒక్కొక్కరికి వారు పనిచేస్తున్న సచివాలయ పరిధిలో గరిష్టంగా 50 మంది పింఛనుదారులను కేటాయిస్తారు. సచివాలయ ఉద్యోగులు సరిపడా లేకపోతే స్థానికంగా పనిచేసే ఇతర ప్రభుత్వ ఉద్యోగుల సేవలను పింఛన్ల పంపిణీ కోసం వినియోగించుకుంటారు.
దీనికి సంబంధించిన మార్గదర్శకాలను గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌కుమార్ బుధవారం విడుదల చేశారు. ఆయా జిల్లాల కలెక్టర్లు దీనికి సంబంధించి చర్యలు చేపట్టాలని ఆయన ఆదేశించారు. ఉద్యోగులు ప్రతి నెలా ఒకటో తేదీ ఉదయం 6 గంటలకు పింఛన్ల పంపిణీని ప్రారంభించాలి. అదేరోజు అత్యధిక మందికి పంపిణీ చేయాలి. మిగిలిన వారికి రెండో తేదీ కల్లా పింఛన్లు అందేలా చూడాలని కలెక్టర్లకు సూచించారు.
ఇక లబ్ధిదారులకు ఆధార్ బయోమెట్రిక్, ముఖ గుర్తింపు, ఐఆర్‌ఎస్‌ఐఎస్ తదితర విధానాల్లో పింఛన్లు పంపిణీ చేయాలి. ఎయిడ్స్ రోగులతో పాటు దివ్యాంగుల కేటగిరీలో పింఛను పొందుతూ వివిధ ప్రాంతాల్లో చదువుకునే వారికి డీబీటీ విధానం ద్వారా బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ చేస్తారు. ప్రస్తుతం ప్రతి నెలా రూ.3 వేల చొప్పున 11 కేటగిరీల లబ్ధిదారులకు ఇస్తున్న పింఛను మొత్తాన్ని రూ.4 వేలకు పెంచారు. గత మూడు నెలల నుంచి పింఛన్ల పెంపు అమలు చేయాలని నిర్ణయించిన నేపథ్యంలో జూలై పింఛనుతో బకాయిలు కలిపి రూ.7 వేల చొప్పున అందిస్తారు. దివ్యాంగులు, కుష్టువ్యాధిగ్రస్తుల పింఛన్ రూ.6 వేలకు పెంచి పంపిణీ చేయనున్నారు. ఈ మేరకు శశిభూషణ్‌కుమార్ తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.