వైసీపీకి బిగ్ షాక్.. పార్టీకి నటుడు అలీ గుడ్ బై

www.mannamweb.com


వైసీపీ పార్టీకి మరో ఎదురు దెబ్బ తగిలింది. ఆ పార్టీకి నటుడు అలీ రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను ఆయన పార్టీ అధ్యక్షుడు వైఎస్. జగన్‌కు పంపించారు.అలీ 2019 ఎన్నికల ముందు వైసీపీలో చేరారు.

ఆ ఎన్నికల్లో వైసీపీలో చేరిన అలీ..పార్టీ అభ్యర్థుల తరుఫున ఎన్నికల ప్రచారం కూడా నిర్వహించారు. వైసీపీ అధికారంలోకి రావడంతో అలీకి ఎమ్మెల్సీ లేదా రాజ్యసభ పదవులు ఇస్తారనే ప్రచారం జరిగింది.

అయితే ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుడు పదవితో అలీ సరిపెట్టుకోవాల్సి వచ్చింది. సినిమా ఇండస్ట్రీ మొత్తం కూడా జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటే అలీ మాత్రం వైసీపీకి అండగా నిలిచారు. వైసీపీకి మద్దతు తెలిపిన కొద్ది మంది ఇండస్ట్రీవాళ్లలో అలీ మొదటి వరుసలో ఉంటారు. పార్టీ కోసం చాలా కష్టపడ్డారు. దీంతో అలీకి మంచి పదవి దక్కుతుందని అంతా ఆశించారు. కానీ అలీకి వైసీపీలో ఎటువంటి పదవులు లభించలేదు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఆయన వైసీపీ నుంచి ఎమ్మెల్యే లేదా ఎంపీగా పోటీ చేయడం ఖాయంగా అనుకున్నారంతా.

నంద్యాల, గుంటూరు పార్లమెంట్ స్థానాలకు అలీ పేరును పరిశీలిస్తున్నట్టుగా వార్తలు వచ్చాయి. కానీ అలీకి ఎన్నికల్లో ఎక్కడా కూడా సీటు దక్కని పరిస్థితి. దీంతో అలీని జగన్ రాజ్యసభకు పంపిస్తారని అంతా భావించారు కానీ ఆ ఆశలపై కూడా జగన్ నీళ్లు చల్లారు. ఈక్రమంలో అలీ వైసీపీలో ఉంటారా లేదా అనే అనుమానాలు తెర మీదకు వచ్చాయి. ఈ ఎన్నికల్లో అలీ ప్రచారానికి దూరంగా ఉన్నారు. తాజాగా జరిగిన ఎన్నికల్లో వైసీపీ ఓడిపోవడంతో ఆయన పార్టీకి రాజీనామా చేస్తునట్టు ప్రకటించారు.