Team India: పైసా వసూల్.. మ్యాచ్ ప్రతి దశలో నరాలు తెగే ఉత్కంఠ..!
టీ20 ప్రపంచకప్ ఫైనల్స్‌లో ఓ హైవోల్టేజీ మ్యాచ్ ఆవిష్కృతమైంది. బ్యాటింగ్.. బౌలింగ్‌లో భారత్ పని అయిపోయిందనుకొన్న ప్రతిసారి నేలను తాకిన బంతిలా ఎగసిపడింది. ఓటమి కోరల్లో చిక్కుకొన్న మ్యాచ్‌ను దేశం కోసం గెలిచి చూపింది.
ఫ్యాన్స్ ఉసూరుమంటూ టీవీలు ఆఫ్ చేయడానికి సిద్ధమైన ప్రతిసారి.. వారిని ఆగండి అంటూ వారించేలా టీమ్ ఇండియా మ్యాచ్‌లో కోలుకుంది. మేం దేశం కోసం చివరి వరకు పోరాడతాం.. మమ్మల్ని నమ్మండి అంటూ ఓటమిపై తిరగబడింది. పొట్టి ప్రపంచకప్ ఫైనల్స్‌లో అత్యంత థ్రిల్లింగ్ మ్యాచ్‌ల్లో ఇదీ ఒకటి. ఇందులో హీరో ఎవరూ అంటే.. ఒక్కరు కాదు.. లెవన్స్టార్స్ అని చెప్పే సమష్టి విజయం ఇది. ఈ తరం వాళ్లు మేం 2024 టీ20 ఫైనల్స్ లైవ్‌లో చూశాం అని గొప్పగా చెప్పుకొనే స్థాయి ఈ గెలుపుది. ఈ మ్యాచ్‌ను మన పక్షాన నిలబెట్టిన అంశాలు ఇవే..
సంక్షోభంలో కోహ్లీ అవగాహన అద్భుతం..
టీ20 ఫార్మాట్లోనే నరాలు తెగే టెన్షన్ ఉంటుంది. కళ్లుమూసి తెరిచేలోపు ఇన్నింగ్స్ అయిపోతుంది. నిర్ణయాలు శరవేగంగా తీసుకోవాలి. ఒక చిన్న తప్పుడు వ్యూహం కూడా మ్యాచ్‌ను దూరం చేస్తుంది. రోహిత్-కోహ్లీ జోడీ ఫోర్లతో జోరుగానే ఇన్నింగ్స్‌ను ప్రారంభించింది. కానీ, రోహిత్, పంత్, సూర్య వికెట్లు వెంటవెంటనే కోల్పోవడంతో జట్టు 34/3తో పీకల్లోతు కష్టాల్లో పడింది. భారీ స్కోర్ ఆశలు ఆవిరైపోయాయి. స్కోర్ 100 దాటక ముందు జట్టు పెవిలియన్‌కు క్యూకట్టకుండా అడ్డుకోవాలి.
ఈ దశలో కోహ్లీ ‘ప్రజెన్స్ ఆఫ్ మైండ్’ ఇక్కడ అద్భుతంగా పనిచేసింది. అనవసరమైన దూకుడును తగ్గించాడు.. మరో వికెట్ పడకుండా అక్షర్‌తో కలిసి సింగిల్స్, డబుల్స్‌తో స్కోర్ బోర్డ్‌ను ఎక్కడా 7 రన్‌రేట్ తగ్గకుండా ముందుకు నడిపించాడు. అప్పుడప్పుడు అక్షర్ దాడి చేసినా.. తాను బ్యాలెన్స్ కోల్పోలేదు. స్కోర్ బోర్డు 100 దాటాక మెల్లగా వేగం పెంచాడు. ఈ క్రమంలో అక్షర్ పెవిలియన్‌కు చేరినా.. దూబెతో కలిసి చకచకా పరుగులు చేశాడు. చివరికి వచ్చేసరి రన్‌రేట్ 8 దాటించాడు. బార్బడోస్ వంటి పిచ్‌లపై ఇది విజయాన్ని ఇవ్వగలదు. ఇక వ్యక్తిగత స్కోర్ 50 దాటాక తన స్ట్రైక్‌రేట్‌ను కూడా పెంచుతూ షాట్లు కొట్టడంతో మ్యాచ్ స్వరూపమే మారిపోయింది. ఈ జట్టా 34/3గా నిలిచింది? అనిపించింది. ఈ వికెట్ పై సగటు 159.. కానీ, భారత్ 176 చేసింది. కోహ్లీ అనుభవంతో మ్యాచ్‌పై భారత్ పట్టు కొనసాగింది.
రోహిత్ లెక్క తప్పలేదు..
దక్షిణాఫ్రికాను బ్యాటింగ్‌లో కట్టడి చేసే బాధ్యత బుమ్రా అండ్ కో భుజస్కందాలపై పడింది. అర్ష్‌దీప్, బుమ్రా అద్భుతమైన ఆరంభం ఇస్తూ.. హెండ్రిక్స్, మార్క్రమ్ను స్వల్పస్కోర్లకే పెవిలియన్‌కు చేర్చారు. కానీ, టీమ్ఇండియా ఆనందం కొద్దిసేపట్లోనే ఆవిరైపోయింది. స్టబ్స్, డికాక్, క్లాసెన్ నిలకడగా షాట్లు కొట్టి అవసరమైన రన్‌రేట్‌ను తగ్గించారు. చివర్లో క్లాసెన్‌కు తోడు కిల్లర్ మిల్లర్ నిలవడంతో 15వ ఓవర్లో అక్షర్ బౌలింగ్‌లో రెండు ఫోర్లు, రెండు సిక్స్‌లతో 24 పరుగులు పిండారు. దీంతో అవసరమైన రన్‌రేట్ 6కు చేరింది. ఆరు వికెట్లు చేతిలో ఉండటంతో సఫారీల విజయం నల్లేరుపై బండి నడకే అనుకొన్నారు.
అదే సమయంలో పంత్ కాలికి పట్టీ వేయించుకోవడానికి మ్యాచ్ కొద్దిసేపు ఆగింది. అప్పటికే స్పిన్నర్లు తొమ్మిది ఓవర్లు వేసి 106 పరుగులు ఇచ్చారు. ఆ స్థితిలో రన్‌రేట్‌ను తక్షణమే అడ్డుకొంటే మ్యాచ్ తమ చేతిలో మిగిలి ఉంటుందని హిట్‌మ్యాన్‌కు అర్థమైంది. బుమ్రా, అర్ష్‌దీప్, హార్దిక్, జడ్డూకే ఓవర్లు మిగిలి ఉన్నాయి. ఈ నేపథ్యంలో బంతి బుమ్రా చేతికి వెళ్లింది. ఫలితంగా 16వ ఓవర్లో సఫారీలకు కేవలం నాలుగు పరుగులే వచ్చాయి. ఆ తర్వాత 17వ ఓవర్ బాధ్యతను వైస్ కెప్టెన్ పాండ్యా అందుకొని.. ప్రమాదకరంగా మారిన క్లాసెన్‌ను తొలి బంతికే ఔట్ చేశాడు. పైగా మొత్తంగా 4 పరుగులే ఇచ్చాడు. దీంతో ఒత్తిడి సఫారీల జట్టువైపునకు షిఫ్ట్ అయింది.
సరైన సమయంలో బుమ్రాస్త్రం..!
ఇక తురుపు ముక్క బుమ్రాకు ఒక్క ఓవరే మిగిలి ఉంది. అతడితో 20వ ఓవర్ వేయించేందుకు దాచొచ్చు. కానీ, రోహిత్ ఆలోచన వేరేగా ఉంది. మిల్లర్ క్రీజులో ఉండగా.. కుర్రాడైన అర్ష్‌దీప్ ఇప్పుడు పరుగులు కట్టడి చేయకపోతే మ్యాచ్ 20వ ఓవర్ వరకు పోయే పరిస్థితి రాదు. అప్పుడు బుమ్రా ఓవర్‌ను ఆపి ఉపయోగం ఉండదు. అందుకే.. బంతిని తిరిగి జస్సీ చేతికే ఇచ్చాడు. అతడు కూడా డాట్ బాల్స్‌తో తన చివరి ఓవర్ ప్రారంభించాడు. యాన్సెన్‌పై ఒత్తిడి పెంచి.. ఓ అద్భుతమైన ఇన్‌స్వింగర్‌తో అతడి బెయిల్స్ ఎగరగొట్టాడు. ఆ ఓవర్లో సఫారీలకు వచ్చింది రెండు పరుగులే. వారు ఇంకా 12 బంతుల్లో 20 రన్స్ చేయాలి. ఈ సమయంలో అర్ష్‌దీప్ చేతికి బంతిని అందించాడు. కేవలం పరుగులు కట్టడి చేయడమే అతడి బాధ్యత. కొత్తగా క్రీజులోకి వచ్చిన మహారాజ్‌ను లక్ష్యంగా చేసుకొని సర్దార్ డాట్‌బాల్స్ వేశాడు. మిల్లర్ షాట్లు కొట్టేందకు వీలు లేకుండా లోపలికి వచ్చే బంతులు విసిరాడు. ఫలితంగా 19వ ఓవర్లో దక్షిణాఫ్రికా 4 పరుగులతో సరిపెట్టుకొంది.
టెన్షన్ ఓవర్.. సూపర్ క్యాచ్
6 బంతుల్లో 16 పరుగులు చేయాలి. మిల్లర్ క్రీజులో ఉన్నాడు. హార్దిక్ తొలి బంతే ఊరిస్తూ లోవైడ్ ఫుల్‌టాస్ వేశాడు. ఈ ఉచ్చులోపడ్డ మిల్లర్ భారీషాట్‌కు యత్నించాడు. బౌండరీకి మిల్లీమీటర్ల దూరంలో క్యాచ్ అందుకొన్న సూర్య బ్యాలెన్స్ చేసుకోలేకపోయాడు.. దీంతో తిరిగి బంతిని గాల్లోకి ఎగరేసి బౌండరీ దాటేశాడు. బాల్ నేలను తాకేలోపే తిరిగి మైదానంలోకి దూకుతూ ఒడిసి పట్టేశాడు. ఈ రిలే క్యాచ్‌తో మ్యాచ్ ఒక్కసారిగా భారత్ పక్షానికి మళ్లింది. ఆ బాల్‌కు తర్వాత ఒక ఫోర్ ఇచ్చినా.. ఐదో బంతిని ఆఫ్‌స్టంప్ బయటకు విసిరాడు. భారీ షాట్‌కు యత్నించిన రబాడ సూర్యకు క్యాచ్ ఇవ్వడంతో భారత్ విజయం ఖాయమైంది. మ్యాచ్‌లో ఎక్కడా భారత్ ఒత్తిడిని బయటకు కనిపించనీయలేదు. చివరి వరకు పోరాడుదామానే తెగింపును ప్రదర్శించింది.